"పెద్ద వాళ్ళ ......పెళ్ళితో సమానం"( సామెత కథ):-ఎం బిందుమాధవి

 కొడుకులు-కోడళ్ళు, కూతుళ్ళు-అల్లుళ్ళు, మనవలు, ముని మనవలతో సంపూర్ణ జీవితం గడిపి, సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న పెద్దలు కాలం చెల్లి మరణించినా బాధపడుతూ కూర్చోకుండా పుట్టిన వారికి మరణం సహజమే అన్నట్టు వారి అంతిమ యాత్ర దాన ధర్మాలతో, అన్న సంతర్పణలతో  వైభవంగా జరిపించటం అక్కడక్కడ చూస్తూ ఉంటాము.
ఆ పెద్ద వారితో తమ స్మృతులు గుర్తు చేసుకుంటూ...తమకి వారు నేర్పిన సంస్కారం, మర్యాదలు తలచుకుంటూ నలుగురినీ పిలిచి ఆనందంగా అవి పంచుకుంటారు.
అలాంటప్పుడు ఈ సామెతని వాడతారు.
                                            **********
"అందరి భోజనాలు అయ్యాయా? లక్ష్మీ ఒక్క సారి వాకిట్లోకి వెళ్ళి చూసొచ్చి చెప్పు. అందరూ తినటం అయితే నేను భోజనానికి కూర్చుంటా" అని పనమ్మాయికి పురమాయించారు వంట చేసే మంగమ్మ గారు.
పది రోజులు వంటకి మనిషి కావాలి, ఇంట్లోనే ఉండాలి అంటే....మామూలుగా రోజుకి రెండు పూట్లా ఓ పది పదిహేనుమందికి  భోజనాలు, రెండు పూట్ల కాఫీలు...టీలు, ఉదయం, రాత్రి ఫలహారాలు అనుకున్నారు మంగమ్మగారు. ఎటూ పన్నెండో రోజు బయట క్యాటరింగుకే ఇస్తారు కదా అని కూడా అనుకున్నారు.
మంగమ్మ గారి వదిన కామమ్మ గారు  ఆ ఇంట్లో ఎప్పటి నించో వంట చేస్తున్నారు. తక్కువ ధరల్లో వస్తాయని, ఈ మధ్య కాలంలో ఊరికి దూరంగా ఉన్న కాలనీలో పార్వతీశం గారి సహాయంతో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. పిల్లలంతా ఎటు వాళ్ళు అటు వెళ్ళాక, వంట మనిషి సహాయం అక్కరలేదనీ, అంత దూరం నించి ఏం వస్తారు లెండి అని పార్వతీశం గారి కోడలు రంజని ఆవిడని మానిపించారు.
ఇప్పుడు అవసరం వచ్చిందని రంజని కబురుపెడితే, ఆవిడ అంతకు ముందు ఎప్పుడో ఒప్పుకున్న పని వదిలి రాలేక, తన ఆడపడుచు మంగమ్మ గారిని పిలిచి "వదినా పార్వతీశం గారని మనకి చాలా కావలసిన వారు. మీ అన్నయ్యకి కూడా చాలా సహాయం చేశారు. ఆయన శివైక్యం చెందారుట. వాళ్ళ కోడలు ఫోన్ చేసింది. పది రోజులు మనిషి కావాలిట. నేను పెళ్ళి పని ఒప్పుకున్నాను. మానుకుని రమ్మంటే వస్తానంటే, 'వద్దు మాట పోతుంది. ఎవరికైనా మాట ముఖ్యం, ఇంకెవరినైనా పంపించండి ' అన్నదావిడ. ఇంట్లో అందరూ చాలా మంచి మనుషులు. వెళితే నీకే తెలుస్తుంది. ఈ సారికి అక్కడికెళ్ళి నా మాట, వాళ్ళ మాట దక్కించవా" అని ఒప్పించి ఆమెని పంపించారు.
                                              *******
"పొద్దుటి నించి ఇప్పటికి నాలుగు అత్తెసరులు దింపాను. ఏభై మంది అయ్యారు. పొద్దున వండిన కూర, పప్పు, పచ్చడి అయిపోయాయి. ఇప్పటి మటుకు ఆలుగడ్డ వేయించి, చారు పెట్టాను. అలమారులో చింతకాయ పచ్చడి ఉండనే ఉన్నది. మధ్యాహ్నం ఎవరయినా వచ్చినా భోజనం పెట్టటానికి అప్పటికప్పుడు వెతుక్కోనక్కరలేదు. భోజనం చేసి, ఒక్క నిముషం నడుం వాలిస్తే మళ్ళీ మధ్యాహ్నం కాఫీలు, రాత్రి వంట చూసుకోవచ్చు" అనుకున్నారు స్వగతంగా!
