బంధీ > శీరంశెట్టి కాంతరావు .రచయిత > పాల్వంచ*

 ఉదయభానుని కన్నా ముందుగానే బయలుదేరిన
మా రథం మహారాష్ట్రలోని 
కిన్వట్ ప్రాంత ఘాట్ రోడ్ దిశగా పరుగందుకుంది ఉషోదయపు సమీర స్పర్శతో పులకింతలుపోతూ 
మౌనంగా తలలూపుతూ
పసరుకక్కుతున్న పంటచేల సింగారానికి మా మనసులు శృంగారంగా గిరికీలు కొడుతుంటే మనసెరిగిన నెచ్చెలి మా రథం
తనకు తానే మందగమనయై
మాకు మరింత మానసోల్లాస కారకమయ్యింది
ఆ ఉద్వేగపు రసాస్వాదన నుండి మేం బయటకు రాకముందే రథం ఘాట్ రోడ్ పాదాలకు ప్రణమిల్లి పరుగు నుండి నడకలోకి మారింది
అప్పుడు స్పృహలోకొచ్చిన మాకు 
అడవి అందం ఆకుపచ్చ ఆరుద్ర పురుగుల్లా కనువిందుచేస్తుంటే తట్టుకోలేని వివశత్వంతో పిచ్చివాళ్ళ మాదిరి చిందులు వేస్తున్న మమ్ముల్ని కాన తల్లి తన ఆకుపచ్చ ఒడిలోకి తీసుకుంది 
నూటాఎనభైనిమిషాలపాటు 
అమ్మ జోలపాటలో ఓలలాడి
భారమైన హృదయాలతో వీడ్కోలు పలికాము  
పొచ్చర జలపాతం చేరగానే
ఆపరిసరాల్లో ఏదోతెలియని విషాదం గూడుకట్టుకున్నట్టుగా అన్పిస్తుంటే మెల్లగా ముందుకు కదులుతున్న మమ్ముల్ని    
అడ్డగిస్తూ ఇద్దరు వ్యక్తులు
సర్కార్ వారు జలపాత సందర్శనకు కొత్తగా టిక్కెట్ల అమ్మకం మొదలెట్టారని చెప్పడంతో 
ఆహా!నా రాజ్యమా నీ దృక్పథానికి జోహార్లనుకుని చచ్చినట్టు టిక్కెట్లు కొనుక్కొని కిందకు దిగితే 
పాపం! జలపాతాన్ని బలమైన ఇనుపజాలీ బోనులో బంధించి సందర్శకులకు దూరంచేశారు 
ఇదేం పాపమని నెత్తీనోరు కొట్టుకుంటూ అడిగితే 
ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మానోర్లే మూయించారు 
వారి తర్కానికి 
విస్తుబోయిన మేము 
బంధీ అయిన జలపాతం రోదన వింటూ ఎంతోసేపు అక్కడ నిలువలేక కుంటాలకు పారిపోతే
అక్కడా ఇదే కథ పునరావృత్తం 
ప్రభుత్వాలు వ్యాపారుల్లా 
ప్రజల్నుండి డబ్బులు దండుకోవడంలో చూపే చొరవ  వసతులు కల్పించడంలో చూపకపోవడం శోచనీయమనుకుంటు అసహనంగా వెనుదిరిగాము
కామెంట్‌లు