యాత్రానందం ...!! >బి.రామకృష్ణారెడ్డి -సఫిల్ గూడా >సికింద్రాబాద్

 ప్రయాణంలో పదనిసలు...
          సాధారణంగా మనలో చాలా మంది    తమ తమ కుటుంబ సభ్యులతో, అలాగే స్నేహితులతో కలసి  విహార యాత్రల పేరుతో కొన్ని కొన్ని కొత్త ప్రదేశాలు  సందర్శిస్తూ ఉంటాము..  వారు ఎన్నుకున్న ప్రదేశాలు... వారివారి అభిరుచులను బట్టి తీర్థయాత్రలు,
చారిత్రాత్మక ప్రత్యేకతలు ఉన్న ప్రదేశాలు,  విజ్ఞానభరిత విశేషాలు  ఉన్న ప్రదేశాలు కావచ్చు. జిహ్వకోరుచి బుర్రకో ఆలోచన... అను చందాన కొందరు సాహసోపేతమైన పర్వతారోహణ, జలాంతర్గామిలో ప్రయాణము మరియు తాత్కాలిక నివాసానికి ఇష్టపడుతుంటారు.
      ముందుగానే ప్రణాళిక చేసుకొని మన కుటుంబ సభ్యులు, స్నేహితులే కాకుండా కొత్తవారిని కలుపుకుని విహరించడం ఇరువురికి ప్రయోజనకరం .దానివలన ఆ విహారయాత్రలో మనము విహరించిన ప్రదేశాల యొక్క విశేషాలను పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా, వారి వారి కుటుంబ సభ్యులతో ,స్నేహితులతో  పరిచయాలు ఏర్పడి ఇరువురి మధ్య సత్సంబంధాలు కొనసాగే అవకాశం కలుగుతుంది .  ఈ సందర్భంగా నాకు చిరకాలం గుర్తుండిపోయేవిధంగా, ఉల్లాసంగా , మరియు ఉత్కంఠభరితంగా సాగిన విహార యాత్ర ఒకటి గుర్తుకు వచ్చి దానికి  అక్షర రూపం ఇవ్వటం జరిగింది .
     1998వ సంవత్సరంలో నాతో పాటే రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నా స్నేహితుడు.. స్వర్గీయ జగజ్జీవన్ రావు గారి ఆధ్వర్యంలో  "చార్ ధామ్ యాత్ర"  పేరుతో పదిరోజుల టూర్ ప్రోగ్రాం వేసాము. అంతకు పూర్వం మేము ఎప్పుడూ చిన్న చిన్న టూర్లు అంటే..రెండు మూడు రోజులలో పూర్తి అయ్యేటట్లుగా... తిరుపతి,  శిరిడి ,  శ్రీశైలం, విశాఖపట్నం , అలాగే వాటి చుట్టు ప్రక్కల 
ఉన్న ప్రదేశాలను మాకు అనుకూలమైన నాలుగు కుటుంబాలతో కలిసి తిరిగేవాళ్ళం. ఏదైనా ఒక పెద్ద టూర్ వెళ్లి రావాలనే సంకల్పంతో ఈ నాలుగు కుటుంబాలతో పాటు మరి కొందరు కొత్త సభ్యులను కలుపుకొని  సుమారు 30 మందిమి   ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకు మూడు నెలల ముందుగానే ప్రణాళిక రచించాము. ఈ యాత్రలో కలిసొచ్చే ప్రదేశాలు ముఖ్యంగా.... గంగోత్రి ,యమునోత్రి ,బద్రీనాథ్, మరియు కేదార్నాథ్ .వీటితో పాటు మార్గమధ్యంలో రిషికేశ్ ,హరిద్వార్ .అలాగే గంగానది పుట్టిన ప్రదేశము నుండి హరిద్వార్ వరకు గల మిగిలిన ఉపనదులతో కలిసిన నదీ సంగమాలు .
