చిన్ని కృష్ణా ;- డా.. కందేపి రాణీప్రసాద్.

జుట్టు దువ్వి పిలకను వేసి 
పిలకకు పూలు గుచ్చుతానురా చిన్నికృష్ణా

చూడముచ్చటైన ముస్తాబుతో
చూపరుల మనసు దోచేవురా చిన్నికృష్ణా

పాలబువ్వకు కలకండ కలిపి
బొజ్జ నిండా తినిపిస్తానురా చిన్నికృష్ణా

నుదుటను ఎర్రతిలకం దిద్ది
బుగ్గకు దిష్టి చుక్క పెదతానురా చిన్నికృష్ణా

చెవులకు బంగరు పోగులు పెట్టి
మెడలో ముత్యాల దండ వేస్తానురా చిన్నికృష్ణా

మామిడి పిందెల మొలతాడు గట్టి
పట్టుపంచె నీకు చుడతానురా చిన్నికృష్ణా

కాళ్ళకు ఘల్లు కడియాలు తొడిగి
పాదాలకు పారాణి పూస్తానురా చిన్నికృష్ణా
కామెంట్‌లు