"పురాణం" కలం బలం!!:-- యామిజాల జగదీశ్


 "నాకు బ్యాలెన్స్ లేదు. నేను బ్యాలెన్స్ డ్ రైటర్ని కాను. కవులందరికీ పన్నింగ్ అంటే వీక్నెస్సున్నట్లు నాకూ మాటల జగ్లరీ అంటే వీక్నెస్సుంది. నిజమైన రచన నిరాడంబ రంగా సూటిగా వుండాలంటారు ....నేను పాఠకుల్ని తప్పు పట్టను. రాయటంలో లోపాలుంటే అవి నావే....నేను ఫిలాసఫీతో రాజీపడను..." అని  చెప్పుకున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి  రచనలంటే నాకెంతో ఇష్టం.
ఆయన "పురాణం సీత" పేరిట రాసిన "ఇల్లాలి ముచ్చట్లు" నేను చదవడానికి కారకులు పాత్రికేయులు రాజేశ్వరిగారైతే రామడుగు రాధాకృష్ణగారివల్లే "మధురవాణి ఇంటర్వ్యూలు"  (ఊహాజనిత ఇంటర్వ్యూలు) చదివాను. అలాగే ఆయన రాసిన తెలుగు వెలుగు చలంకూడా చదివాను. ఇది మూడు సంపుటాలుగా వచ్చింది. చలంగారింట తీసిన గ్రూప్ ఫోటోలో నేనున్నది కూడా ఓ సంపుటంలో అచ్చయింది.
ఇటీవల రాధాకృష్ణగారబ్బాయి రఘుతో మాట్లాడినప్పుడు ఓ విషయం తెలిసింది. "మధురవాణి ఇంటర్వ్యూల పరంపర"లో పురాణంగారు "యండమూరి వీరేంద్రనాథ్" గారి గురించికూడా రాసినా, దానిని అచ్చుకివ్వలేదని! ఆ ఒరిజినల్ స్క్రిప్ట్ తన దగ్గరుండాలని, వెతికిస్తానని చెప్పారు.  పురాణంవారు ఏం రాశారో చదవాలనిపిం చి ఆ స్క్రిప్టు కోసం నాలుగైదుసార్లు ఫోన్ చేసి అడిగాను. చివరికి అదెక్కడో మిస్సయిపోయిందన్నాడు రఘు. బాధ వేసింది. 
"మధురవాణి ఇంటర్వ్యూలు" రాస్తున్న రోజుల్లో పురాణంగారికి రాధాకృష్ణగారు కొందరు ప్రముఖుల పుస్తకాలు ఇవ్వడం, అలాగే పురాణం వారు తాము రాసిన స్క్రిప్టులను పత్రికకు పంపించే ముందు రాధాకృష్ణగారికి చూపించడం జరుగుతుండేది. 
పురాణంగారు యండమూరిగారిపై రాసిన  విషయం గురించి తెలుసుకోవాలనిపించి పురాణం వారి కుమారుడు, కథకుడు, పాత్రికేయుడు అయిన శ్రీనివాస శాస్త్రి (శ్రీశా) గారిని కలిసాను. కానీ ఈ ఉదంతం తనకేమీ తెలీదన్నారు శ్రీశాగారు!  యండమూరివారిపై రాసిందికూడా అచ్చయి ఉంటే బాగుండేదన్నారాయన.
"మిసిమి" మాసపత్రికలో ధారావాహికంగా వచ్చిన "పురాణం"వారి మధురవాణి ఇంటర్వ్యూలకు పాఠకుల నించి విశేష ఆదరణ లభించింది. ఈ ఊహాజనిత ఇంటర్వ్యూలు మిసిమి పత్రికకు, పురాణం వారికీ ఊహకందనంత ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. 
అసలీ శీర్షిక గమ్మత్తుగా ప్రారంభమై దంటారు అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డిగారు. 
