అట్లతద్ది సంబరాలు:- సత్యవాణి కుంటముక్కుల

  దసరా సంబరాలు ముగిసినవెంటనే ఆడపిల్లలకు వస్తుంది అంబరాన్నంటే అట్లతద్దిసంబరం. 
                   మా నాన్నా చిన్నాన్నలకు వందల ఎకరాలువున్నా,ఇందరం ఆడపిల్లలం ఇంట్లో పెరుగుతున్నా, మాకోసం ఒక్కటంటే ఒక్కటికూడా గోరింటమొక్కను పొలంలోపెచలేదు. మరి మాకు ఉండ్రాళ్ళతద్దికీ, అట్లతద్దికీ గోరింటాకు ఎలావస్తుందీ?అందుకనే మా కమతం పక్కనే ఉండే దొరగారి కమతంలోని గోరింటాకుమొక్కే మా అచ్చటా ముచ్చటా తీర్చేది.
         ఉండ్రాళ్ళతద్దిీ,అట్లతద్దిీ ఇంకా మూడునాలుగురోజులుందనగానే, మా పాలికాపులను  గోరిటాకు తెమ్మనిగోలెట్టేవాళ్ళం.వాళ్ళెక్కడ వినిపించుకోరోనని,మానాన్నతోటో,మా చిన్నాన్నతోటో,లేదా ఇద్దరితోటో "పిల్లలకు తద్దికి గోరింటాకుటరా!తెచ్చిపడెయ్యండి "అనిపించేవారం.మొత్తానికి గోరింటాకుతోనిండిన పెద్దపెద్ద కొమ్మలు తెచ్చిపడేసేవారు పాలికాపులు.అవునుమరి వాళ్ళకు ఆకు ఆకూ నాజూగ్గాకోయడానికి అదొక్కటేపనా ఏంటి.
                    ఇప్పటి బడుల్లాకాదు మాకాలంలో,రెండుతద్దిలకూ కూడా ముందురోజుకూడా'తద్దిభోగి' అని సెలవిచ్చేవారు.
                       ఆ భోగినాడు తలలంటుకొని,కొత్తపరికీనీ జాకట్లు కట్టుకొని అమ్మ పెట్టే పిండివంటలతో భోజనాలు చేసినా,మాదృష్టంతా మాపిన్ని పనులన్నీ తెముల్చుకొని,ఎప్పుడెప్పుడు వచ్చి గోరింటాకు రుబ్బుతుందా!ఎప్పుడెప్పుడు పెట్టేసుకొందామా అని గోరింటాకుమీదే మాదృష్టంతా.
                  సరే గోరిటాకులో పుల్లలు గిల్లలుఏరి శుభ్రంచేశాకా,"పిన్నీ!గోరింటాకు !,పిన్నీ గోరింటాకు !"అటూ తోచనీయకుండా,తొణగనీయకుండా గొడవచేసి రుబ్బురోలుదగ్గర కూర్చోపెట్టేవాళ్ళం.
                     "వెళ్ళి కవిరితెండి, అదివేస్తే బాగాపండుతుంది అనేది.చిల్లరుచ్చుకొని రవణగారికొట్టుకెళ్ళి కవిరితెచ్చిచ్చేవాళ్ళం.కాకిబొడ్డుతెండి ఇంకాబాగా పండుతుంది అనేది.మళ్ళీపరుగు కాకిబొడ్డుకి.దొడ్లో పడిపోయిన చెట్టుకు పట్టే కాకిబొడ్డు పట్టుకొచ్చి ఇచ్చేవారం. చిళ్ళపెంకు ముక్క తెండంటే మళ్ళీపరుగు ,చిళ్ళపెంకు అంటే పగిలిపోయిన కుండపెంకన్నమాట,అదీతెచ్చేవారం .ఏడుచూర్ల తాటాకులు వేస్తే అదిరిపోతుందంటే మళ్ళీ అందరం తలోవైపూ పరుగులెట్టేవాళ్ళం.
                    అదేమిటో ఈరోజు అట్లతద్దులూ లేవు,ఒకవేళవుండినా బజార్లో 'కోను'లే కొనుక్కుంటున్నారు.లేదాఎవరికైనా గోరింటాకు దొరికినా, మిక్సీ గిన్నెల్లో వేసి గిర్రునతిప్పడమే అబ్బురం అనుకొంటున్నారు.కానీ మాపిన్ని సుందరమ్మ ఎంతో ఇష్టంగా రెండుమూడు వాయలుగా ,కంట్లోపెట్టుకొన్నా కరిగిపోయేంత మెత్తగా ,శ్రధ్ధగా రుబ్బేది గోరింటాకును. తనకుడిచేయి చూస్తే ఎర్రగా కెంపులా మెరిసిపోయేది.