    ముందుగా అనుకున్నట్లే 1998 ఏప్రిల్ నెలలో సికింద్రాబాద్ నుండి ఏపీ ఎక్స్ప్రెస్ లో (ఈనాటి తెలంగాణ ఎక్స్ప్రెస్)26 గంటల ప్రయాణం చేసి ఢిల్లీ చేరుకున్నాము. ఢిల్లీ నుండి బస్సులో రోడ్ మార్గం ద్వారా మిగిలిన టూర్ యొక్క ప్రణాళిక. "ఫణికర్ టూర్స్ అండ్ ట్రావెల్స్" అనే ప్రైవేటు సంస్థ ద్వారా  వ్యక్తికి 2700 రూపాయల ప్యాకేజీతో ముందుగానే సంప్రదింపులు జరిగాయి. అనుకున్నట్లుగానే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి బస్సు ఏర్పాటు చేయడం, వారు కల్పించిన తాత్కాలిక విడిదిలో కాలకృత్యాలు అయిన తర్వాత ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ పూర్తిచేసుకుని ,రాత్రికి బస్సులో ప్రయాణం చేసి ఉదయం రిషికేశ్ చేరుకున్నాము. అక్కడి సందర్శనం అయిన  తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే హిమాలయ పర్వత అందాలను, ఆ అంచుల నుండి జాలువారుతున్న గంగానదీ ప్రవాహాలను, అక్కడక్కడ  విసిరేసినట్టుగా ఉండే  కుగ్రామాలను,  భోజనాల సమయంలో ఆయా గ్రామ ప్రజల జీవన విధానాన్ని తెలుసుకుంటూ రాత్రికి బదరీనాథ్ చేరాలి.. అనే ఆలోచనతో ఉన్నాము .
     రిషికేశ్ నుండి బద్రీనాథ్ వెళ్లే దారిలో మేము ప్రయాణిస్తున్న బస్సు సాంకేతిక లోపంతో  దాదాపు రెండు గంటలు ఆగిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో    రోడ్డు పక్కనే ఉన్న రెండు కుటుంబాల వ్యక్తులతో మాటలు కలిపి వారి స్థితిగతులను విచారించే క్రమములో  మేము గమనించిన విషయం....వీరు  నివసిస్తున్న ప్రాంతము కొండ దిగువగా ఉంది. ఆ దగ్గరలోనే ఒక సెలయేరు ప్రవహిస్తోంది. ఆ నీటిని వారు ఒక వెడల్పాటి గొట్టము లోనికి వచ్చేటట్లు ఏర్పాటుచేసి, గొట్టపు రెండవ మార్గాన్ని కిందకు వంచి సన్నగా అమర్చారు. ఈ సన్నని గొట్టం ద్వారా నీరు ఒత్తిడితో బయటకు వస్తూంది .ఆ నీటి ధారను పట్టీల తో కూడిన నూలు వడికే రాట్నం లాంటి పరికరం మీద పడేటట్లు ఏర్పాటు చేశారు. ఆ నీటి ప్రవాహంతో ఆ చక్రము గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే చక్రానికి ఒక బెల్ట్ ఏర్పాటు చేసి ఒక పిండి గిర్నీకి అనుసంధానం చేయడం ద్వారా విద్యుత్  అవసరం లేకుండానే పిండి గిర్నీ పనిచేస్తుంది.  వారికి కావలసిన విద్యుత్ దీపాలు కూడా ఆ నీటి ప్రవాహానికి అమర్చిన మరోయంత్రము ద్వారా ఉత్పత్తి అవుతుంది. అలా వారు ప్రకృతి వనరులతో విద్యుత్తును ఉత్పత్తి చేసి వాడుకొనేవిధానం.. మన పూర్వీకుల యొక్క విజ్ఞానానికి నిదర్శనం!
