ఆహారజ్ఞానం ..!!---శీరంశెట్టి కాంతారావు > రచయిత>పాల్వంచ*

 పొచ్చెరలో జరిగిన అనుభవమే
కుంటాలలోనూఎదురవ్వడంతో
నిరాశకులోనైన మిత్రుల్లో
ముగ్గురు నీళ్ళదాకా పోలేనిదానికి ఎందుకంత కష్టపడి అన్ని మెట్లు దిగి ఎక్కాల అంటూ పైనే ఆగిపోయారు
ఇద్దరం మాత్రం ఎలాగూ ఇంతదూరమొచ్చాం కదా మెల్లగా వెళ్ళొద్దమని కిందకి దిగాము
తీరా దిగిన తరువాత 
ఏమాత్రం భద్రత పాటించని  సందర్శకుల సందోహం
చేతుల్లో ఏది కనబడ్డా దాడికి తెగబడుతున్న వానర సమూహం
తిని పడేస్తున్న చెత్తాచెదారం
మమ్ముల్ని అసహనానికి గురిచేస్తుంటే 
మెల్లగా వెనుదిరిగాము 
నేనొకటి గమనించా
మేమక్కడికిరాక ముందునుండే
చుట్టపక్కల ఆదీవాసీ గుంపుల్లోనుండి ఎంతో మంది పురుషులు సన్నటి పొడవైన వెదురుకర్రల్తో తయారు చేసిన గాలాల కట్టల్ని భుజాలమీద పెట్టుకుని
మూతులకు మాస్కులెట్టుకుని 
చీమలబారులా కిందికి దిగుతూ
జలపాతాన్ని బంధించిన ఇనుప జాలీకి ఆవలగా 
వెళిపోతున్నారు
అంతమంది గిరిజనులు ఒకేసారి గాలాలు తీసుకుని వేటకు పోవడంలో ఏదైనా విషయముందా అన్న సందేహం నామెదడును తొలుస్తుంటే ఆగలేక మాపక్కనుండే వెళుతున్న ఓపెద్దమనిషినాపి
రోజూ ఇంతమంది  గాలాల్తో చేపలు పట్టి అమ్ముతుంటారా!? ప్రశ్నించాను
లేదు లేదు
రేపట్నుంచి శావనం గదా? అన్నాడు  
తెలుగుమాసాల స్ప్రుహలేని నేను
అయితే!? 
అన్నాను ఆశ్చర్యంగా
శావనమంతా మేం నీసుదినం అందుకే ఆశాడం ఆకర్రోజని  ఇట్లపోతున్నం 
బదులిచ్చాడు 
ఆ సమాధానం విన్న నేను
ఏకాలానికి ఏదితినాలో ఏది తినగూడదో స్పష్టంగా
ఎరిగిన ఆదివాసీల విషయ పరిజ్ఞానానికి విస్తుబోతూ
చిత్తరువులా నిల్చిపోయిన
నన్ను  నిశ్శబ్దంగా దాటుకుని
కిందికి వెళ్ళిపోయాడా వృద్ధుడు
మనమంతా ఆహారజ్ఞానం అలవర్చుకోవాలని ఆశిస్తూ న్నాను.

కామెంట్‌లు