ఇది తక్లీ కథనం!!:-- యామిజాల జగదీశ్
 మద్రాసులోని టీనగర్లో శ్రీరామకృష్ణామిషన్ బాయిస్ హైస్కూల్లో ఆరో తరగతి నుంచి ఎస్.ఎస్.ఎల్.సి (అంటే పదకొండో తరగతి) వరకు చదివాను. నాకు తెలుగు , ఇంగ్లీష్, లెక్కలు, సైన్స్, హిస్టరి సబ్జెక్టులకంటే క్రాఫ్ట్, డ్రాయింగ్ క్లాసులంటేనే చాలా ఇష్టం. అందుకు కారణం ఈ సబ్జెక్టులలో మార్కులతో పని లేదు. నూటికి ముప్పైదు రావాలనో నలభై వస్తేనే పాస్ అనో షరతులు ఉండేవి కావు. కానీ మాగిలిన సబ్జెక్టులు అలా కాదు. కనీసపు మార్కులు రాకుంటే ఫెయిలవడమే. పైగా మినిమం మార్క్స్ కన్నా తక్కువ వస్తే ప్రోగ్రస్ రిపోర్టులో మార్కుల కింద ఎర్ర గీతలు వేసేవారు. నాకు చాలా సార్లు ఎందులోనో అందులో ఎర్రగీతలు పడుతుండేవి. అవి పడ్డప్పుడు ప్రోగ్రస్ రిపోర్టులో నాన్నగారితో సంతకం చేయించుకోవడానికెంత భయం వేసేదో. కానీ నాన్నగారెప్పుడూ కోప్పడ్డట్టు ఎరగను. సంతకం చేసేసేవారు. ఓమారు అయిదు సబ్జెక్టులకు గాను మూడింట్లో ఫెయిలయ్యాను. ఆరోజుకూడా నాన్నగారు ఏమీ అనక సంతకం చేయడం ఆశ్చర్యమే. 
అయితే ప్రోగ్రస్ రిపోర్టులో  చోటు లేని క్రాఫ్ట్, డ్రాయింగ్ క్లాసులంటే మహా ఇష్టం. అంతేకాదు‌, ఆ మాష్టార్లు సైతమూ ఇష్టమే. 
డ్రాయింగ్ మాష్టారు పెంకుటిల్లు, సీతాకోకచిలుక, అట్టపెట్టె, పోస్ట్ బాక్స్ వంటి బొమ్మలు ఎలా గీయాలో రంగులెలా ఇవ్వాలో అని నేర్పించిన పద్ధతి బలే సులభంగా ఉండేది. ఈ బొమ్మలెలా గీయాలో ఇప్పటికీ బుర్రలో ఉండిపోయింది. ఇంతకూ ఆయన పేరు గుర్తు రాకపోవడం తప్పున్నర తప్పే. కానీ ఆయన రూపం ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతోంది. తెల్ల ధోవతి అడ్డపంచలా కట్టుకునేవారు. దానికి సన్నని ఆంచు. ఓ తెల్ల చొక్కా ధరించేవారు. ఆయన తమిళులే. 
ఇక క్రాఫ్ట్ మాష్టారు విషయానికొస్తే ఆయన పేరు లక్ష్మీనారాయణగారని గుర్తు. మగ్గం నేయడం, పత్తిని నూలు వడకడానికి తక్లీని ఎలా తిప్పాలో నేర్పించారు. తక్లిని ఎంత పెట్టి కొన్నానో మరచిపోయాను. తమిళంలో తక్లి అని, ఇంగ్లీషులో స్పిండిల్ అని అంటారు. తెలుగులో కదురు అని చెప్తారని కొంత కాలం క్రితమే తెలుసుకున్నాను. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలో ఓ పల్లె పేరు కదుర్. రష్యన్ భాషలో కదురు అనే పదముంది.
కదురుకు సంబంధించి ఒకటి రెండు కథలు వాడుకలో ఉన్నాయి. కదురునే కుదురు అని కూడా అనడం కద్దు.