"ఆ:( అయినట్టే ఉన్నారమ్మా! ఇదుగో వీధి తలుపేసి వస్తాను. మీరు తిన్నాక ఆ కూరగాయలు ఇలా పడేస్తే తరిగిస్తాను" అన్నది పనమ్మాయి లక్ష్మి.
"లక్ష్మీ ....తేవలసిన సరుకుల లిస్ట్ ఇక్కడ పెడుతున్నాను. గుర్తు చెయ్యి. అమ్మాయి గారు నిద్ర లేచాక డబ్బు ఇమ్మని, వెంకటయ్యతో చెప్పి తెప్పిస్తాను. ఈ వారం రోజులకి సరిపోతాయి. నువ్వు, మీ ఆయన రైతు బజారుకెళ్ళి పది రకాల కూరగాయలు తెండి. కూరకి, పప్పుకి, పులుసుకి, పచ్చడికి ఉపయోగపడేట్లు చూసి తెండి. అల్లం, కొత్తిమిర, కరివేపాకు మర్చిపోకండి" అని కొంగు పరుచుకుని నడుంవాల్చారు, భోజనం ముగించిన మంగమ్మగారు.
"తాత గారు వెళ్ళిపోయి అప్పటికి మూడు రోజులయింది. అమ్మకి సాయంగా ఉండటానికి వచ్చిన శిరీష అలిసిపోయి పడుకుంది. లేవగానే పనమ్మాయి లక్ష్మి "అమ్మాయి గారు మంగమ్మ గారు ఈ లిస్ట్ చూసి డబ్బిమ్మన్నారమ్మా" అని లిస్ట్ చేతిలో పెట్టింది.
లిస్ట్ చూసిన శిరీష గట్టిగా చదువుతూ "ఓ బస్తా బియ్యం, పది కేజీల కందిపప్పు, నాలుగు కేజీల చింతపండు, ఆరు కేజీల బెల్లం, రెండు కేజీల కాఫీ పొడి, రెండు కేజీల టీ పొడి, రెండు కేజీల చక్కెర, కిలో ఎండు మిరపకాయలు, ఇంకా పోపు సామానులు. ఓరి నాయనోయ్, వారం రోజులకి ఇన్ని సరుకులా" అన్నది.
"మీరు సూడలేదు గానమ్మా, మంగమ్మగారు పొద్దుటి నించి వంచిన నడుం ఎత్తకుండా వండుతానే ఉన్నారమ్మా! ఈ రోజు 50-60 మంది భోంచేశారమ్మా! ఈ ఏరియాలో తాతయ్య గారు తెలవంది ఎవరికమ్మా? ఆయనంటే అందరికీ గౌరవమే! మనం పిలవకపోయినా ఆయన ప్రసాదం తిని ఎల్లటానికి జనాలు వస్తనే ఉంటరమ్మా!" అన్నది లక్ష్మమ్మ.
                                     **********
ఆ కాలనీలో ఉండే బ్యాంకులో పని చేసే ప్రియాంక, ఇల్లు దగ్గరే అని మధ్యాహ్నం లంచ్ కి ఇంటికొస్తుంది. ఈ మధ్యనే ఆ బ్రాంచ్ కి బదిలీ అయి వచ్చింది.
తలొంచుకుని పరధ్యానంగా నడుస్తున్న ప్రియాంకకి, తమ ఎదురు కాంప్లెక్స్ లోంచి బయ్ బయ్ మని హార్న్ కొట్టుకుంటూ బయటికొస్తున్న స్కూటర్లు, కార్లు కనిపించాయి.
"నేనే అనుకున్నాను, ఈ ఎదురు కాంప్లెక్స్ లో ఇంతమంది మధ్యాహ్న భోజనానికి ఇంటికొస్తారా" అని ఆశ్చర్య పోయింది.
