వారి మధ్య స్నేహానికి వారధి మల్లాదివారు!!:-- యామిజాల జగదీశ్ ఆ ఇద్దరి మధ్య ఉన్న స్నేహానుబంధం సామాన్యమైనది కాదు. ఇద్దరూ రచయితలే. ఒకరికి కావ్యకంఠ గణపతిమునిగారు గురువై వారింటి ఆతిథ్యానికి రాగా వారి కుమార్తె వజ్రేశ్వరమ్మగారు ఇంకొకరింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడం... తలచుకుంటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. వారిలో ఒకరు యామిజాల పద్మనాభస్వామిగారు. మరొకరు  పాత్రికేయులు జి. కృష్ణగారు. వీరిద్దరి మధ్య స్నేహం కుదిర్చింది మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు టీ.నగర్లోని తిరుమూర్తి స్ట్రీట్లో నివాసముండేవారు. అదే ఆవరణలోనే కృష్ణగారుకూడా అద్దెకుండేవారు.  ఆంధ్రపత్రికలో ఆదివారాలు ఓ పది పన్నెండు పుస్తకాలపై సమీక్షలు వస్తుండేవి. వాటిలో కొన్ని యామిజాలవారు రాయగా మరికన్ని కృష్ణగారు రాసేవారు. వీరింటికి దగ్గర్లోనే ఉండే తిలక్ స్ట్రీట్లో డోర్ నెంబర్ 8B లో మేము అద్దెకుండేవాళ్ళం. 
"ఒరేయ్ మీ నాన్నగారు వ్యాకరణాలను కథలు కథలుగా చెప్పేవారురా" అని మా మావగారైన కృష్ణగారు నాతో అంటుండేవారు. 
"మా మైత్రీ బంధం విద్యానుబంధం, సహృదయానుబంధం,  జన్మాంతర సుకృతం" అని కృష్ణగారు ఓ చోట రాసుకున్నారు. 
చలంగారి రాతలు వాతలని యామిజాలవారంటే కృష్ణగారేమన్నారో ఈ కింద చూద్దాం.
ఇద్దరూ ఎవరి కోణంలో వారు చలంగారిని చూశారు. ఇద్దరూ తమదైన శైలిలో చలంగారిపై వ్యాసాలు రాశారు. యామిజాలవారు రాసిన విషయం తెలుసుకానీ కృష్ణగారు రాసిన వ్యాసాన్ని ఇప్పుడే మొదటిసారిగా చదివే భాగ్యం కలిగింది. అదీనూ చలంగారింట పుట్టిపెరిగిన చిత్రగారి కూతురు కాకా (జయశ్రీ) తన కూతురు శాంతితో పంపడం. చలం శతజయంతి పురస్కరించుకుని కృష్ణగారు 1994లో రాసిన వ్యాసం ఆంధ్రప్రభలో వచ్చింది. అందులోని కొంత భాగం ఇక్కడ ఇస్తున్నాను....
తెలుగు రచనా రంగానికి చలం రాక, చాలా లాంఛనాలను నిరర్థకం చేసింది. చలం ఒక విధంగా పత్రికా విలేఖరిలాంటివాడు. మానవ ప్రవర్తనా సరళిని, ధర్మాలతో ఆచారాలతో కలపకుండా చూడగలిగాడు. ధర్మాలు, ఆచారాలు కలిసినప్పుడు ఎంత దారుణంగా మానవనైజం మారుతుందో చెప్పాడు. ఇక సాటి రచయితలు కొందరు ఆయనపై దుష్ప్రచారం ప్రారంభించారు. చలంపై దుష్ప్రచారం చేసిన వాళ్ళు పాఠకులు కాదు. సాటి రచయితలే. తమ శీలాలకు రహస్య జీవనం కల్పించుకొనగలిగిన రచయితలే. ధర్మశాస్త్ర గ్రంథాల నుంచి ధర్మాన్ని చలం లాగివేశాడన్నంతగా కొందరు రచయితలు బాధపడ్తూ ఉండేవాళ్ళు. ఇది నేను ఎరుగుదును. నేను విన్నదే. 
