బొంగరాల జాడే లేదు:-- యామిజాల జగదీశ్


 కొన్నిరోజుల క్రితం ఏదో విషయం ప్రస్తావనకొచ్చినప్పుడు బొంగరాల గురించి ఎవరో ఏదో చెప్పారు. అప్పుడు వెంటనే నాకు మద్రాసులో నా చిన్నతనంలో గ్రిఫిత్ రోడ్డు (ఇప్పుడు ఈ వీధి పేరు ఓ ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పేరిట మార్చారు. ఇప్పటికిప్పుడు ఆ పేరేంటో గుర్తుకు రావడం లేదు) లో ఉన్న ముప్పాత్తమ్మన్ ఆలయంమీదకు మనసు మళ్ళింది. ఇదొక అమ్మవారి ఆలయం. దీని నిర్వాహకుల వాటా గుడి ఆవరణలోనే ఉండేది. యజమాని లావుగా ఉండేవాడు. ఉంగరాల జుత్తు. ఈ వాటా ఆనుకునే ఓ యంత్రం ఉండేది. ఈ యంత్రంమీదే బొంగరాలు తయారు చేయడం చూశాను. చిన్నవీ పెద్దవీ మధ్యస్తం ఇలా రకరకాల సైజులలో చేసేవారు. అది చూడటం కోసం అక్కడికి వెళ్తుండేవాడిని ఒకరిద్దరు మిత్రులతో. ఇదేకాక, పరీక్షలప్పుడు తప్పకుండా ఈ గుడికి వెళ్ళి అమ్మవారిచుట్టూ ప్రదక్షిణలు చేసేవాడిని. పరీక్షలలో ఫెయిల్ అవకుండా చూడమని ప్రార్థించేవాడిని. 
ఈ గ్రిఫిత్ రోడ్డులో గుడికాకుండా ప్రధానమైనవి నేను చదువుకున్న రామకృష్ణామిషన్ ఎలిమెంటరీ స్కూలు. ఇవే రెండు ఆవరణలలో ఉండేవి. ఒకటో తరగతి నించీ అయిదు వరకూ ఈ రెండు ఆవరణలలోనే చదువుకున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ మరచిపోలేని మా ఒకటో క్లాస్ టీచర్. పేరు అన్నపూర్ణగారు. తెల్లగా సన్నగా పొడవుగా ఉండేవారు. నుదుట ఎర్రటి బొట్టు. ఇప్పటికీ ఆమె రూపం కళ్ళ ముందు కనిపిస్తోంది. ఒకటో క్లాస్ నుంచి నాతో కలిసి  చదువుకున్న వాళ్ళల్లో చాచి అనబడే పసుమర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి‌,.యు.వి. కృష్ణమోహన్, వెంకీ అనబడే వెంకటేశ్వరరావు, కొల్లూరు రంగారావు, భాస్కరరామ్మూర్తి, సంపూర్ణానంద్ (ఈ ముగ్గురూ అన్నదమ్ములు), వీరి అక్కయ్య సీత ఉన్నట్టు గుర్తు. 
అలాగే ఇదే వీధిలో మా స్కూల్ గ్రౌండు, ఈ గ్రౌండు కాంపౌండ్ గోడను ఆనుకుని మా నాన్నగారు మాష్టారుగా పని చేసిన శారదా విద్యాలయ బాలికల పాఠశాల, మా స్కూల్ హాస్టల్ ఉండేవి. ఇక గుడి ఎదురుగుండా కృష్ణగానసభ. సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయమే ఈ సభ ఆవరణ. ఇవి పోతే ఓ కళ్యాణమండపం, మరో రెండో మూడో ఇళ్ళు ఉన్నట్టు గుర్తు.
అదలా ఉండనిచ్చి, బొంగరాల విషయానికొస్తాను. చదువుమీద కన్నా ఆటలమీదే ఎక్కువ ఆసక్తి ఉండేది. బొంగరాలు, గోళీలు, కర్రాబిళ్ళా, తొక్కుడుబిళ్ళా, దొంగ పోలీసు ఇలా ఏ సీజన్ కి ఆ సీజన్ తగ్గట్టు ఆటలే ఆటలు. క్రికెట్ సరేసరి. నా ఆల్ టైమ్ ఫేవరిట్ గేమ్. అమ్మ దగ్గర పావలా ఇరవై పైసలు తీసుకుని జాటీ (తాడు), బొంగరం కొనుక్కునేవాడిని. బుల్లి బుల్లి బొంగరాలు ముద్దుగా ఉండేవి. కానీ ఆట అనేసరికి మాత్రం పెద్ద బొంగరాలే బాగుంటాయి. బొంగరానికి తాడు చుట్టి వదలడంలో ఉండే మజానే వేరు. ఒక్కొక్కప్పుడు బొంగరం నేల మీద పడకుండా జాటీ నించి వదిలిన బొంగరాన్ని గాల్లోనే అర చేతిలో పట్టి తిరుగుతుంటే చూడటం అనేదొక ఆనందం. బొంగరాల ఆటలో ఓడిపోయినవారి బొంగరాన్ని ఓ  వలయాకారంలో గీసి అందులో ఉంచి అందరూ దానిని గురి చూసి కొట్టడం బలేగా ఉండేది. తాడుతో బొంగరం తిప్పటం, ఎక్కువ సేపు తిరిగేలా చేయటం, అరచేతిలో బొంగరాన్ని ఆడించటం వంటివన్నీ మన నైపుణ్యానికి ప్రతీకన్న మాట. అలాగే ఒక్కొక్కప్పుడు ఓడిపోయినతని బొంగరంమీద ఇతరులు తమ తమ బొంగరానికుండే మేకుతో గుచ్చుతారు. పెద్ద వృత్తం, చిన్న వృత్తం ఇలా రెండు రకాల వృత్తాలలోకి బొంగరాలను విడిచి అరుస్తూ ఆడుతున్నప్పుడు ఒంటి మీద స్పృహ ఉండేది కాదు. ఇప్పుడసలు ఆ బొంగరాల జాడే కనిపించకుండాపోయింది.  

కామెంట్‌లు