లంచ్ ముగించుకుని తిరిగి ఆఫీస్ కి వెళుతుండగా కూడా కొంతమంది కనిపించారు. ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ ఆఫీస్ కి వెళ్ళింది. అక్కడ ఉన్న పని ఒత్తిడికి ఆ విషయాలన్నీ బుర్రలోంచి ఎగిరిపోయాయి. సాయంత్రం ఇంటికి వస్తుండగా బోలెడు కొత్త మొహాలు కనిపించాయి. గేట్ దగ్గర కనిపించిన పనమ్మాయి శాంతమ్మని ఆపి "ఏంటి ఆ కాంప్లెక్స్ లో నించి అంతమంది వస్తూ వెళుతూ కనిపిస్తున్నారు! ఏం జరిగింది. ఏదయినా ఫంక్షనా?" అనడిగింది.
"అదా .....ఆ ఇంట్లో ఉండే పెద్దాయన పార్వతీశం గారు పోయారు గదమ్మా! ఇయ్యాల్టికి మూడు దినాలయింది. ఆ బాబు సానా మంచోరు. దేవుడేనంటే నమ్మండి. అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. ఎవురికి ఏ సాయం గావాలన్నా సేస్తారు. ఆ అయ్య సాయం పొందని వాళ్ళు ఈ పేటలో లేరంటే నమ్మండి. అందుకే ఊరి జనం అంతా తీర్ధానికి వచ్చినట్టు వచ్చి సూసెళుతున్నారు" అన్నది.
                                      ********
శనివారం మధ్యాహ్నం కాలనీలో ఉన్న సూపర్ బజార్ లాంటి పచారి కొట్టుకి మినప్పప్పు కొనడానికి ఆఫీస్ నించి అటు నించి అటే వెళ్ళింది ప్రియాంక. ఒక పెద్దాయన, చూడటానికి గుడి పూజారి లాగా ఉన్నాడు,  అక్కడ స్టూల్ మీద కూర్చుని "పార్వతీశం గారు వెళ్ళిపోయారు. ఇప్పుడే వారింటికి వెళ్ళి ప్రసాదం తిని వస్తున్నాను. రోజు రాత్రి మంత్ర పుష్పం సమయానికి గుడికొచ్చి తను కూడా నాతో పాటు చదివేవారు. ఎంత మంచి కంఠం అండి ఆయనది! చక్కగా గొంతెత్తి శ్రావ్యంగా మంత్రం చదివి ప్రసాదం తీసుకుని వెళ్ళేవారు. ఆయన లేని లోటు తీర్చలేరండి" అన్నారు.
"అవునండి, ఆయన వెళ్ళిపోయినట్టు నిన్ననే తెలిసింది. మా షాపుకొచ్చి కూర్చుని, ఇక్కడి సేల్స్ గర్ల్స్ కి ఇంగ్లీష్, లెక్కలు నేర్పుతూ ఉండేవారు. ఇద్దరికి  ఫీజు కూడా ఆయనే కట్టి పరీక్షలకి పంపించారు . చాలా మంచి మనిషి. ఒక రోజు మా ఆవిడకి కాలు మడతపడి నడవలేక బాధ పడుతున్నదని చెప్పాను. ఆయన తన దగ్గర ఉన్నదని ఏదో బాం తీసుకొచ్చి ఇచ్చారు. కడుపులోకి వెయ్యటానికి ఏదో మందు కూడా తెచ్చి ఇచ్చారు. నేను కూడా రేపు వెళ్ళి ఆయన ప్రసాదం తిని రావాలండి" అన్నాడు అక్కడ కౌంటర్ లో కూర్చునే మేనేజర్.
"అయ్యో పార్వతీశం గారు వెళ్ళిపోయారా, నేను ఊళ్ళో లేనండి" అన్నాడు సరుకులు కొనుక్కోవటానికొచ్చిన జగన్నాధం గారు. "మా అమ్మాయికి సంబంధం కుదరక ఇబ్బంది పడుతుంటే, వారి బంధువుల అబ్బాయి సంబంధం,  దగ్గరుండి తనే కుదిర్చి కట్నం లేకుండా పెళ్ళి చేయించారు. పరోపకారి పాపన్న అని మనం చందమామ కధల్లో చదువుకున్న మనిషిలాంటి వారండి" అన్నారు.
"ఓహో ఇదన్నమాట కారణం! ఆ ఇంట్లోనించి బయటికొస్తూ కనిపించిన అంతమంది మనుషులు వారి ప్రసాదం తిని వస్తున్నారన్నమాట" అనుకున్నది మనసులో ప్రియాంక.