               తర్వాత బద్రీనాథ్ చేరుకొని ,రాత్రి విశ్రాంతి అనంతరం ఉదయాన్నే ఉష్ణ కుండ్ లో స్నానాలు ,బద్రి నారాయణ ఆలయ దర్శనం, అక్కడ నుండి చైనా బార్డర్ లో నున్న  బ్రహ్మకపాళం, ఉత్తరకాశి ,అలాగే మరికొన్ని పౌరాణిక విశేషాలున్న ప్రదేశాలను సందర్శించి ,రాత్రి విడుది తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కేదార్నాథ్ కి ప్రయాణమయ్యాము. ఈ ప్రయాణం అంతా ఒక ఇరుకైన మార్గం ద్వారా  ఒకవైపున సుద్ధమట్టి మరియు ఐస్ గడ్డలతో కూడిన కొండచరియలు, మరో ప్రక్క ఎంతో క్రింద ప్రవహిస్తున్న గంగానదీ ప్రవాహం. అంతకు 30 నిమిషాల ముందు ఈ మార్గంలో ప్రయాణిస్తున్న ఒక మినీ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయిందని, ఆ ప్రయాణికులను రక్షించే క్రమములో అక్కడ ట్రాఫిక్ జామ్ అవటం జరిగింది. విచారిస్తే ఆ నదిలో పడి పోయిన 17 మంది ప్రయాణికులు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయారని మిగిలిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఈ సంఘటన చూసిన తర్వాత మాలో కొందరు ప్రయాణికులు భయాందోళనకు గురై అక్కడే లగేజీ తో పాటు దిగిపోయి, తిరుగు ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయవలసిందిగా మా టూర్ ఆర్గనైజర్ కి చెప్పడం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు అక్కడ సేద తీరిన తర్వాత వారికి ధైర్యం చెప్పి ముందుకు సాగాము. బద్రీనాథ్ నుండి సుదీర్ఘ ప్రయాణం కావున మార్గమధ్యంలో రుద్రప్రయాగ, కర్ణ ప్రయాగ, అలకానంద, మందాకిని అనే ఉపనదులు గంగా నదిలో కలిసే సంగమ ప్రదేశాలు, సందర్శిస్తూ...శ్రీనగర్ అనే ప్రదేశంలో రాత్రి విశ్రాంతి తీసుకుని  మరుసటి రోజు ఉదయానికి గంగానది ఒడ్డున ఉన్న గౌరీ కుండ్ అనే ప్రాంతానికి  చేరుకున్నాము . అక్కడనుండి కేదార్నాథ్ ఆలయం 16 కిలోమీటర్ల దూరములో, సముద్రమట్టానికి దాదాపు 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ నుండి ఏ వాహనాలు పైకి వెళ్లవు. ఒక చిన్నపాటి  మట్టి మార్గమే ప్రయాణపు దారి. టూర్ గైడ్ యొక్క సలహా మేరకు మేమందరము లగేజీ  బస్సులోనే వదలి , మాకు ఒక రోజుకు కావలసిన సామాగ్రిని చిన్న బ్యాగులో సర్దుకుని గౌరీకుండ్ లో స్నానం చేసి నడక మార్గానికి చేరుకున్నాము. మాతోపాటు రావలసిన టూర్ గైడ్  ,ముందుకు నడవండి మీ వెనకనే నేను వస్తానని చెప్పి మమ్ములను పురమాయించాడు. మాలో నడవలేని పెద్ద వారు కొందరు డోలీలు, మరికొందరు పోనీలను (చిన్న గుఱ్ఱము) వారి ప్రయాణ సాధనాలుగా ఎంచుకొని ముందుకు సాగారు. నాతోటి ప్రయాణిస్తున్న జగజీవన్ రావు తన పాత మిత్రుల ద్వారా కనుగొన్న విషయం ...ఈ గుర్రాల పైన ప్రయాణము ప్రమాదకరం,  అవి గిట్టలకు మెత్తదనం కొరకు దారి అంచుల వెంట  నడుస్తూ ఉంటాయి, పట్టు తప్పి కింద ప్రవహిస్తున్న గంగా నదిలో పడి పోయే ప్రమాదం ఉంది, నడక మార్గమే ఉత్తమము..., తనతో పాటు నడవమని చెప్పటంతో   20 మందిమి నడకదారి ఎంచుకున్నాము.
