బాల్ పాయింట్ పెన్నుకి వీడ్కోలు పలుకుదాం!!:-- యామిజాల జగదీశ్

 ఇది బాల్ పాయింట్ పెన్ను యుగం. స్కూలు పిల్లలు మొదలుకుని పెద్దవాళ్ళవరకూ బాల్ పాయింట్ పెన్ను వాడటమే సులభంగా ఉంటోంది. ఫౌంటెన్ పెన్నులో ఇంకు పోయడం, కడగడం, తుడవడం వంటి వాటితో సమయం వృధా అవుతుందని అనుకుంటాం. కానీ ప్లాస్టిక్కుతో తయారైన బాల్ పాయింట్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని తెలుసుకోవడం లేదు.
ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ బాటిళ్ళ గురించి జనం మధ్య ఎంత చెప్పినా వాటి వాడకం తగ్గడంలేదు. ప్లాస్టిక్ వాడకం వల్ల తలెత్తే సమస్యల గురించి చైతన్యపరిచినా ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. పైగా యూస్ అండ్ త్రో పెన్నుల వాడకం ఏమాత్రం తగ్గలేదు. అలా విసిరేసే పెన్నులవల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువవుతుందనేది మరచిపోతున్నాం.
ఒక్క కేరళలోనే నెలకు మూడు కోట్ల బాల్ పాయింట్ పెన్నులు వాడుతున్నట్టు, వాటిలో సిరా అయిపోవడంతోనే పారేయడం జరుగుతున్నట్టు తేలిందని ప్యూర్ లివింగ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి, చిత్రకారిణి అయిన లక్ష్మీ మేనన్ తెలిపారు.
ముఖ్యంగా విద్యార్థులతో బాల్ పాయింట్ పెన్నుల వాడకాన్ని మాన్పించేసి పూర్వంలా ఫేంటెన్ పెన్నులతో రాయించడం అలవాటు చేయాలన్నారామె. ఆమె ప్రతిపాదనకు కేరళ ప్రభుత్వంకూడా ఆమోదముద్రవేసింది. 
 ప్రజల జీవితం ప్రకృతితో ముడిపడినదై ఉండాలనే ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం హరిత కేరళం అనే ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా కేరళలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు బాల్ పాయింట్ పెన్నులకు బదులు తప్పనిసరిగా ఫౌంటెన్ పెన్నులనే వాడాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలకు కేరళ ప్రజలు, విద్యార్థులు తలొగ్గారు. కొన్ని సేవాసంస్థలు విద్యా సంస్థల యాజమాన్యాలతో కలిసి ఈ ఆదేశాలు నూటికి నూరు శాతం అమలయ్యేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాయి.
లక్ష్మీ మేనన్ మాట్లాడుతూ, ఈ ప్రయత్నం బాల్ పాయింట్ పెన్నులకు వ్యతిరేకంగా కాదని, పర్యావరణ పరిరక్షణకోసమే ఈ చర్యలు తీసుకోవలసి వచ్చినట్టు" చెప్పారు.
ఆమె ఇప్పటికే పలువురితో కలిసి ఇప్పటివరకూ ఏడు లక్షల బాల్ పాయింట్లను సేకరించారు. ఈ పాత బాల్ పాయింట్ పెన్నులను ఏం చేస్తారని అడగ్గా "బాల్ పాయింట్ పెన్నులకు వీడ్కోలు పలుకుదాం - ఇక ఫౌంటెన్ పెన్నులనే వాడుదాం - పర్యావరణాన్ని కాపాడుకుందాం" అనే నినాదాలతో ప్రజలను చైతన్యపరచడంకోసం ఓ స్థూపం ఏర్పాటు చేయదలిచామన్నారు ఆమె.
ఆమె విషయం తెలుసుకున్న లండన్ లోని ఓ స్వచ్ఛందసేవా సంస్దకూడా తమ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టేందుకు లండన్ కొచ్చి తమకు సహకరించాలని లక్ష్మీ మేనన్ని ఆహ్వానించారు. 
కేరళలలో త్వరలోనే ఆఫీసులలోనూ బాల్ పెన్నుల వాడకానికి బదులు ఫౌంటెన్ పెన్నులనే ఉపయోగించేలా చర్యలు చేపట్టాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని కేరళ విద్యాశాఖ మంత్రి ఒకరు తెలిపారు.

కామెంట్‌లు