గణపతి ముని:-- యామిజాల జగదీశ్
 మా నాన్న యామిజాల పద్మనాభస్వామి గారి గురువుగార్లలో ఒకరు గణపతి మునిగారు. ఈయన మా సాలూరు మండలంలోని శివరాంపురంలో ఉండిన మా తాతగారింట ఆతిథ్యం స్వీకరించిన సందర్భాలున్నాయి. ఈయన గురించి మా నాన్నగారు గణపతి ముని పేరిట ఓ పుస్తకం కూడా రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మా నాన్నగారు తెలుగు పండితులుగా పని చేసిన రామకృష్ణా మిషన్ వారి శ్రీ శారదా విద్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లెమాల ఎం.ఎస్. రెడ్డి, పి.బి. శ్రీనివాస్, "చందమామ" రామారావు తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ పుస్తకాన్ని మా నాన్నగారు మా నాలుగో అన్నయ్య రమణకు అంకితమిచ్చారు. వాడు 1979లో మరణించాడు.  ఈయన గురించి శ్రీ గణపతి సుప్రభాతమ్ రాశారు. గణపతి మునిగారికి కావ్యకంఠ అనే బిరుదుతో సుప్రసిద్ధులు. ఆయన గురించి మా నాన్నగారు రాసిన వ్యాసాలలో ఒకటి రెండు నా దగ్గరున్నాయి. ఇంద్రాణి సప్తశతి, పాండవ ధార్త రాష్ట్ర సంభవమ్, దేవ వైద్యులకు బుద్ధి చెప్పిన మహాపతివ్రత సుకన్య వంటి వ్యాసాలు సేకరించగలిగాను. అలాగే గణపతి మునిగారు రాసిన హేరంబోపస్థానమ్ పుస్తకానికి తెలుగులో తాత్పర్యం సైతం రాశారు. ఉమాసహస్రానికి తాత్పర్యమూ రాశారు.
అయిదేళ్ళ వరకూ అమ్మా అని పిలవడానికైనా కంఠం కదలని గణపతిమునిగారు పన్నెండేళ్ళు రాకముందే పంచకావ్యాలు, నాటకాలంకారాలు, సిద్ధాంతకౌముదీ చదివినట్టు మా నాన్నగారు ఓ వ్యాసంలో రాశారు. చదివినదంతా నిరాఘాటంగా పాఠం చెప్పగలిగిన సాహితీ సముద్రుడిగా అభివర్ణించారు. పదేళ్ళ పసితనంలో కాళిదాసు మేఘసందేశానికి అనుకృతిగా భృంగసందేశ కావ్యాన్ని చెప్పి కవిననిపించుకున్న గణపతిమునిగారే తిరువణ్ణామలై (తమిళనాడు)లో ఉన్న రమణమహర్షిగారిని దర్శించి భగవాన్ అని సంబోధించారు. గణపతి మునిగారిని "నాయన" అని చెప్పింది రమణ మహర్షిగారే. 
గణపతి మునిగారు రాసిన ఉత్తరాలను "లేఖల్లో నాయన" అనే శీర్షికతో డా. గంటి శ్రీరామమూర్తిగారు అయిదారేళ్ళ క్రితం ఓ పుస్తకం ప్రచురించారు. కొన్ని లేఖలు గుంటూరు లక్ష్మీకాంతంగారు రాసిన నాయన పుస్తకంలో అచ్చయ్యాయి. నాయన పుస్తకం మా నాన్నగారు ఎల్లప్పుడూ తను కూర్చుని రాసుకునే చోట పక్కనే పెట్టుకునే వారు. అలాగే మా మావగారైన పాత్రికేయులు జి. కృష్ణగారి పక్కనే ఉండేది. ఆయన ఎక్కడికైనా ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నఫ్పుడు నాయన పుస్తకం తీసి అందులో ఏదో ఒకటి మనసులో చదువుకుని గానీ వెళ్ళేవారు కాదు.