     క్రమంగా పైకి వెళ్లే కొద్దీ మంచుతో కూడిన వర్షపు జల్లులు మొదలయ్యాయి . సాయంత్రమయ్యేసరికి రోడ్డు మార్గము కూడా మంచుతో కప్పబడడం, ఆ దారి తప్పించి మరో మార్గం ఎన్నుకోవడం, చలి అధికం కావడం ,తోటి ప్రయాణికులంతా విడిపోవడం ,ఇలా అనుకోని సంఘటనలు  ఒకదాని తర్వాత ఒకటి ఎదురయ్యాయి. ఎత్తైన ప్రాంతంలో ప్రయాణం చేయడం వలనేమో, మా అమ్మాయికి శ్వాస సరిగా అందక  బాధపడుతూ అలాగే కూర్చుండిపోయింది. మాతోపాటు మరో నలుగురు పిల్లలు, వారి తల్లిదండ్రులు ,మొత్తంగా పది మందిమి ఏమి చెయ్యాలో పాలుపోక అక్కడే ఆగిపోయాము. ఆ   ఆపత్కాలంలో ఆ కేదారేశ్వరుడు పంపించినట్లుగా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన కొందరు ప్రయాణికులు మా పరిస్థితి గమనించి "హర హర మహాదేవ "అని గట్టిగా కేకలు వేయడం జరిగింది. పదిహేను నిమిషాల తర్వాత మా ఎదురుగా నాలుగు పోనీలు( గుర్రాలు )వాటి యజమానులతో  కనిపించాయి.రుసుము మాట్లాడుకుని, ఆ గుర్రాల పైన పిల్లలను కూర్చోబెట్టి ,మేము వెనకాలే ప్రయాణం సాగించాము. అసలు విషయం.... కొండ క్రింది నుంచి బయలుదేరేటప్పుడు ప్రయాణికులు లేక మిగిలిపోయిన కొన్ని గుర్రాలను, మార్గమధ్యములో కొందరు ప్రయాణికులకు అవసరమవుతాయని అనుభవపూర్వకంగా తెలుసుకొని, ఈ ప్రయాణికుల వెనకాలే ఖాళీ గుర్రాలతో వాటి యజమానులు వస్తారని, ఇలాంటి ఇబ్బందులలో ఆదుకుంటారని తెలిసింది. 
       ఈ సంఘటనలో మేము ఆందోళనకు గురైన మరో విషయం... దాదాపు పది కిలోమీటర్లు పర్వత  మార్గంలో ప్రయాణ బడలికతో మా నడక ముందుకు  సాగుటలేదు .దీనికితోడు విద్యుత్ దీపాలు  లేని ఆ చీకటి మార్గంలో  మా పిల్లలను గుర్రాల పైన తీసుకెళుతున్న కూలీలు వారికి అలవాటైన మార్గము కావున ,మమ్ములను అనుసరించకుండా ముందుకు వెళ్లి పోయారు. అక్కడి వాతావరణానికి అనుకూలంగా  వారు ధరించిన దుస్తులు, మరియు మంకీక్యాప్ ల వెనక వారి ముఖాలు కూడా మాకు సరిగా కనిపించలేదు. మా నలుగురు పిల్లలు కూడా పది ,పదిహేను సంవత్సరాల మధ్య వయస్సు వారే. అందులో ఇద్దరూ ఆడపిల్లలు .వారిని ఎటు తీసుకెళ్లారో అర్థం కాక  మేము అటు ఇటు వెతుకుతూ, కేకలు వేయడంతో మా వెనకే వస్తున్న కొందరు కూలీలు విషయం తెలుసుకుని... మీరేమీ భయపడవద్దు, మీ పిల్లలని మా వారు ఆలయం దగ్గర్లో ఉండే విడిది దగ్గర క్షేమంగా చేరుస్తారు, మీరు అక్కడికి వెళ్లే వరకు వారు మీ పిల్లల దగ్గరే ఉంటారు.. అని ధైర్యం చెప్పారు. అలా భయపడుతూనే వారి వెంట మేము నడక సాగించాము. రాత్రి  8/ 8:30 ప్రాంతంలో మేము వారు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాము. ఆ కూలీలు చెప్పినట్లుగానే మా పిల్లల దగ్గరే ముందుగా వెళ్లిన కూలీలు ఉన్నారు. ఇదే ప్రాంతంలో మాకు టూర్ గైడ్ గా వచ్చిన వ్యక్తి, అలాగే మిగిలిన టూరుసభ్యులు తేనీరు త్రాగుతూ మమ్ములను ఆహ్వానించారు .అందరము కలిసి ఆలయ ప్రాంగణంలో మాకు కల్పించిన వసతి గృహంలో రాత్రికి బస చేశాము.
          ముందుగా అనుకున్నట్లు  ఉదయాన్నే  లేచి, స్నానాదులు ముగించుకొని, సూర్యోదయము స్పష్టంగా కనిపించే ప్రదేశానికి చేరుకున్నాం .ఆ తెల్లని మంచు కొండల మధ్య నుంచి కనిపించే సూర్యోదయదృశ్యము బంగారు వర్ణముతో నయనానందకరంగా ఉంటుంది .ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రికులకు కేదారేశ్వరుని దర్శనం ఎంత ముఖ్యమో, సూర్యోదయ దృశ్యం కూడా అంత ప్రాముఖ్యత గాంచినదని చెబుతారు. 
