కనుమరుగైన కంజీరనాదం ..!!>పాల్వంచ> శీరంశెట్టి కాంతారావు >రచయిత *

 మాఊళ్ళో మసీదును ఆనుకుని  ఫకీరోళ్ళ గుడిశలుండేవి
పాపంవాళ్ళంతా కటిక పేదోళ్ళు  ..!
ఆ చిన్న చిన్న గుడిశల్లోనే తేనెపట్టుమీది ఈగల్లా జిబజిబలాడుతూ బతికేవాళ్ళు   
కొందరు మగవాళ్ళు
పొద్దున్నే లేచి భుజాలకు జోలెలు తగిలించుకుని 
కంజర్ల మీద పాటలు పాడుతూ
ఒంటిగంట దాకా ఊళ్ళ మీదికి
భిక్షాటనకి వేళ్ళొచ్చేవాళ్ళు
మరికొందరు హోటల్లలో సప్లయర్లుగానో క్లీనర్లుగానో
పనిచేసేవాళ్ళు    
ఎందుకోగాని వాళ్ళెవ్వరూ వ్యవసాయ పన్లకు మాత్రం అసలు వెళ్ళేవాళ్ళే కాదు
ఏడాదంతా అస్తుబిస్తు సంపాదనతో ఉసూరుమంటు గడిపేవాళ్ళ బతుకుల్లో
రంజాన్ మాసం వస్తూనే సందడి తెచ్చేది 
దయార్ద్రులైన తోటి ముస్లీమ్ 
సోదరులు తమకు కలిగినంతలో నెలపొడవునా వాళ్ళకు వివిధ రూపాల్లో  జఖాత్ లిస్తుండేవాళ్ళు
చీమలు వర్షాకాలంలో తిండికి ఇబ్బంది పడకుండా 
ముందు జాగ్రత్తగా
ఎండాకాలంలో గింజా గింజాను సేకరించిపుట్టలో దాచుకున్నట్టు
రంజాన్ నెలరోజులూ దొరికిన పైసల్ని ఏడాది పొడవునా బతుకు బండిని గుంజేటందుకు పొదుపు చేసుకునేవాళ్ళు
వాళ్ళందర్లోకీ బుడాన్ సా వ్యవహారం భిన్నంగా వుండేది నెల ఆరంభం అవుతూనే తెల్లవారుజామున
మూడుగంటలకే లేచి కంజర మీటుతూ వారి భాషలో ఏవేవో గీతాలు పాడుతూ ఊళ్ళోవున్న
ప్రతి ముస్లీమ్ ఇంటికెళ్ళి తలుపు తట్టేవాడు 
అందుకు ప్రతిగా మజీద్ కమిటీ కొంత ఇనామ్ ఇచ్చేది
జఖాత్ కూడా అందరికన్నా  ఎక్కువ దొరికేది
కాలగమనంలో...
'నది'తనదిశనుమార్చుకున్నట్టు
ధర్మం పట్ల ఎంతో నిబద్ధతగా వుండే ముస్లమ్ సోదరుల్లో సైతం 
మార్పు చోటుచేసుకుంటున్నట్టు
అజా కోసం మజీద్ లోకి కొత్తగా మైక్ లొచ్చి చేరాయి.  
సైరన్లు వాటికి జతగలిశాయి
ఎప్పుడైతే మజీద్ కి సైరనొచ్చిందో అప్పటి నుండి రంజాన్ మాసంలో 
పాపం! బుడాన్ సా నలుగుర్లో ఒక్కడుగా కాకుండా
నలుగుర్లో ఒకడయ్యాడు ఇప్పుడు ఊరూరుకీ ఓ బుడాన్ సా
             
 తమ ప్రత్యేక ప్రతి పత్తిని కోల్పోయారు

కామెంట్‌లు