                         "పెందరాళే అన్నాలు తినేసి గోరిటాకెట్టుకోండి పిల్లల్లారా!లేకపోతే ,పడుకొని పక్కబట్టలకంటిస్తారని "పొద్దు వాలకుండా పిల్లలకు భోజనాలు  పెట్టేసేవారు.
                భోజనాలయ్యాకా గోరింటాకు పెట్టుడు పర్వం మొదలైయ్యేది.మా అమ్మకు నాజూకు పనులు తెలియవు .అరచేతిమధ్యలో  ఇంతచందమామను పెట్టేసి, ఉసిరికాయంతచుక్కలు చుట్టూపెట్టేసేది రెండుచేతులకూ ఐదంటే ఐదేనిమిషాల్లో.మా పిన్నిపనంతా నాజూకు పని ,అందంగా అరచేతిలో  చిన్నచందమామను పెట్టి, చిన్నచిన్న చుక్కలు పెడుతుంటే, "నీకు చాదస్తమేంటోవిడా! నువ్వు పెట్టినంతసేపు వుంచరు.క్షణంలో ఏదోవంకచెప్పి తీసిపారేస్తారు,అవతల మగాళ్ళు పొలాలనుంచి వచ్చేవేళైయ్యింది "అంటూ మాపిన్నిని పెట్టేదాన్ని, నాజూకుగా గోరింటాకు పెట్టనిచ్చేదికాదు మా అమ్మ.
ఈలోపుగా మా అన్నయ్యపొలంనుంచి వచ్చి గోరింటాకు పెట్టమని ఎక్కడవాటాకొస్తాడోనని మాకుభయం.
                  మేం భయపడ్డట్టేవచ్చేవాడు మా అన్నయ్య .చిటికెనవేలికే నంటూ చతికిలబడేవాడు పిన్నిముందర.పైగా నాకుపెట్టుముందని పేచీకి దిగేవాడు. ఆచిటికెడు వాడికిపెడితే మాకెక్కడ గోరింటాకు తరిగిపోతుందోననే భయం మాకుండనేవుంది.పైగా వాడికితోడు మాతమ్ముళ్ళు, నారాయణంగాడు,సత్తిబాబుగాళ్ళు వాటాకొచ్చేవారు.నిజంచెప్పొద్దూ,ఇప్పటి టీ.వీ కథానాయకులకుమల్లే వాళ్ళపీకలు పిసకాలనిపించేదినాకు.మరి గోరింటాకా మజాకానా!
                     సరే !గోరింటాకు పెట్టడం అధ్యాయం ముగిసీముగియకుండానే మాఅమ్మచెప్పినట్లు ఉప్మాబడిచదువులు గనుక తలగోక్కోవాలి,బొందులాగు ముడివిప్పాలి, మరెన్నో, మరెన్నో చేయాలంటెే గోరింటాకు రెండుచేతులకీ వుంది. అదేమిటోగానీ ఎప్పుడూవెయ్యనిదాహం రెండుచేతులకీ గోరింటాకు పెట్టుకొన్నప్పుడే వేసేది.
               చచ్చిచెడి రుబ్బిపెట్టేనమ్మా!చచ్చినట్లు మీకన్నీ నేనేచేస్తాను.తీసిమాత్రంపారేకండి అని మాపిన్ని , మాబుర్రగోకడంనుంచి అన్ని అవసరాలూ ఆపూటకి తనేచూసేది.
                  ఒకగంటపోయినదగ్గరనుంచీ నాచెయ్యిబాగా పండుతుందంటే ,నాచెయ్యే బాగాపండుతుందని పందేలు కట్టడం,ఈలోపుగా నాచందమామ ఊడిపోయిందని ఒకరు,నాచుక్కని రాలగొట్టేసిందని ఒకరు ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పడం మొదలు. అసలు ఎలా పండిందో చూడాలంటే చందమామను ఊడదీసి చూసి ,మళ్ళీ అతికిస్తే అదుంటుందా మరి.ఊడిపోకేంచేస్తుందిమరి.
                 మొత్తానికి పొద్దు గునక్కుండా తింటే నిద్రరాకుండా వూరుకోదుగదా!
అప్పుడు నిద్రకొరిగితే ఎప్పటికి తెల్లారను.పెద్దాళ్ళందరూ తిని పడకలు చేరేసరికి మా నిద్రలైపోయేవి.