నేను చాలా రచయితల మహాసభలకు వెళ్ళాను గానీ ఎక్కడా చలాన్ని చూడలేదు. మన రచయితలలో వాల్మీకిని, వ్యాసుని, షెల్లీని, కీట్సుని, కాళిదాసుని, మాయకోవ్ స్కీని, వగైరాలను అనుసరించిన ఘనులున్నారు. వీళ్ళను అనుసరించే అనుయాయులూ ఉన్నారు. కానీ చలం పద్ధతి చలందే. చలం సాహిత్యం ఉంది.....
మన రచయితలు పలువురు ఎవడో కూర్చిన ముత్యాల సరంలో ఒక ముత్యం. అదొక తృప్తి. ఒక సోకు. కానీ చలం ఎవరికీ ఉప మనిషి కాదు.
ఇట్లా అని నేను అనుకుంటూ ఉండేవాణ్ణి.
తన సంగతి, దాపరికం లేకుండా చలం చెప్పుకునే వాడు కదా. పోనీ తవకు కల వచ్చిందని, దానిలో దేవుడు కనపడినాడనీ, ఏదో చెప్పినాడనీ చలం గొప్పలు చెప్పుకోలేదు. చలం ఏనాడూ దేవునిపై దుష్ప్రచారం చేయలేదు. దేవుణ్ణి హాస్యాస్పదం చేయలేదు. అన్నట్లు చలానికి ఎవళ్ళయినా సన్మానం చేశారా.
చలం తన లోకాన్ని తాను సృషించుకున్నాడు..... ఆయన లోకానికి ఎవ్వళ్ళూ వెళ్ళలేకపోయారు. ఆయన తన లోకంలో ఉండి ఏక్ తార్ వాయించుకుంటూ చేపలు తింటూ వనంలోంచి పోతుంటే ఇతడికి అక్కడ ఎవ్వరో దుశ్శాలువలు, వెయ్యినూటపదహార్లు ఆడవాళ్ళు పలుకుబళ్ళు ఇస్తున్నార్రోయ్ అని సాటి రచయితలనేకులు భ్రమపడ్డారు. ఎంత భ్రమపడినా ఏమీ కాలేదు. ఆయన పయనం ఆగలేదు.
ఆయన ఏ స్వాములారి వద్దకూ వెళ్ళలేదు.
ఏ రాజకీయ గురువు వద్దకూ వెళ్ళలేదు.
తీరా పిచ్చెమ్మ వద్దకు వెళ్ళాడు. ఆశ్రయం ఇచ్చింది.
ఆ పైన శ్రీ రమణుని వద్దకు వెళ్ళాడు. ఆశ్రయమిచ్చాడు.
ఆధ్యాత్మిక జీవితంలోకే ఆయన మహా ప్రస్థానం.
ఆ మహా ప్రస్థానంలోనే ఆయనను చూశాడు. అదే చెపుతున్నాను.
చలంగారి ఇంట్లో మానవతా వాతావరణం కానవచ్చింది.
వాళ్ళలో ఎవ్వరికీ మతం, కులం లేవు. ఆ ఇంట్లో వాళ్ళు ఏ అవకతవకలైనా చేస్తారో చేయగలరో నేను చెప్పలేను. గానీ మానవతకు మాత్రం ద్రోహం చేయలేరు. అదేమో వాళ్ల ఇంట్లో ఎవ్వరి పేరూ కులసూచకం కాదు. వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ ఎవరినీ తక్కువగా చూడటం అనేది లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన అతిథి, వెళ్లిననాడు ఏ మర్యాదను పొంది ఉంటాడో అదే మర్యాదను అంతే మర్యాదను ఎన్నాళ్ళయినా పొందుతూనే ఉంటాడు.....