కొన్ని కుగ్రామాలలో నూలు ఉత్పత్తికి ఒకానొకప్పుడు తక్లిని కొనీ రాట్నాన్ని గానీ ఉపయోగించేవారు. యంత్రాల వాడుక తర్వాత తక్లీ అదృశ్యమైపోయింది. ఇప్పటివారికి తక్లి అనే మాటే తెలియదు. అంతెందుకండి ఆమధ్య కవ్వం అంటే ఏమిటో తెలుసాని ఓ కుర్రాడిని అడిగితే కవ్వము తవ్వము వంటివన్నీ తెలీదన్నాడు. పెరుగుని చిలికి మజ్జిగ చేయడానికి ఉపయోగించే పరికరాన్ని కవ్వం అంటారని చెప్తే చూపించమంటే నేనెక్కడికిపోను. మా చిన్నతనంలో మా ఇంట కవ్వం తప్పనిసరిగా వాడేది మా అమ్మ. ఈరోజుల్లో నూటికీ కోటికీ ఒకరింట ఉండొచ్చేమో ఈ కవ్వం?
కుదురు ఓ మంత్రదండంలాటిది. ఇది స్థూపాకార పరికరం. ఇది ఓ ముప్పై సెంటీమీటర్లు ఉంటుంది. ఒక సన్నటి సాధనం. కానీ గట్టిగానే ఉంటుంది. జానపద జీవిత మ్యూజియంలో ఈ కుదురుని చూసే వీలుండొచ్చు. చెన్నై మైలాపూరులో పూర్వం తక్లీని ఉపయోగించే జంధ్యానికి కావలసిన నూలుపోగులు తీసేవారు. రాట్నం కన్నా ముందర వాడుకలో ఉండిన పరికరమిది. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తక్లి ఇప్పుడు భూతద్దం పట్టుకుని వెతికినా కనిపించదు.
సాధుచెట్టి కులస్తుల పూర్వీకులు వీటినెక్కువగా ఉపయోగించారు. తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా ఉన్న చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలలో నివసించే ఈ కులస్తులు
జనపనారతో తాళ్లు, సంచులు, బోరీలు తయారు చేసేవారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో ఈ వృత్తి చేసే ముస్లిం కుటుంబాలవారు వేలల్లో ఉన్నారు. జనపనార పండించే రైతుల పొలాల నుంచి జనుమును భారీగా కొనుగోలు చేసి ఆ నారను వేరుచేసి నీళ్లలో ఓరోజు రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు బండమీదవేసి చెక్కతో మోదేవారు. ఇలా దాదాపు వారం రోజులు చేస్తే నార శుభ్ర పడి మెత్తగా తయారయ్యేది. ఆ నారను పేని `కదురు' సాయంతో తాళ్లుగా తయారు చేసేవారు. జనపనారను చిన్న చిన్న పాయలుగా తీసుకుని తొడపైన పెట్టుకుని పొడవాటి తాడుగా పేనేవారు. ఇలా చేసేటప్పుడు తొడపైన చేతిరాపిడివల్ల చర్మంమీద పుండ్లు పడేవి. అయితే పుండ్లు పడకుండా ఉండటానికి తొడపైన అరచేతి వెడల్పున ఉండే ఇనుప రేకు కట్టుకుని దానిపై నారను పేని తాళ్లను తయారు చేసేవారు. ఇలా తయారైన తాళ్లను మగ్గాలపై ఎక్కించి ఒక అడుగు వెడల్పు, 36 అడుగుల పొడవున్న జనపనార వస్త్రాన్ని తయారుచేసేవారు. దాంతో తమకు కావలసిన సైజులో సంచులు, బోరీలు తయారు చేసేవారు. వాటిని గాడిదలు, గుర్రాలపై వేసుకుని వివిధ ప్రాంతాలలో తిరిగి అమ్ముకునే వారు. అయితే క్రమంగా జనుము పండించేవారు తగ్గిపోవటంతోనూ, ప్లాస్టిక్‌ సంచుల మార్కెట్‌ పెరగడంతో వారి ఉపాధి కోల్పోయి వ్యవసాయ కార్మికులుగా జీవించక తప్పలేదు. దీనినిబట్టి ఒకానొకప్పుడు తక్లి లేదా కదురు ఉపయోగం ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

కామెంట్‌లు