      తర్వాత 8 గంటల వరకు ,సూర్యరశ్మికి  మంచు కరిగేంతవరకు ఆ మంచు కొండల పైన పిల్లలతో విహరించి, కేదారేశ్వరుని ఆలయ దర్శనం మరియు అభిషేకము జరిపించి,  అక్కడికి దగ్గరలో ఉన్న  జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి  పీఠము ,వారు పరమపదించిన ప్రదేశము మరియు సమాధి దర్శించి తరించాము.   భోజనాలు అయిన తర్వాత రూములు ఖాళీ చేసి ,తిరుగు ప్రయాణం అయ్యాము. కొండపైకి వచ్చేటప్పుడు చేసిన తప్పు గుర్తుకు వచ్చి, తిరుగు ప్రయాణంలో పిల్లలతో పాటు మేము అందరము గుర్రాల పైన ప్రయాణించాము. మాతో పాటు వచ్చిన గుర్రాలు, వాటి యజమానులు , గౌరీకుండ్ దగ్గరలో ఆగిన మా బస్సు వరకు వచ్చి ,ఆ బస్సు బయలుదేరే  వరకు ఆగి,వాళ్లకు ఇవ్వవలసిన డబ్బులు తీసుకుని వెళ్లారు    
         ప్రత్యేకంగా ఇందులో ఆ కూలీల యొక్క నిజాయితీ, నిబద్ధత ,మరియు సహనాన్ని గురించి  ప్రస్తావించాలి... ముఖ్యంగా నడవలేని వాతావరణంలో,  అసహాయ స్థితిలో ఉన్న మా దగ్గరికి గుర్రాలతో రావటం, వాళ్లు ముందుగా వెళ్ళిపోయినా... మేము  వచ్చే వరకు ఆగి మా పిల్లలను మాకు అప్పగించడం, ముందు రోజు ఒక్క పైసా కూడా అడ్వాన్సు తీసుకోకుండా మరుసటి రోజు మేము చెప్పిన టైంకి రూమ్ దగ్గరికి వచ్చి మమ్ములను వెంట తీసుకెళ్లడం, బస్సులో ఎక్కేంతవరకూ ఆగి ,అంతా సర్దుబాటు అయిన తర్వాత వారికి ఇవ్వవలసిన రుసుము పుచ్చుకోవటం ... మొదలగు దృశ్యాలు ఇప్పటికీ  గుర్తుండి పోయాయి. తిరుగు ప్రయాణంలో  సాయంత్రానికి హరిద్వార్ చేరుకొని ,అక్కడ ఉండే దర్శనీయ స్థలాలు  సందర్శించి, సూర్యాస్త సమయంలో గంగా హారతి దర్శనం చేసుకొని ,ఆ రాత్రికి అక్కడ విశ్రమించాము. మరుసటి రోజు మధ్యాహ్నానికి ఢిల్లీ రైల్వేస్టేషన్ చేరుకొని, సాయంత్రం ఐదు గంటలకు ఏపీ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించి, అందరమూ మరుసటి రోజు సికింద్రాబాద్ కి  క్షేమంగా చేరాము.
    అలా.. ఆ విహార యాత్ర మొత్తము   ఆహ్లాదంగా, ఉల్లాసంగా, రమణీయంగా, ఉత్కంఠభరితంగా  మరియీ కొంత భయాందోళన మధ్య ముగిసింది .కానీ మేము నడయాడిన ఆ ప్రదేశాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి . పరిస్థితులు అనుకూలించి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇటువంటి విహారయాత్రలకు సరైన సమయం .అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో నేను 2018 సంవత్సరం వరకు  కొంతలోకొంత సఫలీకృతుడనయ్యానని  చెప్పుకోవచ్చు.
మరో విహారయాత్రకు పరిస్థితులు త్వరగా అనుకూలించాలని ఆశిస్తూ..... (వీలైనప్పుడు మరలా కలుద్దాం)
                          ***
కామెంట్‌లు