అమ్మ:- సత్యవాణి

 అమ్మ సాహసి..
-కానుపు ప్రాణానికి గండమని తెలిసినా
బిడ్డకు జన్మనివ్వడానికి సిధ్ధపడుతుంది
అమ్మ ఓర్పరి..
బిడ్డ కడుపులో తన్నినా
తన్మయత్వం చెంది మురిసిపోతుంది
అమ్మ ఒక శాస్త్రవేత్త..
రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీరుస్తుంది
అమ్మ ఒక వైద్యురాలు..
బిడ్డ ఆరోగ్యం పరిరక్షణ బాధ్యతవహిస్తుంది
అమ్మ ఒక దాది..
బిడ్డకు లాలపోసి జోల పాడి నిద్రపుచ్చుతుంది
అమ్మ ఒక మెజీషియన్..
గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డను
తన కర స్పర్శతో కిలకిలా నవ్విస్తుంది
అమ్మ ఒక బాల భాషావేత్త...
బిడ్డ భాషను అర్థం చేసుకుంటుంది బిడ్డ భాషలోనే బిడ్డతో సంభాషిస్తుంది.
అమ్మ ఆదిగురువు..
సమస్త విశ్వకోటిని బిడ్డకు పరిచయం చేస్తుంది
అమ్మ మానసిక శాస్త్రవేత్త..
బిడ్డ కళ్ళలోకి చూసి ఆకలి అవసరం గ్రహిస్తుంది.
అమ్మ త్యాగమూర్తి..
అవసరమైతే బిడ్డకోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా
సమర్పిస్తుంది
అమ్మ దయా సింధు..
బిడ్డ కాలి ముల్లు అమ్మకి కంటి నలుసు..
అమ్మ కాలేనిది ఏదీలేదు
అన్నీ అవగలదు
అవసరమైతే నాన్న అమ్మ కాలేడు
కానీ
అమ్మ నాన్న బాధ్యతలనులను
తలకెత్తుకోగలదు
అందుకే
 అమ్మ అమ్మే..
 ఖండాంతరాలలో ఆపదలో ఉన్న బిడ్డ “అమ్మా” ఆక్రందన చేస్తే
ఇక్కడ అమ్మ కన్న పేగు కదిలి బాధతో కలుక్కుమంటుంది.
అమ్మ బిడ్డల అవసరాలను
కళ్ళతో చూడకపోయినా
మనసుతోచూస్తుంది 
అందుకే అమ్మ మాతృదేవత 
                   
కామెంట్‌లు