                   అప్పటినుంచీ ,ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు నువ్వుగుండలో,గోంగూరపచ్చడిలో ఉల్లిపాయపులుసు నంజుకుతిని, గడ్డపెరుగన్నంతినేసి, అట్లతద్దోయ్ ,ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లో య్ అంటూ ఊరు మీదపడి ఉరకలేద్దామా అన్న ఆతృతతో 
నిద్రపడితే ఒట్టు.
                      "అమ్మా!ఇంకా తెల్లారడానికి చాలా సమయముందమ్మా!నేను లేపుతానుకదా! మీరుపడుకోండి, "అని నాన్న అన్నా,మాకు నమ్మకం వుండేదికాదు.మధ్యలో నాలుగుసార్లు లేచి కోడిగుడ్డులాంప్ వెలుతురులో,నాన్న వాచీలో టైమ్ చూసేవారం.
                   నాన్న అమ్మనిలేపి, "ఇంకవాళ్ళకి పెట్టేదేదో తినడానికి పెట్టిపంపేయ్ ! వాళ్ళకింక నిద్రపట్టదు, తినేసి ఆడుకొందుకు పోతారంటే, అమ్మ  నాన్నచెప్పినట్లు పెట్టేదేదో కడుపునిండా పెట్టేస్తే ,
కడుపులు నిమురుకొంటూ, "అట్లతద్దోయ్" అని అరుచుకొంటూ ఊరిమీదపడేవాళ్ళం.
             వెన్నెల్లో గోరింటాకులు ఎలాపండేయో చూసుకొని, మంచి ,అందమైన మొగుడెవరికొస్తాడో మనసులో లెక్కలు గట్టుకొని, ఎవరిది వారికి నాదే బాగాపండిందని లోన అనుకొంటూ,అబ్బే!నాదానికంటే నీచెయ్యే బాగా పండిందంటూ,ఎందుకంటే ,మంచిమొగుడూ,అందమైన మొగుడూ గోల ఒకటుందిగనక, మెరమెచ్చుకబుర్లాడుతూ ,గుళ్ళో పూజారి శేషయ్యగారు తరుముకొచ్చేవరకూ పూలు కోసుకొని,తెల్లగా తెల్లారేకా ఇళ్ళకు చేరేవారం. 
                     ఇంట్లో అమ్మా,పిన్నీ పూజకు అన్నీ సిధ్ధచేస్తే పూజలో కూర్చొని
అమ్మచెప్పినట్లు మంత్రాలు చెబుతూ పూజచేసుకొంటున్నా,తెల్లారుఝామునెప్పుడోతిన్న చద్దెన్నం అరిగిపోవడంవలన, వంటల ఘుమఘుమలమీదే దృష్టివుంటే,అమ్మగమనించి, పిల్లల్లారా!అట్లతద్ది గౌరిదేవి పూజ భక్తిగా,శ్రద్దగా చేయకపోతే ముసిలి ,కోపిష్టిమొగుడొస్తాడు.
లేదా!భక్తిగా పూజచేస్తే "గౌరీదేవి, మీనాన్నలాంటి మంచిమొగుణ్ణి ఇస్తుంది, మా నాన్నలా, శాంతమూర్తీ,మంచివాడైన మొగుణ్ణిమ్మని గౌరమ్మని అడగమంటే, మొగుడన్నమాట నోట్లోంచి రావడానికి సిగ్గుతో ఎన్నిమెలికలు తిరిగిపోయెవాళ్ళమో ఇప్పటి తరం ఆడపిల్లలకు తెలియదు.
ఇప్పుడామాట అందరినోటా పరిపాటైపోయింది.
                    పుజపుార్తయ్యాకా భోజనాలు చేసి,చక్కగా కొత్తబట్టలు కట్టుకొని, బాగా ముస్తాబై, ఏడిళ్ళలో అట్లతద్ది గౌరమ్మని చూసి,దణ్ణంపెట్టుకొని ,ఏడు ఉయ్యాలలో ఊగి చికటి పడేవేళకి ఇళ్ళకు చేరేవారం. ఇదీ మా చిన్నప్పటి తద్దులముచ్చట్లు.
                       మరి ఈతరం ఆడ పిల్లలు రేపటి తరానికి ఏమేమేమి ముచ్చట్లు చెపుతారో ఏమిటో! చెప్పడానకి ఏం మిగిలున్నాయంటారు?
       
కామెంట్‌లు