ద్వంద యుద్దం ..!! > శీరంశెట్టి కాంతారావు పాల్వంచ .

 మా ఊరి చెరువు బాయికి
ఎడమపక్క నున్న గొల్లబజారు దాటి కొంచం ముందుకు పోతే ఎరుకల బజారొస్తుంది
వాళ్ళంతా ఎప్పుడూ  ఈత మెల్లెల్తో తట్టలు బుట్టలు అల్లుకుంటు పందులు కాసుకుంటూ ఊరు కాసారంలో గండె చేపల్లా 
వాళ్ళ బతుకేదో వాళ్ళు 
బతి కేస్తుంటారు    
ఉండీ ఉండీ చెరువు నీటిలో  అలలు లేసినట్టు  ఆ బజారున ఏదో  ఓ గొడవ పుట్టుకొచ్చి ఊరినంతా కలి కలి చేసేది
ఆ ఏడు సంక్రాంతి  పండుగ నెలపట్టారు 
కొత్తపంటలన్నీ ఇండ్లకొచ్చి
రైతుల ఇండ్లన్నీ సందడిగా కనువిందు చేస్తున్నాయి
ఇంతలో...
ఎరుకల బజారున ఏదో ఉప్పలం పుట్టుకొచ్చింది
కుంచె బక్కయ్య పొరుగింటోళ్ళు పందుల్నమ్మిన పైసల్ని మసిగుడ్డలో చుట్టి పొయ్యి పక్కన  పొంతకుండకు ఇంటిగోడకూ సందున దోపారంట! నాలుగు రోజుల తరువాత పండుగ సరుకులు తెద్దామని చూస్తే పైసలు  గల్లంతయ్యాయి ఆ ఇంటోళ్ళకు ఎదకొచ్చిందోగాని బక్కయ్య మీద అనుమాన మొచ్చింది 
తనేమో నాకేపాపం తెలియదంటాడు
ఇద్దరి వాదనా గట్టిగానే వుండడంతో ఏంచేయాలో తోచని కులపెద్దలు ఇరుపక్కల్నుండి చెరి ఐదువేలు కులకట్టు ధరావత్తు కట్టించి
చెరువుబాయి పక్క మర్రి చెట్ల కింద పంచాయతీ పెట్టారు
మూడు రోజులు గడిచింది
తాగుడు కింద  ధరావత్తు సొమ్ము ఒడిసి పొయ్యిందిగాని పంచాయితీ మాత్రం పైస్లాకాలే
ఒకరు తీశారంటారు 
ఇంకొకరు తియ్యలేదంటారు
ఇట్లా లాభంలేదనుకున్న కులపెద్దలు బక్కయ్యతో
పైసలు తియ్యలేదని ప్రమాణం జేయ్యమన్నారు
బక్కయ్య భయంలేకుండా అందుకు సిద్ధమయ్యాడు
విషయం తెలిసిన ఊరి పెద్దలు
ఇరువర్గాలను కచ్చీరుకు పిలిపించి సర్దిచెప్పే ప్రయత్నంచేసినా అది బూడిదలో ఉచ్చ బుడ బుడా అన్నట్టే అయ్యిందితప్ప ఫలితం మాత్రం సున్నా..
దాంతో వాళ్ళు  ప్రమాణాలంటే మాత్రం ఊళ్ళో కాకుండా ఊరి బయట పొలిమేరలో పెట్టుకోండని తెగేసి చెప్పారు
కుల పెద్దలు వెంటనే గడ్డపార ప్రమాణంతో పాటు అది ఏరోజోగూడా అక్కడే ఖాయం చేశారు
అటువంటి ప్రమాణం ఎన్నడూ ఎరుగని ఊరంతా ఎరుకల వాడతోపాటు ఆరోజు పోలిమేర లోని చవుళ్ళ మీదికి చేరింది
కులపోళ్ళల్లో కొందరు రెండు గంపల్నిండా ఏరుపిడకలు ఏరుకొచ్చి కువ్వబోశారు
ఐదడుగుల గడ్డపారను అడ్డం పడేసి దానిమీద పిడకలు పేర్చి నిప్పంటించారు
గాలికి పిడకలు అంటుకుని మెల్లగా కాలడంమొదలెట్టాయి
చూస్తుండగానే గడ్డపార ఎర్రటి రుళ్ళకర్ర మాదిరి ఐపోయింది
ఇంతలో బక్కయ్య  ఉరిచివర ఆంజనేయుని గుడిబాయిలో స్నానం చేసి దేవునికి మొక్కుకుని తడిబట్టల్తోనే తరలొచ్చాడు
ఊరి వాళ్ళంతా ఉత్కంఠగా చూస్తుండగానే అక్కడున్న కులపెద్దలు గడ్డపారమీది పిడక నిప్పుల్ని పక్కకు జరిపి బక్కయ్య దిక్కు చూశారు
అతను వెంటనే పొద్దు దిక్కు తిరిగి చూస్తూ దండం పెట్టుకుని
ఒంగి నిప్పులమీది గడ్డపారను
కుడిచేత్తో చప్పున తీసి కుల పెద్దలకు చూపించి పక్కనేశాడు 
చిత్రంగాఅతని చేతికేమీకాలేదు ఇంతలో ఇంటోళ్ళొచ్చి గడ్డపార దూసిన అరచేతికి ఆముదం పామారు
ద్వంద యుద్దంలో గెలిచిన యోధుని మాదిరిగా కులపోళ్ళు తమ భుజాల పల్లాకిమీద బక్కయ్యను డప్పుల్తో ఊరేగించారు
ఇది నిజంగా.  
దేవుని సత్యమా!
సైన్స్ సూత్రమా!!
నాకిప్పటికీ తెలీదు!
                               ***
కామెంట్‌లు