గోండ్వానా గాంధారీ ఖిల్లా ..!!శీరంశెట్టి కాంతారావు > రచయిత గాంధారీఖిల్లా 
ఈపేరువింటేనే 
గుండె ఔతుంది ఖుల్లా 
గోండ్వానా రాజ్యాన్ని 
గురించి వినడమేగాని
దాని ఆనవాళ్ళను కనడం మాత్రం ఇప్పుడే!
ఏంచెప్పాలి దానందం
ఎటుచూసినా వందల అడుగుల ఎత్తు ఎర్రకొండలు చూస్తూనే ఎవరికైనా కలుగుతాయి వాటిపట్ల అంతులేని మరులు
కొండపాదాల చెంతకు చేరగానే సింధూర వర్ణంలో 
భీకర శక్తిస్వరూపిణి 
వళ్ళు జలదరించేలా దర్శనమిస్తుంది
బిక్కు బిక్కు మంటూ ఆవిడను దాటుకుని కొంత ముందుకు వెళ్ళామో లేదో
శిథిలమైన కోటగోడలు
యుద్ధంలో నేలకొరిగిన క్షతగాత్రులను తలపించాయి
ఏరాజుల ఏరాణుల అధికారం ఏ అహంకార అగ్రవర్ణ దుర్నీతి జ్వాలల్లో ఎంత విషాదంగా ముగిసిందో
ఎందరు శ్రమజీవుల స్వేదం
ఎందరు యుద్ధ వీరుల రుధిరం  
కొండల్లో ధారలుకట్టి పారిందో!
ఆ రక్తం తాగిన కొండలు ఎరుపును పులుము కున్నాయేమో అన్పిస్తుంది
అక్కడక్కడా కూలిన బురుజులు విరిగిన శిల్పాలు జరిగిన దౌర్జన్యానికి మౌన సాక్షాలైనిల్చి తమలోతులు తెల్చుకొమ్మంటున్నట్టుగా అన్పిస్తుంటే మౌనంగా తలవంచుకు కొండలకే తొల్చిన మెట్లమీదుగా శిఖరాలకు చేరాం
అక్కడక్కడా కూలినగోడలు
నీరింకని బావులు,కొలన్లు
గోండ్వానా రాజ్యవైభవ ప్రతీకలై చరిత్రపాఠాలను బోధిస్తూ 
తిరిగి ఏదో ఒకనాడు 
అడవి బిడ్డలు గోండ్వానా రాజ్యాన్ని తప్పక స్థాపిస్తారన్న ఆశను వ్యక్తం చేస్తున్నాయి
కామెంట్‌లు