చిత్రకారుడవాలనుకున్న హిట్లర్:-- యామిజాల జగదీశ్

 జర్మనీ నియంతగా ముద్రవేసుకున్న అడాల్ఫ్ హిట్లర్ మొదట్లో చిత్రకారుడు. హిట్లర్ తొలి రోజుల్లో చిత్రకారుడవాలనే కలలు కన్నాడు. అయితే అది నెరవేరలేదని చరిత్రపుటలు తిరగేస్తే తెలిసింది. కానీ యవ్వనప్రాయంలోనూ, సమయం దొరిగినప్పుడు హిట్లర్ బొమ్మలు గీయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. అతను తన జీవితకాలంలో రెండు వేలకుపైగా బొమ్మలు గీశాడు. 
అప్పుడప్పుడూ హిట్లర్ గీసిన బొమ్మలలో కొన్ని వేలం వేస్తుంటారు.హిట్లర్ సంతకంతో కూడిన బొమ్మలకు ప్రజల మధ్య విశేషమైన ఆదరణ ఉంది. ఈ క్రమంలోనే జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఓమారు పురాతన పెయింటింగ్స్ వేలం వేసే కేంద్రంలో హిట్లర్ గీసిన చిత్రాలంటూ ఓ మూడు వేలానికొచ్చాయి. అవి, నది, పర్వతం, చెట్టు. ఈ మూడు బొమ్మలలోనూ హిట్లర్ సంతకాలున్నాయి. ఆ సంతకాలను చేతిరాత నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి అవి హిట్లర్ సంతకాలే అని నిర్థారించారుకూడా.
అయితే ఆ మూడు చిత్రాలు నకిలీవని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బెర్లిన్ పోలీసులు దర్యాప్తు జరిపారు. సంతకమైతే హిట్లర్ దేనని, కానీ బొమ్మలు అతనిది కావని పోలీసులు తేల్చారు. 
మొదటి ప్రపంచయుద్ధానికి ముందు హిట్లర్ వియన్నాలో ఓ కూలీగా పని చేసాడు. అలాగే పోస్టుకార్డు సైజులో బొమ్మలు గీసేవాడు. వియన్నా ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో సీటు కోసం రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ తిరస్కృతికి గురయ్యాడు. ఐయినా బొమ్మలగీయడంపై హిట్లర్ తనకున్న మక్కువ వీడలేదు. ఒక్కొక్కప్పుడు రోజుకి మూడు బొమ్మలు గీసినట్టు తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. 
అధికారంలోకొచ్చాక హిట్లర్ తన పెయింటింగ్సుని సేకరించమని అధికారులను ఆదేశించి వాటి ఆచూకీ లేకుండా చెరిపించేసాడు. అప్పటికీ కొన్ని వందల పెయింటింగ్స్ అప్పుడప్పుడూ బయటపడుతున్నాయి. అలా దొరికిన వాటిని వేలం వేస్తుండటం జరుగుతోంది. నాజీ చిహ్నాలు లేని హిట్లర్ పెయింటింగ్సుని అమ్ముకోవచ్చని జర్మనీలో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసాక హిట్లర్ పెయింటింగ్స్ ఎన్నింటినో అమెరికా సైన్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే వాటిని ఎప్పుడూ ఎక్కడా ప్రదర్శనకు ఉంచలేదు. అయితే కొన్నింటిని ఇప్పటికీ అమెరికాలోని రెండవ ప్రపంచ యుద్ధం అంతర్జాతీయ మ్యూజియంలో చూడవచ్చు. 2014లో దక్షిణ జర్మనీలోని న్యురెంబెర్గ్ లో హిట్లర్ గీసిన ఓ వాటర్ కలర్ పెయింటింగుని ఒకరు లక్షా నలభై ఎనిమిది వేల డాలర్లకు కొనుగోలు చేసారు. 
యూదులపై ద్వేషాన్ని పెంచుకున్న హిట్లర్ ఫ్యామిలీ డాక్టర్ ఓ యూదు కావడం ఆశ్చర్యమే. కరడుగట్టిన నియంతగా పేరు పొందిన హిట్లర్ హృదయమూ మృదువైనదంటూ ఓ తమిళ పుస్తకం ఎప్పుడో చదివినట్టు గుర్తు. ఆ పుస్తకం పేరు గుర్తుకురావడం లేదు. అందులో హిట్లర్ ప్రేమవ్యవహారంకూడా ఉంది.

కామెంట్‌లు