లేఖల్లో నాయన పుస్తకంలోని లేఖలన్నింటినీ కృష్ణగారు గంటివారికి కావ్యకంఠ భారతి ద్వారా ఇచ్చారు. గంటివారు ఈ లేఖలకు నకలు వ్రాయించి వాటిని అనకాపల్లి శారద గ్రంథాలయంలో భద్రపరిచారు. 1990లో గంటి శ్రీరామమూర్తిగారి మరణానంతరం కావ్యకంఠభారతి, కవితా సమితి కనుమరుగయ్యాయి. రెండు నోటు పుస్తకాలలో వ్రాసిన లేఖల నకలు మాత్రం మిగిలాయి. 
అంతకుముందు ఈ ఉత్తరాలను భద్రపరచిన వారు నాయనగారి శిష్యులు కళ్యాణరామన్ గారు. 
135 పేజీలో లేఖల్లో నాయన పుస్తకంలో మొదటి ఉత్తరం సంస్కృతంలోనిది కాగా మిగిలినవన్నీ తెలుగులోనివే. సంస్కృత లేఖను గణపతి మునిగారు 1912లో రాసినది. మొత్తంమీద నాయన గారి లేఖలు 15వ పేజీ నుంచి 123 పేజీలవరకూ ఉండగా అమ్మ లేఖలు 126, 127 పేజీలలో ఉన్నాయి. ఈ ఉత్తరాలలో అక్కడక్కడ గణపతిమునిగారు తమ కుమార్తె వజ్రేశ్వరిగారిని ప్రస్తావించిన అంశాలున్నాయి. ఆయన "వజ్ర" అనే రాసేవారు. వజ్రేశ్వరిగారు కృష్ణగారింటికి వస్తుండేవారు. 1982లో నేను మద్రాసు నుంచి హైదరాబాదుకి వచ్చిన రోజుల్లో వజ్రేశ్వరమ్మగారిని ప్రత్యక్షంగా చూసాను. నరసింహంగారే ఆమెను కృష్ణగారింటికి తీసుకువస్తుండేవారు. ఆమె రావడంతోనే కృష్ణగారింట ఓ ఆహ్లాదకర వాతావరణం నెలకొనేది. ఆమె ఏవేవో కబుర్లు చెప్తుండేవారు. ఆమె ఫోటో ఎక్కడైనా ఉందాని అడిగితే మా ఆవిడ రేణుక తన చెల్లెళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ దగ్గర ఉండొచ్చని చెప్పింది. ఇక ఆలస్యమెందుకని ముందుగా తారకు మెసేజ్ పెట్టగానే తన దగ్గరున్న ఒకేఒక ఫోటోని వాట్సప్ లో పంపింది. ఆ ఫోటోలో వజ్రేశ్వరిగారితోపాటు మా మావగారు కృష్ణగారు, మా అత్తగారు, మా బావమరిది రమణ, నరసింహం గారు ఉన్నారు. ఆ ఫోటో చూడటంతోనే ఆమె గురించి ఏవైనా విషయాలు తెలుసుకుందామని ఒకరిద్దరిని కాంటాక్ట్ చేసాను. కానీ ప్రయోజనం లేకపోయింది. పోనీ తారమ్మయినా ఫోటో పంపినందుకు తనకు థాంక్స్ చెప్పడం కనీసధర్మం. ఎంత ఆనందంగా అనిపించిందో ఆ ఫోటో చూస్తుంటే. 
కొన్నేళ్ళ క్రితం నేను మా అత్తగారితో కలిసి వజ్రేశ్వరిగారి కుమారుడి ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. అవన్నీ గుర్తుకు రావడంలేదు కానీ వజ్రేశ్వరమ్మగారు భగవాన్ రమణమహర్షి ఒడిలో ఆడుకున్నట్టు చెప్పారు. ఇంగ్లీష్ పుస్తకాలు అలవోకగా చదివేవారట. ఎంతదృష్టమో కదండీ. ఆవిడ మనవరాలు రేణుక అయోల కవితలు రాస్తుంటారు. 
ఇన్ని మాటలు రాయించిన ఆ ఫోటోకి మనః పూర్వక నమస్సులు. కామెంట్‌లు