చెమటలు పట్టించిన చిల్లర చిత్రం: -- యామిజాల జగదీశ్

 లెక్కలంటే చిన్నప్పుడే కదు ఇప్పటికీ తికమకే. తొమ్మిదో క్లాసులో గోపాలచారి మాష్టారు నాకు లెక్కల్లో గుండు సున్న వేసినప్పటి నుంచీ లెక్కలంటే హడల్. అలాగని లెక్కల్ని పట్టించుకోకుండా ఉండగలనా అంటే లేదనే అంటాను. అన్నట్టు మనల్ని కంగారు పట్టించే వాటికే మరింత తలొగ్గుతుంటాం. అది మన బలహీనతే. లెక్కల సబ్జెక్టులోనే కాదు, జీవితంలోనూ నా లెక్కలన్నీ తప్పులే. ఒక్కటీ నా అంచనాలకు తగ్గట్టు ఉండదు. నేనొకటి అనుకుంటే లెక్కలు తనిష్టమొచ్చినట్టు ఆటాడించి వినోదం చూస్తుంటుంది. నన్ను చూసి నవ్వుతుంటుంది కూడా. 
ఈరోజు ఉదయం ఓ అయిదు వందల రూపాయలు తీసుకుని ఓ కిరాణా దుకాణంలోకి అడుగుపెట్టాను. ఏం కావాలని అడిగితే ఓ నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను. ఎంతయిందంటూ అయిదు వందల నోటు అతనికిచ్చాను. 77 రూపాయలైందని ఇవ్వవలసిన మిగిలిన డబ్బులు నాకిచ్చాడు. అవి లెక్కపెట్టుకోక జేబులో పెట్టేసుకుని దుకాణంలో నించి బయటకు వచ్చాను. పక్కనే ఉన్న వీధిలోకి అడుగులు సారించాను. 
ఓ ఇరవై అడుగులు వేసానోలేదో ఓ కుర్రాడు సైకిల్ మీద వచ్చి నన్నాపాడు. 
మా అయ్య రమ్మంటుండు అన్నాడా కుర్రాడు. 
ఏమైందో ఏమిటో అనుకుని మళ్ళీ దుకాణంలోకెళ్ళాను. 
మీకెంతిచ్చానండి అని అడిగాడు షాపతను. 
తెలీదు...మీరిచ్చింది జేబులో పెట్టేసుకున్నాను అన్నాను.
అలాగైతే ఎలా సార్...చూసుకోవాలి కదండీ...నేను మీకెక్కువిస్తే నాకు నష్టం. నేను మీకు తక్కువిస్తే మీకే నష్టం అంటూ నేనిచ్చినవి తిరిగివ్వండి...ఏం కొన్నారో చెప్పండి అన్నాడు. 
సంచీలోవి తీసి దుకాణయజమాని ముందు పెట్టాను. అవి చూసి లెక్కేసాడు. నేనిచ్చిన డబ్బులు లెక్కపెట్టాడు. లెక్క తక్కువైందంటూ అవి లోపల పెట్టుకుని మళ్ళీ లెక్క చూసుకుని నాకిస్తూ ఓ మూడు రూపాయలుంటే ఇవ్వండన్నాడు. జేబులో ఉన్న మూడు రూపాయల చిల్లర ఇచ్చాను. ఆ తర్వాత నాకెంతో ఇచ్చాడు. సార్ సార్ ఓ సారి లెక్క చూసుకోండి యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చినట్టున్నాను అన్నాడు. 
నా జేబులో ఉన్నది వాడికిచ్చేసాను. అవి లెక్క పెట్టుకుని యాభై కాదు సార్ డెబ్బయ్ రూపాయలు ఎక్కువిచ్చాను సార్ అంటూ మళ్ళీ లోపల నుంచి ఎంతో కొంత తీసి నాకిచ్చాడు. ఇలా మరో సారి చేసేసరికి నాకు ఒళ్ళు మండి ననీకూ నాకూ ఎందుకుగానీ నీ దగ్గర కొన్న సరుకు నాకక్కరలేదు, నువ్వు తీసేసుకుని నేనిచ్చిన అయిదు వందల రూపాయలిచ్చేసే పోతానన్నాను. 
అలా వెనక్కు తీసుకోవడం కుదరదు సార్, ఒకసారి కొంటే కొన్నట్టే... తీసుకుపొండి అక్కరలేదంటే నాకు సంబంధం లేదు. అది మీరేం చేసుకున్నా నాకనవసరం...అంటుంటే ఇంతలో పక్కనున్న ఓ వ్యక్తి "ఓ పెద్దాయనా‌, మీరతను చిల్లర ఇచ్చిన మొదటిసారే లెక్కపెట్టుకోకపోవడంవల్ల ఇంత గందరగోళం...మిమ్మల్నే చూస్తాడా ....మమ్మల్ని చూస్తాడా....లెక్కలు రాకుంటే ఎలాగండి అన్నాడు. 
అప్పుడు నేను "అవును నిజమేనండి. బలే కనిపెట్టారండి...నాకు లెక్కలంటే అలర్జీ అని. అందుకేనండి జీవితంలోనూ తంటాలు పడుతూనే ఉన్నా...." అని చెమటలు పట్టిన అసహనపు ముఖంతో దుకాణంలోంచి బయటకు వచ్చాను. 

కామెంట్‌లు