పెన్ను....ఓ పాత కథే కొత్తగా:-- యామిజాల జగదీశ్ కొన్ని రోజులుగా పెన్నుతో రాయడం మానేసి పెన్సిలుతో రాస్తూ వస్తున్నా. 
కారణం, 
వారంలో రెండు పెన్నులైనా తప్పిపోతున్నాయి. ఒకటి నేనే నా మతిమరపుతో ఎక్కడో చోట పెన్ను పెట్టేసి మరెక్కడో వెతకడం. అప్పుడది కనిపించకపోవడం. లేదా రెండోదేమిటంటే ఎవరో ఒకరు ఇప్పుడే ఇస్తానని అడిగి తీసుకుని తిరిగివ్వకపోవడం.
 ఆశ్చర్యమేమిటంటే, పెన్సిల్ తో రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి మూడు వారాలైనా రెండు పెన్సిళ్ళూ పెట్టిన చోటే అలాగే ఉంటున్నాయి దారి తప్పక. వాటినెవరూ పట్టించుకోవడం లేదు. ఒకవేళ చూసినా పెన్సిల్ అంటే చిన్నచూపేమో....
మూడో తరగతతో నాలుగో తరగతో  చదువుతున్నప్పుడు ఎప్పుడు పైతరగతికి వెళ్తామా అని ఆరాటం. కారణం పెన్నుతో రాయడంకోసం. అంటే మూడో తరగతి వరకూ పెన్సిలుతోనే రాయాలి ఎంతైనా. పెన్సిల్ తో రాస్తేనే దస్తూరీ కుదురుగా ఉంటుందని అందంగా ఉంటుందని అప్పట్లో టీచర్ల మాట.
స్కూల్లో పెన్నంటే ఇంకు వేసుకుని రాయడం. ఇంట ఇంకు బాటిల్ లేకుంటే స్టేషనరీ షాపుకెళ్ళి ఇంకు పోయించుకుని అయిదో పైసలో ఎంతో ఇచ్చినట్టు గుర్తు. నా స్కూలు చదువులప్పుడు బాల్ పాయింట్ పెన్నులంతగా లేవు.  ఒకే పెన్నుని ఏళ్ళ తరబడి ఉపయోగించడం. లీకయ్యే పక్షంలో సిరా కారే చోట కాగితాలు లేదా గుడ్డ చుట్టడం మామూలే. అప్పటికీ వేళ్ళంతా ఇంకే. చొక్కా జేబులో పెట్టుకుంటే ఇంకు కారి జేబు మరకలయ్యేది. అప్పట్లో హీరో పెన్నుతో రాసినట్టు గుర్తు. రోజులు సాగేకొద్దీ కామ్లిన్ పెన్ను వాడకంలోకొచ్చింది. ఆ తర్వాత బాల్ పాయింట్ పెన్నుల యుగం. రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ను వాడకం ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత జెల్ (క్యాట్రిడ్జ్) పెన్నులొచ్చాయి. నాకు బాల్ పాయింట్ పెన్నులకంటే క్యాట్రిడ్జ్ పెన్నులంటేనే ఇష్టం. ఈ పెన్నుతో రాస్తుంటే ఫౌంటెన్ పెన్నుతో రాస్తున్నట్టే ఫీలవుతుంటాను. పైగా ఇంకు కారిపోవడమంటూ ఉండదు.
ఇటీవల పెన్నుతో రాయడం మంచిదా లేక పెన్సిల్ తో రాయడం మంచిదా అని ఏదైనా వ్యాసం ఉంటుందాని ఇంటర్నెట్ లో గాలించగా సరైన జవాబు దొరక లేదు కానీ.
కొంత సమాచారమైతే కంట పడింది. 
ఓ పెన్ను కంపెనీ  సగటున రోజుకు తయారుచేసే పెన్నుల సంఖ్య ఎంతో తెలుసా ? దాదాపు ఒక మిలియన్ పెన్నులు. అంటే పది లక్షలు. 
నా చిన్నతనంలో లేక యవ్వనంలో కావచ్చు పెన్నులు తయారు చేసే సంస్థలం ఒకటి రెండే ఉండేవి. కానీ ఈరోజుల్లో బోలెడు కంపెనీలు. బాల్ పాయింట్ పెన్నుల తయారీ సంస్థలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చాయి. జెల్ పెన్నులు సరేసరి. ఈ పెన్నులకు నటులు, క్రీడాకారులతో ప్రకటనలు చేయిస్తున్నరంటే ఆయా సంస్థలు ఎంతగా సంపాదించాలో కదా? 
సరేగానీ, విషయానికొస్తాను.
జాతీయస్థాయిలో పేరు పొందిన ప్రముఖ సంస్థలు ఓ పది దాకా ఉన్నాయి. ఇక లోకల్ సంస్థలు మరో పది వేసుకున్నా మొత్తంమీద ఓ ఇరవై కంపెనీలు పెన్నులో బాల్ పాయింట్ పెన్నులో జెల్ పెన్నుల తయారీలో పోటీపడుతున్నాయి.
రోజుకి ఓ సంస్థ పది లక్షల పెన్నులు తయారు చేస్తున్నాయనుకుంటే ఇరవై సంస్థలు రమారమి రెండు వందల లక్షల పెన్నులు అంటే రెండు కోట్లు తయారు చేస్తున్నాయన్న మాట. 
