మరుగుజ్జు వృక్షాలు ఓ కళ:-- యామిజాల జగదీశ్


 నా పుట్టుక మద్రాసులోనే అయినప్పటికీ నేను మరుగుజ్జు మొక్కలను మొట్టమొదటగా చూసింది హైదరాబాద్ లోనే. నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రతి ఏటా ఉద్యానవన శాఖ నిర్వహిస్తూ వచ్చిన పూలమొక్కల ప్రదర్శనకు తప్పనిసరిగా వెళ్ళేవాడిని. అలా వెళ్ళిన ప్రతిసారీ మరుగుజ్జు వృక్షాలను ఎంతో ఆసక్తితో చూసేవాడిని. 
అయితే ఇటీవల ఒ తమిళ వారపత్రిక తిరగేస్తుంటే మరుగుజ్జు వృక్షాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఓ వ్యక్తి గురించి చదివాను. అతను మధ్యప్రదేశ్ కి చెందినతను. తన ఇంటి డాబాపై 2,500 బోన్సాయ్ వృక్షాలతో ఓ చిన్నపాటి అటవిని సృష్టించి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి పదవీ విరమణ చేసిన సోహన్ లాల్ ద్వివేది బోన్సాయ్ వృక్షాలను పెంచడానికి కారకులు ముంబైకి చెందిన ఓ మహిళ. ఆమె 250మరుగుజ్జు వృక్షాలను పెంచుతున్న విషయాన్ని ఓ పత్రికలో చదివి స్ఫూర్తిగా తీసుకునే సోహన్ లాల్ ఈ పొట్టి చెట్ల పెంచడానికి శ్రీకారం చుట్టాడు. ఆ వ్యాసాన్ని అతను నలభై ఏళ్ళ క్రితం చదివాడతను.
మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ నివాసి అయిన సోహన్ లాల్ నలబై రకాలకు చెందిన రెండున్నర వేల మరుగుజ్జు వృక్షాలను పెంచి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు.
ఆపిల్, జామ, పియర్, చింత ఇలా రకరకాల చెట్లను ఆయన పెంచడం విశేషం. వీటిని పెంచడంకోసం తన జీతాన్నంతా ఖర్చుపెడుతూ వచ్చాడు. తనకు తెలిసిన వారిలో చాలా మంది మొక్కలకు దూరంగా ఉండేవారని, కానీ తాను వీలున్నంత ఎక్కువ సమయాన్ని ఈ మొక్కలకోసం కేటాయిస్తూ వచ్చానన్నాడు సోహన్ లాల్. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో దాదాపు రోజంతా డాబా మీద మొక్కల మధ్యే గడిపానన్నాడు. ఇందువల్ల స్వచ్ఛమైన గాలిని పీల్చగలుగుతున్నానని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా డాబా అంతా పచ్చగా నిగనిగలాడుతుండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నాడు. 
అయితే మరుగుజ్జు వృక్షాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుటలకెక్కిన వారు ఓ మహిళ. ఆమె పునెకు చెందిన ప్రజక్తా గిరిధారి కాలే.  ఆమె దాదాపు ముప్పై అయిదేళ్ళపాటు బొన్సాయ్ వృక్షాలను పెంచడంలో నిమగ్నమయ్యారు. ఆమె 3,333 బోన్సాయ్ వృక్షాలు సేకరించి స్వామి గణపతి సచ్చిదానంద గారి పేరిట ఉన్న ప్రపంచ రికార్డయిన 2649 బోన్సాయ్ వృక్షాల లెక్కను అధిగమించారు. ఆయన పేరిట మైసూరులో 2016 డిసెంబర్ 21వ తేదీన నమోదైన రికర్డును కాలే తిరగరాశారు.
కాలే మాట్లాడుతూ బోన్సాయ్ వృక్షాలకు సంబంధించి ఓ కోర్స్ ప్రారంభించాల నుకున్నట్లు గిన్నిస్ రికార్డును తిరగరాసిన రోజున చెప్పారు. బోన్సాయ్ వృక్షాలను పెంచడం ఓ కళ అని, గ్రామీణ ప్రాంత మహిళలు, యువకులు ఈ కళపై పట్టు సాధిస్తే బాగుంటుందన్నారు. బోన్సాయ్ కళ వల్లే తనలో ఓర్పుతోపాటు ఓ కొత్తది సృష్టించాలనే ఆరాటం, మెరుగైన వ్యక్తిగా ఎదిగే తీరునూ పెంపొందాయన్నారు. వీటివల్ల పాజిటివ్ గా ఆలోచించేది అలవడిందన్నారు. 
కాలే తమ సంస్థ బోన్సాయ్ నమస్తేతో పునెలో ప్రపంచంలోనే భారీ ఎత్తున బోన్సాయ్ సదస్సుని నిర్వహించడమే కాక వెయ్యి బోన్సాయ్ వృక్షాలతో ఓ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి ప్రశంసలందుకున్నారు. ఈ బోన్సాయ్ సదస్సుకి ఇరవై దేశాల ప్రతినిధులు విచ్చేశారు.
చైనాలో పుట్టిన ఈ "బోన్సాయ్ కళ" తర్వాత జపాన్ కు విస్తరించింది. కానీ జపాన్లో బోన్సాయ్ కళ మొదట్లో ధనవంతులకే పరిమితమైంది. తర్వాత బోన్సాయ్ కళ అన్ని వర్గాలవారికి విస్తరించింది. 
ఇక ప్యారిస్ లో 1878 లో మొట్ట మొదటిసారిగా తృతీయ యూనివర్సల్ ఎగ్జిబిషన్ లో బోన్సాయ్ ప్రదర్శన జరిగింది. అనంతరం 1889, 1900 లో జరిగిన ప్రదర్శనలతో పశ్చిమ దేశాల్లో బోన్సాయ్ కళ పట్ల ఆదరణ పెరిగింది. 
లండన్లో 1909 లో మొదటిసారి భారీ ఎత్తున బోన్సాయ్ ప్రదర్శన జరిగింది.
18, 19 శతాబ్దాలలో భారతదేశంతో సహా ప్రపంచమంతటా ఈ బోన్సాయ్ కళ విస్తరించినట్టు చరిత్ర పుటల్లో నమోదైంది.


కామెంట్‌లు