అన్నట్లు చలంగారు గురువు కాదు. కానీ ఆయనకు ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళ పట్ల భక్తిప్రపత్తులు ఉన్నాయి. ఆయన కుమార్తె సౌరీస్ అటువంటి సాధకురాలు. పిచ్చెమ్మ వద్ద ఎట్లా శరణుజొచ్చాడో సౌరీస్ దగ్గరా అట్లాగే ప్రపత్తి చూపేవాడు.
శ్రీ రమణాశ్రమాన్ని ఆధ్యాత్మికంగా ఆశ్రయించుకున్న వాళ్ళందరినీ గురించి రాశాడు. చక్కటి కథలు....వాటిని చూసి చలం గొప్ప పత్రికావిలేఖరిలాంటి వాడు అని ఈ వ్యాసం ప్రారంభించాను....
శ్రీ రమణాశ్రమానికి వెళ్లటం, మతం పట్ల ఆదరం వలన కాదు.
శ్రీరమణుడు నిన్ను నీవు తెలుసుకో అన్నాడు. అదే ఉత్తమ సాధన అన్నాడు. ఆ సాధన ఒక మతానికి చెందినది అనలేం కదా. నిజంగా అది మతాతీత ఆధ్యాత్మిక సాధన. శ్రీరమణుని కూడా ఒక మత గురువుగా చూపెట్టే జనం ఉన్నారు. కానీ చలం అట్లాంటి వ్యక్తి కాదు. చలం వ్యక్తిత్వం కలవాడు. సౌరీస్ ఈ సంగతి రాసిందనుకుంటాను. రాసే ఉండాలి. చలం కుటుంబానికి మతం, కులం లేదు. వాళ్ళ ఆధ్యాత్మిక సాధనకు మత, కుల, కాలుష్యం లేదు. ఆధ్యాత్మిక సాధనలోనూ చలానికి వ్యక్తిత్వం గల మార్గమే. వ్యక్తిత్వం లేని వాళ్ళకు అవగతం కాని మార్గమే.....!!
అన్నట్టు వీరిద్దరి ఆశీస్సులతో నేననుకున్న కోరికలు తీర్చుకున్నా. వాటిలో ఒకటి - మా నాన్నగారిలా నేనూ ఏదో ఒకటి రాసి అచ్చులో నా పేరు చూసుకోవాలను కున్నాను. చూసుకున్నాను. అలాగే కృష్ణగారిలా పత్రికా రంగంలో పని చేయాలనుకున్నాను. చేశాను మూడు దశాబ్దాలపైనే. కానీ ఏం లాభం? మొదటి మెట్టులోనే ఉండిపోయాను. కృషిలో నేను వారిద్దరినీ అనుకరించలేదు. అనుసరించలేదు. నా పంధాలోనే నేనడుగులు వేసాను. కానీ ఒక్కటి. వారి ఆశీర్వాదంతో దీర్ఘకాలం కలాన్ని వదలక రాయగలిగాను నాకొచ్చిన మిడిమిడి జ్ఞానంతో.  చలంగారిపై నేను ఒకటీ అరా వ్యాసాలు నాకు తోచిన రీతిలో రాసిన సందర్భాలున్నాయి. ఓ మాసపత్రికలో మాతృప్రేమ గురించి రాయమన్నప్పుడు చలంగారి యశోదాగీతాలను ప్రధానంగా చేసుకుని వ్యాసం రాసి పంపాను. చలంగారి రచనలలో ఈ యశోదాగీతాలు నన్నెంతగా మైమరిపించాయో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. అలాగే సాక్షి ఫన్డేకోసం రాజిరెడ్డిగారు చలంగారిపై నాతో రాయించిన వ్యాసం చదివి ముక్తవరం పార్థసారథిగారు ఫోన్ చేసి నన్ను పలకరించినప్పుడు ఎంత ఆనందించానో చెప్పలేను. ఈ వ్యాసమే పునాదైంది మా మధ్య పరిచయానికి. చలంగారెప్పటికీ నా అభిమాన వ్యక్తి. ఆయన అరుణాచల నివాసం రమణస్థాన్ లో గడిపిన రోజులు నా జీవితంలో బంగారు రోజులే....!! 

కామెంట్‌లు