సమష్టి విజయం (కథ) : సరికొండ శ్రీనివాసరాజు

   రాజేంద్ర 8వ తరగతి చదువుతున్నాడు. వయసుకు మించిన బలశాలి. కబడ్డీ ఆటలో అతనికి తిరుగులేదు. ఒక్కసారి కూతకు వెళ్ళినాడంటే ఏకంగా ఏడుగురిని ఇవతలకు ఈడ్చుకురాగల సత్తా ఉంది. 10వ తరగతి విద్యార్థులు కూడా రాజేంద్ర చేతిలో చిత్తు అవుతారు. దాంతో రాజేంద్రకు గర్వం బాగా పెరిగింది. తనతో పోటీపడి ఎవ్వరూ గెలవలేరని అందరినీ హేళన చేసేవాడు. చివరికి తన టీంలోని వారిని కూడా చులకనగా చూసేవాడు. "నా వల్లనే మీకు మొదటి బహుమతులు వస్తున్నాయి. నా జుట్టులో ఉండటం మీ అదృష్టం. నేను ఎలకపిల్లలను కూడా నా జుట్టులో తీసుకుని గెలుస్తా." అని మాట్లాడేవాడు. ఇది వాళ్ళు అవమానంగా భావించేవారు. 

      సతీశ్ 10వ తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి. కానీ ఏ ఆటల్లోనూ పాల్గొనడు. కానీ 10వ తరగతి నుంచి 6వ తరగతి విద్యార్థి వరకూ అందరితో స్నేహంగా ఉండేవాడు. ఒకరోజు సతీశుతో రాజేంద్ర "నువ్వు 10వ తరగతిలో క్లాస్ ఫస్ట్ రాగానే గొప్ప అనుకుంటున్నావా? నీకు ఏ ఆటలూ చేతకాదు. నాతో ఒక్క ఆటైనా ఆడి గెలుపు. చూద్దాం. నా మీద ఒక్క ఆటలో గెలిచినా నేను కబడ్డీ ఆటను వదులుకుంటాను." అన్నాడు. వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని సతీశ్ అనుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుంది. అనుకోనంత ఆశ్చర్యంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఆటల పోటీలకు వారం రోజుల ముందే కబడ్డీ జట్టులను తయారు చేశాడు. రాజేంద్ర అంటే భయం కారణంగా తక్కువ మంది పేర్లు ఇచ్చారు. రెండు టీములు మాత్రమే తయారు అయినాయి. "ఈ వారం రోజులూ ఆఖరి పీరియడ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి." అని చెప్పాడు. ఈసారి సతీశ్ కూడా కబడ్డీకి పేరు ఇచ్చాడు. తాను ఎవరిని కోరుకున్నా గెలవగలను అన్న అహంకారంతో రాజేంద్ర సతీశును కోరుకున్నాడు‌ రాజేంద్ర ప్రాక్టీసుకు డుమ్మా కొట్టి అటువైపు కూడా రావడం లేదు. తనకంటే బలహీనులతో ఆడటానికి ప్రాక్టీస్ అవసరమా అనుకున్నాడు. 
       రాజేంద్ర టీంతో తలపడే టీం మంజునాథ టీం. సతీశ్ మంజునాథ టీంతో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశాడు. "మిత్రులారా! రాజేంద్ర ఎంతో బలవంతుడు అని, అతని చేతిలో ఓడిపోవడం ఖాయమని నిరుత్సాహంతో ఉండవద్దు. బలవంతమైన పాము కూడా చలి చీమల చేతిలో చస్తుందని తెలుసుకున్నాం కదా! మీలో మన 10వ తరగతి వారే ఎక్కువగా ఉన్నారు. ఇంతమంది కలిసి 8వ తరగతి విద్యార్థికి భయపడటం సిగ్గుచేటు. అందరూ కలిసి ప్రాక్టీస్ చేయండి. అందరూ కలిసి కట్టుగా రాజేంద్రను ఔట్ చేస్తే మిగతా వారంతా తేలికగా దొరికిపోయారు. అప్పుడు మీరు సులభంగా గెలవవచ్చు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ప్రాక్టీస్ చేయండి." అని చెప్పాడు సతీశ్.
       కబడ్డీ ఆట మొదలైంది. రాజేంద్ర కూతకు వెళ్ళిన ప్రతీసారీ అందరూ ఒక్కటై రాజేంద్రను గట్టిగా పట్టుకొని ఔట్ చేయసాగారు. రాజేంద్ర ఆశ్చర్యపోతున్నాడు. కానీ రాజేంద్ర టీంలో మిగతా వారు కలిసికట్టుగా ఆడుతూ మంజునాథ టీంకు గట్టి పోటీని ఇచ్చారు. రాజేంద్ర ఇలా రాగానే అలా ఔట్ చేసి కూర్చోబెడుతున్నారు. ఆరోజు ఆటలో రాజేంద్ర తప్ప రెండు టీంలలో మిగతా వారంతా నువ్వా నేనా అన్నట్లు పరాక్రమం చూపించారు. చివరికి రాజేంద్ర టీం విజయం సాధించింది. అయినా రాజేంద్రకు తృప్తి లేదు. చాలా అవమానకరంగా భావించాడు. సతీశ్ తాను ఉన్న రాజేంద్ర టీంను కూడా వారం రోజులు బాగా ప్రోత్సహించాడు. "రాజేంద్రపై మనం ఆధారపడటం వల్ల అతడు మనల్ని చీమకన్నా హీనంగా చూస్తున్నాడు. మనం అందరం బాగా ప్రాక్టీస్ చేద్దాం. రాజేంద్రపై ఆధారపడకుండా మనం కలిసి కట్టుగా విజయం సాధించాలి. మనం సమష్టిగా పోరాడుదాం." అన్నాడు. సతీశ్ పుణ్యమా అని రాజేంద్ర టీం సమష్టిగా పోరాడి విజయం సాధించారు. రాజేంద్ర అందరికీ క్షమాపణ చెప్పి, కృతజ్ఞతలు చెప్పాడు. ఎవరినీ హేళన చేయడం లేదు. ‌‌ ‌‌  

కామెంట్‌లు