ఒకానొకప్పుడు "శంకర్స్ వీక్లీ" అనే ఆంగ్ల వారపత్రికలో వ్యంగ్య ధోరణిలో హాస్యపూరిత వ్యాఖ్యానాలు  వస్తుండేవి. అందులో తన వ్యంగ్య చిత్రాన్ని, తనపై వ్యంగ్య వ్యాఖ్యలను చూసుకోవాలనుకుని ఉవ్విళ్ళూరే వారట జవాహర్ లాల్ నెహ్రూగారుకూడా. ఆ పత్రికలో వచ్చిన ఇమాజినరీ ఇంటర్వ్యూలలాంటివి "మిసిమి"లోనూ ప్రవేశపెడితే ఎలా ఉంటుందని అన్నపరెడ్డిగారు, ఆలపాటి రవీంద్రనాథ్ గారు ఆలోచించారు. కానీ తెలుగులో అలా రాయగలిగిన సమర్థులు ఎవరా అనే ప్రశ్న ఎదురైంది.  పురాణంగారైతే ఈ శీర్షికను బ్రహ్మాండంగా  నిర్వహించగలరనే నిర్ణయానికి వచ్చి పురాణంగారిని అడగడం, ఆయన సమ్మతించడం, ఆ శీర్షిక మొదలవడం అన్నీనూ చకచకా జరిగిపోయాయి. పాఠకలోకం నించి విశేష స్పందనా లభించింది. పురాణం గారు రాసిన ప్రతి ఇంటర్వ్యూనీ రవీంద్రనాథ్ గారు చిత్రిక పట్టేవారట. అక్కడక్కడా కళ్లాలు, పగ్గాలు వేసేవారట. పదాలు దిద్దేవారట. మార్పులూ చేర్పులూ సూచించేవారట. కానీ ఆశ్చర్యమేమిటంటే, పురాణంవారు వాటన్నింటినీ అంగీకరించడం.  పురాణం వారు గతించాక భమిడిపాటి రామగోపాలంగారు సంకలనకర్తగా పూనుకోవడంతో మధురవాణి ఇంటర్వ్యూలు పుస్తకరూపంలోకి వచ్చింది. 1997 మార్చి 23న రవీంద్రభారతి (హైదరాబాద్)లో జరిగిన రవీంద్రనాథ్ గారి ప్రథమ వర్థంతి సందర్భంలో ఈ పుస్తకాన్ని  ఆవిష్కరించారు. నిజానికి రవీంద్రనాథ్ గారి ప్రథమ వర్థంతి 1997 ఫిబ్రవరి 11న జరగవలసింది. కారణాంతరాల వలన అది 1997 మార్చి 23కు వాయిదా పడింది.
ఇలా ఉండగా, ఆలపాటివారి కుమారులకు పురాణంవారి రాసిన లేఖ ఒకటి "రవీంద్ర స్మృతి" అనే పుస్తకంలో చదివాను. ఇక్కడ కొంతభాగమే ఇచ్చాను. ఆలపాటి రవీంద్రనాథ్ గారు 1996 ఫిబ్రవరి 11న తుదిశ్వాస విడిచారు.
"శ్రీ ఆలపాటి రవీంద్రనాథ్ గారి కుమారులకుప్రేమపూర్వకంగా ఆశీర్వదించి ...నా గురుతుల్యులు, ప్రాణసమానులు అయిన చౌదరిగారి మరణం గురించి నిన్న సాయంత్రం టివిలో విని నిర్ఘాంత పోయాను. వారం పది రోజుల క్రితం వారు లిఫ్ట్ ఎక్కి మా యింటికి వచ్చి నాతో కబుర్లు చెబుతూ పుత్రశోకంలో వున్న వారు నన్ను ఓదారుస్తూ వడ్డాది పాపయ్య చిత్రాలు నానీ వద్ద వున్నవి చూస్తామని అన్నారు. అవి అన్నీ తను జాగ్రత్త చేసి మీకు యిస్తాను అన్నాను. అంతే – 
నన్ను "మధురవాణితో యన్. టి. ఆర్." రాస్తారా అని అడిగారు....స్వర్గంలో ఎన్ టి ఆర్ - మధురవాణి కలుసుకున్నట్లు రాసి పంపించాను...... నారాయణరెడ్డి (సినారె)ది కూడా రాస్తారా అని అంటే, బతికి వున్న వాళ్ళవి రాస్తే గొడవలు వస్తాయని మనం పాలసీగా రాయటం లేదు కదా అని గుర్తు చేశాను. చౌదరిగారు NTR తరవాత మరి నా టర్న్ వస్తుంది అంటే నేను వారించాను. మీ వంటి పెద్దలు అలా అనకూడదు –
అయినా జనన మరణాలు మన చేతిలో లేవు కదా అన్నాను. పెద్దవారం అయినా మనం స్వతంత్రంగా వుండాలి. కొడుకులు మనవాళ్ళయినా పెద్దయాక మనం వారిని ప్రేమగా చూడాలి. మనవలతో ఆడుకోవాలి గాని వారి వ్యవహారాలలో ఇంటర్ ఫియర్ కాకూడదు అని నాతో అన్నారు. చక్కగా నడిచేవారు. వాకింగ్ కి వెళ్ళేవారు. మెడికల్ చెకప్ చేయించుకునే వారు.......ఇలా సాగిందా ఉత్తరం. 