రెండు కోట్ల చొప్పున లెక్కేసుకుంటే ఏడాదికి 730 కోట్ల పెన్నులు తయారవుతున్నాయి.
ఆ మేరకు అమ్మకాలు జరుగుతున్నాయి. 
కానీ నా విషయానికొస్తే ఎన్ని పెన్నులు వాడి ఉంటానో సరిగ్గా చెప్పలేనుకానీ దాదాపు వంద దాకా ఉండొచ్చు. పెన్నుల వాడకం అనేది నేను మా పెద్దన్నయ్య శ్యామలరావు నించే నేర్చుకున్నా. నాకెక్కువ పెన్నులు కొనిచ్చింది కూడా పెద్దన్నయ్యే. వాటిని కడగడం, తడి ఉండనివ్వక పొడి గుడ్డతో తుడవడం, సిరా నింపిన తర్వాత ఓ పది సార్లన్నా రావ్ రావ్ అని ఇంగ్లీషులో రాసి చూడటం వంటివన్నీ అన్నయ్యను చూసి నేర్చుకున్నవే. ఇప్పుడు నా దగ్గర మిగిలి ఉన్నవి ఓ రెండు జెల్ పెన్నులే. అలాగే మా ఆవిడ పది రూపాయలకు ఓ మూడు బాల్ పాయింట్ పెన్నులు కొనుక్కుంటే వాటిలో రెండు నేను సొంతం చేసేసుకున్నాను.
పెన్నులన్నీ రీసైక్లింగ్ చేయబడుతోందా అంటే లేదనే చెప్పాలి. అలాంటి ఏర్పాటు ఉన్నట్టు కూడా లేదనుకుంటాను. ఈ విషయం నాకు సరిగ్గా తెలీదు. పెన్నులు చాలా వరకు ప్లాస్టిక్కుతోనే తయారవుతున్నాయి.ఓ నిబ్బు (పాళీ) తప్పించి పెన్ను క్యాప్, ఇంకు నింపే భాగం ఇలా ప్రతిదీ ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నవే. పెన్నులు ఉపయోగించినంత కాలం వాడేసి ఆ తర్వాత చెత్తకుండీలో విసిరేసేవెన్నో చెప్పలేం.
పెన్నుకు ముందర మనందరం రాసింది పెన్సిల్ తోనే కదా? పెన్సిల్ రేటు కూడా పెన్ను కంటే తక్కువే. నేను స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో మమ్మల్నొకమారు గిండీలో ఉన్న ఓ పెన్సిల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడం బాగా గుర్తు. ఇప్పుడా సంస్థ ఉందో లేదో తెలీదు. పెన్సిల్ ధర పక్కన పెడితే దాని వల్ల పర్యావరణానిక ఏ ముప్పూ లేదు. ఒకవేళ ఏదైనా తప్పు రాసినా రబ్బరుతో చెరిపేసి మళ్ళా రాసుకోవచ్చు. పెన్సిల్ వాడకంలో ఈ సౌలభ్యముంది. పెన్సిళ్ళు తయారించడానికి చెట్లు ఉపయోగపడుతున్నాయి. 
 అయినా కంప్యూటర్లు వచ్చాక దాని మీద పని చేయడంతో రాసే అలవాటే తగ్గిపోతోందన్నది వాస్తవం. ఒకవేళ రాసినా దస్తూరీలోనూ మార్పు వచ్చేస్తుంది. ఒకప్పుడు నా దస్తూరీ ఎంతో బాగుండేది.  1990లలో అనుకుంటాను, ఉదయం దినపత్రికలో కంప్యూటర్ లో మొట్టమొదటగా డీటీపీ చేయడం అలవాటైంది. అంతకుముందు మద్రాసులో ఓ ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళి టైపింగ్ నేర్చుకున్నాను. లోయర్ ప్యాసయ్యాను. హయ్యర్ పరీక్షలకు వెళ్ళలేదు. కొంత వరకూ నేర్చుకున్నాను. ఇప్పుడు సెల్ ఫోన్లో ఒక్క వేలితో టైప్ చేయడం, కంప్యూటర్ మీద డీటీపీ చేయడంతో రాయడమనేది చాలా వరకూ తగ్గిపోయి దస్తూరీ దెబ్బతింది. బ్యాంకుల్లోనో లేక మరి కొన్ని చోట్ల సంతకాలు చేయడానికి ఇప్పటికీ పెన్నులు వాడకతప్పదు. కనుక పూర్తిగా పెన్నుతో తెగతెంపులు చేసుకోలేం. అది కుదరని పని.
ప్లాస్టిక్కుతో తయారయ్యే పెన్నుల వాడకాన్ని సంతకాలకు పరిమితం చేసి పెన్సిళ్ళ వాడకాన్ని ఎక్కువ చేసుకుంటే మంచిదేమో అన్పిస్తోంది. ఎప్పుడో చిన్నప్పుడు రాసింది కనుక ఇప్పుడు పెన్సిల్ చేత పట్టుకోవడం ఒకింత శ్రమ అనిపించొచ్చు. కానీ అసాధ్యమైతే కాదు. అలవాటైతే ఏదైనా తేలికే కదా!

 
కామెంట్‌లు