పేరులో ఏముంది?:- జగదీశ్ యామిజాల
 మద్రాసులో నాకొక మిత్రుడున్నాడు. అతని పేరు కర్ణన్. అతని అన్నయ్య పేరు రావణన్.
మీ అన్నదమ్ములిద్దరికీ బలే పేర్లు పెట్టారురా అని అంటే అవున్రా అన్నాడు. 
మా నాన్నగారు యామిజాల పద్మనాభ స్వామిగారు ఆంధ్రపత్రికలో వాల్మీకి రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాలకూ తెలుగులో తాత్పర్యం రాస్తున్న రోజులవి. అప్పుడు ఓమారు మా నాన్నగారికి గుంటూరు నించి ఓ ఉత్తరం వచ్చింది. ప్రసాదరాయ కులపతి గారి నించీ వచ్చిన ఉత్తరమనుకుంటాను. గుంటూరులో రామాయణంమీద అయిదు రోజుల సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు, ఆ సదస్సులో మీరు రావణాసురుడిపై ప్రసంగించాలని ఆ ఉత్తర సారాంశం. ఈ విషయం మా నాన్నగారు మా అమ్మతో చెప్పి ఇదేమిటే నాకీ అంశం ఇచ్చారని చిన్న నవ్వు నవ్వి అలాగేనని ప్రసాదరాయకులపతిగారికి లేఖ రాసారు. 
అప్పుడు మా నాన్నగారు రావణాసురుడి గురించి మా అమ్మకు చెప్పి శివతాండవ స్తోత్రం రాగయుక్తంగా చదివి అర్థం చెప్పడం గుర్తు. కానీ ఆ భావం నాకిప్పుడు గుర్తుకు రావడంలేదు
తన బల గర్వంతో కైలాస పర్వతాన్ని తన ఇరవై బాహువులతో పెకిలిస్తున్న సందర్భంలో శివుడు ఉగ్రరూపం దాల్చాడు. అప్పుడు శివుడిని శాంతింప చేయడానికి రావణాసురుడు శివుణ్ణి స్తుతిస్తూ  శివస్తోత్రం పఠిస్తాడు.
"జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం...." ఇలా శబ్దాలంకారాలతో సాగుతుందా స్తోత్రం.
డమరుకం నుండి డమ డమ శబ్దాలు రాగా ఆనంద తాండవం చేసే పరమేశ్వరుడే మనందరికీ సమస్త శుభాలూ కలిగిస్తాడన్న రావణాసురుడు గొప్ప శివభక్తుడు. ఈ శివతాండవ స్తోత్రం మొత్తం పదమూడు శ్లోకాలు. ఈ ఉదంతాన్ని చెప్తూ రావణాసురుడు సీతను లంకకు తీసుకుపోకుంటే రామాయణమెక్కడిదిరా అన్నారు. నాకిప్పటికీ ఈ శివస్తోత్రం వింటుంటే హృదయాన్ని కదిలిస్తుంది. 
అలాగే శ్రీరాముడి తల్లి కౌసల్య గురించి రామకృష్ణప్రభకు వ్యాసం రాయడమే కాక ఆలిండియా రేడియో మద్రాసు బి కేంద్రానికి కౌసల్యపై ఏకపాత్రాభినయం రాయగా మేము అక్కయ్యా అని పిలుచుకునే  కూచిపూడి నాట్యకళాకారిణి కొత్తపల్లి పద్మగారు ఆ స్క్రిప్ట్ చదవడం బాగా గుర్తు. 
ఇలా మన పురాణాలలో కొన్ని పాత్రల గురించి మా నాన్నగారు వ్యాసాలు రాయడం ఎరుగుదును. 
