ఓౌషదం...!!> సాగర్ రెడ్డి కవి ..> చెన్నయ్.*
విడదీయలేని వ్యాపకమై
ప్రతి ఒక్కరి జీవితంలో
తిష్టవేసి కూర్చుంది వ్యాయామం.
ఉషోదయంతో మొదలై,
రోజువారి కార్యాలు ముగించి,
నిద్రకు ఉపక్రమించే వరకు,
అందరి ఆలోచనలు- వ్యాయామానికి లోబడి
ఆరోగ్యజీవితానికి అలవడి సాగుతున్నాయి!!

కష్టతరమైన ఆటలూ,
వ్యాయామశాలలలో చేసే
కసరత్తులు ఒక వైపు,
సులభతరమైన నడక,
తేలికపాటి ఆసనాలు,
మరో దరిన చేరి-
జన జీవితాన్ని నడుపుతున్నాయి!!

వ్యాయామానికి ప్రత్యేక
సమయం కేటాయించని
నిత్యం కష్టపడే జీవితాలు
సుఖమయమై కాలం వెళ్ళదీసి
కాలగర్భంలో కలసిపోయాయి-
ఎన్నోజీవితాలు నేటికీ
ఆరోగ్యవంతమై నేటి
జీవనశైలిని వెక్కిరిస్తున్నాయి!!

సుఖమయ జీవితానికి
అలవడి బధ్ధకం బాహువుల్లో
చిక్కుకున్న నేటి మనిషి,
కాలుకదపలేక శకటదారియై
రక్తపోటు, కొవ్వు, మధుమేహ బిరుదాంకితుడై 
సుష్టిగా భుజించలేక,
భుజించినా అరగని ఉదరంతో,
పడే అగచాట్లకు పరాకాష్ట
నేటి వ్యాయామ ప్రక్రియ!!

ఎనభై వర్షాల ముదిమిలోనూ,
ఎన్నో అలసటలను అదిగమించి,
అలవోకగా సాగుతున్న
ఆరోగ్యాలు నాటి పెద్దలవి.
నలభైలోనే నలుగుతున్న
అనారోగ్య జీవితాలకు
ఆహ్వానం పలుకుతున్న
ఆడంబరాలు నేటి యువతవి!!

కాలంపై వేసే నెపం
తీరికలేని జీవితమనే
తెచ్చిపెట్టుకున్న బడాయి,
అనారోగ్యానికి స్వాగతద్వారాలు
కాలంతో మార్పు సహజమే
అది సవ్యమైతే సర్వం
హర్షాతిరేకం-
అస్తవ్యస్తమైతే తీరని
వ్యధకు రాజమార్గం!!

ఖర్చులేని వ్యాయామం,
కాయాన్ని తేలికపరచే ఓౌషదం.
అనారోగ్యాలను ఆమడదూరం 
తరిమే ఆనంద కారకం-
అసలైన రోగ నిరోధకం!!


కామెంట్‌లు