కుతూహలం ఆపుకోలేక సోమవారం ఆఫీస్ కి వెళ్ళాక, తమ అకౌంట్ హోల్డర్స్ పేర్లల్లో ఆయన పేరు, ఎడ్రెస్ కొట్టి వెతికింది.
వ్యక్తిగత వివరాల్లో, ముప్ఫయ్యేళ్ళ క్రితం చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయినట్లు చూసి "ఇంత పెద్ద ఉద్యోగం చేసినా నిరాడంబరంగా అందరితో కలిసిపోయేవారన్నమాట! ఆయన గూగుల్ పే ద్వారా చేసిన చిన్నా..పెద్దా దానాలు ప్రతి నెలలోనూ 15-20 దాకా ఎంట్రీలుగా కనిపిస్తున్నాయి.  ఆయన మీద ఉన్న గౌరవంతో ఆ కాలనీ వారంతా, ఆ ఇంటి వారు పిలవకపోయినా వెళ్ళి భోజనం చేసి వస్తున్నారన్నమాట! నిజంగానే ఆయన లాంటి వారిని చూసి నేర్చుకోవలసిందే! ఆయన ప్రసాదం తింటే, నాకు కూడా పరోపకార బుద్ధి వస్తుందేమో, రేపు మధ్యాహ్నం నేనూ వెళ్ళి భోజనం చేసి వస్తాను" అనుకున్నది మనసులో!
                                  *********
కొడుకు రాము అన్నిరకాల దానాలతో పండుగ లాగా పన్నెండు రోజులు పార్వతీశం గారి దినకర్మలు రంగ రంగ వైభవంగా జరిపించాడు. దగ్గరలో ఉన్న అనాధాశ్రమంలో వారందరికీ అన్నదానం జరిపించాడు. బడ్జెట్ అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువే అయినా ఆ పన్నెండు రోజులు వచ్చిన వారికి లేదనకుండా అన్న సంతర్పణ చేశాడు.
"తాతగారంటే మా తాతగారనుకున్నాను కానీ, ఆయనకి ఇంత గుడ్ విల్ ఉందనుకోలేదు నాన్నా! ఆయన మనవరాలిగా పుట్టినందుకు గర్వ పడుతున్నాను. బతుకంటే ఇది! మన పొరుగింట్లో ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా బతుకుతున్న ఈ రోజుల్లో ఆయన మరణం ఇలా పెళ్ళిలాగా వైభవంగా జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్నా" అన్నది.
"మంగమ్మగారూ ఇదిగో మీకివ్వాల్సిన డబ్బు" అని ఒప్పుకున్న దానికి రెట్టింపు చేతిలో పెట్టాడు రాము.
లెక్క చూసుకుని "అయ్యో ఎక్కువిచ్చారండి" అన్నది.
"ఫరవాలేదు ఉంచండి. ప్రతి రోజు 50-60 మందికి పైనే వండి వడ్డించారు. మేము కూడా అంత మంది వస్తారనుకోలేదు. పాపంవిసుక్కోకుండా, వేళా పాళా లేకుండా వచ్చిన వారందరికీ లేదనకుండా చేసి పెట్టారు. ఇది మీ శ్రమకి ఫలితం మాత్రం కాదు. మేము పదార్ధం తెచ్చినా అది మీరు సద్వినియోగం చెయ్యకపోతే, వృధాయే కదండి. ఎప్పుడన్నా వస్తూ ఉండండి" అని చెప్పి పంపించాడు.
ఆ కాలనీలో పార్కులు, బ్యాంకులు... ఎక్కడ విన్నా ఆరు నెలలపాటు అందరూ పార్వతీశం గారి గురించి, ఆయన లేని వెలితి గురించే మాట్లాడుకునేవారు.
అలా బతకటం కూడా అందరికీ చేతకాదు.
అహం వదిలేసి, పరుల మంచి కోరేవారు బహు తక్కువ మంది ఉంటారు. అలాంటి లక్షణాలు వారికి వ్యక్తిగతంగా ఉండటంతో  సరిపోదు...వారి సంతానం కూడా అది గుర్తించి అంత కాక్పోయినా..కొంత తమ వంతుగా కొనసాగిస్తే సమాజంలో సానుకూలత పెరుగుతుంది.
అలాంటి వారందరికీ ఈ కధ అంకితం.

కామెంట్‌లు