రేణుకతో పెళ్ళయ్యాక నేను  హైదరాబాదులో ఉంటున్న రోజులవి. మా అబ్బాయి పుట్టాడు. వాడికేదన్నా పేరు చెప్పమని మద్రాసులో మా నాన్నగారికి ఉత్తరం రాసాను.  నేను కొన్ని షరతులుకూడా పెట్టాను. మూడు అక్షరాలు మించకూడదని, ఆ పేరు విడగొట్టి పలకకూడని వీల్లేకుండా ఉండాలని, మన మధ్య ఎక్కడా ఎవరికీ ఆ పేరు ఉండకూడదని మనసులోని మాటను చెప్పాను. 
ఆ సమయంలో మా నాన్నగారు మహాభారతాన్ని వచనంలో రాస్తున్నారు. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. అంతేకాదు, మా ఇంట ల్యాండ్ ఫోన్ కూడా లేదు. కనుక నేను రాసిన ఉత్తరానికి మూడో రోజుకల్లా మా నాన్న  గారి దగ్గరనుంచి ప్రత్యుత్తరం వచ్చింది.
నీ షరతులన్నీ దకష్టిలో పెట్టుకునే ఈ పేరు మీ అబ్బాయికి పెట్టుకోవచ్చని చెప్తూ "సాత్యకి" అనే పేరు సూచించారు. బాగుందని ఆ పేరే మా అబ్బాయికి పెట్టాను. కానీ అప్పటికే ఈ పేరు మరొకరికి ఉన్నట్టు తెలిసింది. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారి అబ్బాయిలలో ఒకరి పేరు సాత్యకి. కానీ ఇంకెక్కడా ఈ పేరు వినలేదు. ఇంతకూ సాత్యకి అంటే తెలుసుకోవడం కోసం భారతం తిరగేశాను. భగవద్గీతలో సాత్యకి పేరు కనిపిస్తుంది. మా అబ్బాయికి నామకరణమైతే చేసేసాం సాత్యకి అని. కానీ ఓ జర్నలిస్టు మిత్రుడు ఇదేంటండీ జానకిలా అమ్మాయి పేరు పెట్టారేమిటీ అన్నాడు. అప్పుడు నేను సాత్యకి అంటే ఏమిటో అతనికి విడమరిచి చెప్పాను. భారతంలోని ఓ పాత్ర అన్నాను. ఓహో అలాగా అన్నాడు. కానీ ఈ పేరుని అర్థంకాక మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వాడిని సత్య అని పిలుస్తుంటే కోపమొస్తుంది. ఏం చెయ్యగలను. విని ఊరుకోవడం తప్ప ఏమనగలను. 
సాత్యకినే యుయూధనుడు అని కూడా అంటారు. కృష్ణునికి చెందిన వృషణి యాదవ వంశానికి చెందిన మహా యోధుడే సాత్యకి. సాత్యకి కృష్ణుని భక్తుడు.  అర్జునునితో కలిసి సాత్యకి ద్రోణాచార్యుడి దగ్గర యుద్ధ విద్యలు అభ్యసిస్తాడు.  అర్జునుడు, సాత్యకి మంచి మిత్రులు.  కురుక్షేత్ర సంగ్రామంలో ఇతను పాండవులతో కలసి కౌరవులపై యుద్ధం చేసాడు.  హస్తినాపురానికి రాయబారంకోసం కృష్ణుడి వెంట సాత్యకికూడా వెళ్ళాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పద్నాలుగో రోజున  అలసిన సాత్యకిని సంహరించడానికి భూరిశ్రవుడు తన ఖడ్గాన్ని పైకెత్తినప్పుడు అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుడి చేయి ఖండించి సాత్యకి ప్రాణాలు కాపాడాడు. అనంతరం
సాత్యకి భూరిశ్రవుడి తల ఖండిస్తాడు.
చివరికి యుద్ధములో సాత్యకి, మిగిలిన యాదవ వంశం యావత్తూ గాంధారి శాపంతో నాశనమైపోతుంది. మా అబ్బాయి పేరుతో ఇలా భారతంలో సాత్యకి ప్రస్తావన అంతా చదివాను.
ఇందుకు నాన్నగారికి నమస్సులు. 


కామెంట్‌లు