తబిసి తొట్టి ...!!> శీరంశెట్టి కాంతారావు >రచయిత.> పాల్వంచ*

 తిప్పనపల్లి అడవుల్లో ఆదిమానవులు చిత్రించిన వర్ణశోభిత రేఖాచిత్రాల గుహలున్నయని విని
అక్కడి స్థానిక మిత్రుల్తోకలిసి చూడ వెళ్ళాను
గిరిజన గ్రామాలను దాటు కుంటూ వెళ్తున్నాకొద్ది అడవి చిక్కబడి పోతుంది 
దాని నిశ్శబ్ద సౌందర్యం గుండెలోతుల్లో  ఆనంద, భయాలను పంచుతుంటే విచలితుణ్ణైపోతూ     
తడబడే అడుగుల్తో 
మిత్రుల్తోపాటు మా
మార్గదర్శి గిరిజన సోదరుని వెనుక కదిలాను
పడగవిప్పిన వేయిశిరస్సుల సర్పాకృతి గొడుగై నిల్చిన ఓకొండ ఒంపును ఆవాసంగా మల్చుకున్న మూలవాసుల సహజపరిసర పరిజ్ఞానానికి పరవశులమైపోతూ
గొడుకు కిందకు చేరుకున్నాము
ఏ నాడో! ఏ ఆకుపసర్ల మిశ్రమంతోనో!   
వారి అనుభవాలను, అనుభూతులను రేఖాచిత్రాల్లో నిక్షిప్తం చేసిన వైనం అసామాన్యం అనుకుంటున్నంతలో
తబిసితొట్టిదాకా పోదామా?
వివరించలేని నైర్మల్యస్వరంతో
మృదువుగా అడిగాడు 
మార్గదర్శి
మరో అభిప్రాయానికి తావులేకుండా వెంటనే కదిలాం
కాలం తాకిడికి చెదిరిపోయిన ఆదిమానవుల అడుగు జాడలను పసిగడుతూ 
అడ్డమొచ్చిన పొదలను చేతిలోని చిప్పగొడ్డలితో తొలిగిస్తూ.. పొద్దుములిగి పోబోతున్నవేళకు మమ్ముల్ని తబిసితొట్టి చెంతకు చేర్చాడు  ఆ అద్దాన్నపు అడవిలో వేసి వున్న రెండు గుడిశలముందు చెట్ల వేర్ల ఆసనాల మీద కూర్చున్న గిరిజనులు కొందరు మమ్ముల్ని చూస్తూనే నిశ్శబ్దంగా లేచి నిల్చున్నారు 
సాయం సూర్యుడు 
చెట్ల కొమ్మల సందులగుండా  తన వెలుగు కిరణాలను వాళ్ళ మీద ప్రసరిస్తుంటే నెమ్మదిగా వారిని చేరిన మార్గదర్శి తమ భాషలో ఏదో వివరించాడు
అంతే! ఒక్కసారిగా వారిలో 
కల కలం జీవంపోసుకుంది
పిల్లనగ్రోవి ప్రాణం పోసుకుని ఏదో గీతానికి పల్లవి పలికింది
తినే కంచం,ఖాళీ నీళ్ళ డబ్బా, బక్కెట్టు, కర్రముక్కలు వాద్యపరికరాలై చరణం అందుకుని మమ్ముల్నేకాదు
అడవినే చిందేయించాయి
వారి సహజసంగీత విభావరిలో
మా తనూ మనస్సులు ఏతీరాలకో తేలిపోయాయి
ఇంతకూ తబిసితొట్టి అంటే?
నామనసులో తండ్లాడుతున్న
ప్రశ్న మార్గదర్శికి అందించాను
ఇక్కడున్న ఈ తబిసిచెట్ల వనంలో...
వందడుగుల ఎత్తు ఇసుకమందల గుట్టనుండి ఏ ప్రాకృతిక శక్తుల మహిమోగాని
చుట్టూ పది కి.మీ. పరిధిలోని వన్యప్రాణుల ప్రాణాలు నిల్పేటందుకు మున్నూటరవైరోజులూ గుట్ట గుండెల్లో నుండి వెలికి వస్తున్న జలధారనే గిరిజనులు తబిసితొట్టి అంటారు
ప్రకృతితో అంతగామమేకమై మసలుకునే ఆగిరిజనులక్కడ
ఓ జంగిల్ కాంట్రాక్టర్ చేతికింద వలసకూలీలై ఛత్తీస్ ఘడ్ నుండి వచ్చారట 
ఆమాటలు విన్న నామనసులో
ఆదివాసీలు అభివృద్దికి దూరంగా ఉంటున్నారా?ఉంచబడుతున్నారా? 
అన్న ప్రశ్న విరాట్ రూపమై విస్తరిస్తుంటే అందరితోపాటు మౌనంగా వెనుదిరిగాను
(మిత్రులు గరికె శ్రీనివాస్ మరియు ఉస్మాన్ ఖాన్ గార్లకు ధన్యవాదాలతో)
                        ***
కామెంట్‌లు