1967లో ఆంధ్రజ్యోతి వారపత్రిక నార్ల వెంకటేశ్వరరావుగారి సంపాదకత్వంలో ప్రారంభమైనా దీని బరువు బాధ్యతలన్నీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి మీదే వుండేవి. 1967లో ఉగాదినాడు ఆంధ్రజ్యోతి వీక్లీ ఆరంభమైంది. 
ఎవరైనా అడిగితేనే రాసే పురాణం గారికి పాత్రికేయులు జి. కృష్ణగారితో ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావిస్తూ శ్రీశా గారు  ఒకటి రెండు విషయాలు చెప్పారు. అరవై దాటిన పురాణంవారు ఓమారు కర్ర పట్టుకుని నడుస్తుంటే చూసి చేతికర్ర మానేసి మామూలుగా నడవండి అని సూచించారట. 
సాహిత్యానికి భిన్నంగా ఏదైనా ఆలోచించండని పురాణం వారు చెప్పి నప్పుడు కృష్ణగారు "టపా కథలు" రాసి పంపిస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు ప్రచురించేవారట. ఈ శీర్షికకూ మంచి ఆదరణకూడా లభించిందట. 
ఇక రావిశాస్త్రిగారి బాకీ కథలు ఎలా పుట్టాయో కూడా శ్రీశాగారు చెప్పారు. కొన్నిసార్లు పురాణంగారు  యాజమాన్యంతో మాట్లాడి ముందుగానే రచయితలకు డబ్బులు ఇప్పించేవారట. అలా రావి శాస్త్రిగారికి ఇంకా రాయకముందే డబ్బులు ఇస్తుండటంతో "మీకు బాకీ పడ్డానయ్యా" అంటూ ఆయన కథలు రాసిచ్చేవారట.
మిరియాల రామకృష్ణ గారు శ్రీశ్రీ సాహిత్యం మీద పరిశోధన చేసి రాసిన థీసిస్‌ని అచ్చువేశారు. అది ఆంధ్రజ్యోతి వీక్లీకి సమీక్షార్థం వచ్చినప్పుడు, పురాణం దానిని చదివారు. అది ఆయనకు అంతగా నచ్చలేదు. మహాప్రస్థానంలోనూ ఇతరత్రా రచనలలోనూ శ్రీశ్రీ వాడిన పదజాలానికి మిరియాలవారు విపరీత భాష్యాలు చెప్పారనిపించి ‘శ్రీశ్రీకి మిరియాల కషాయం’ పేరుతో కొన్ని వారాల పాటు పురాణం వారు ధారావాహికంగా విమర్శిం చారు.  
ఉదయం వీక్లీకి సంపాదకులుగా ఉన్నరోజుల్లో  పురాణంవారు ఓ వారం ఆధునికత్రయం అనే రైటప్ తో మా  ఇద్దరు ప్రముఖులతో మా నాన్న యామిజాల పద్మనాభస్వామిగారున్న ఫోటో ఒకటి ప్రచురించడం బాగా గుర్తు నాకు. 
ప్రముఖ రచయితలతో పురాణంగారు తీయించుకున్న ఫోటోలుంటే చూడాలనిపించి ఫోటో ఆల్బం ఉందాని అడిగితే  శ్రీశాగారు "చంద్రునికో నూలుపోగు" అనే పేరిట తమ తండ్రిగారిపై వెలువడిన ఓ సంస్మరణ సంచికను ఇచ్చారు. మాజీ క్రికెటర్ జ్యోతిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ సంచిక వచ్చినట్టు చెప్పారు. ఈ సంచికలో పురాణంగారు, ప్రముఖులు కొందరితో తీయించుకున్న ఫోటోలున్నాయి. గొల్లపూడి మారుతీరావుగారు తదితరులు రాసిన వ్యాసాలున్నాయి. తన రచనాతీరు గురించి పురాణంగారు చెప్పుకున్న విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 
పురాణంవారు, గొల్లపూడి మారుతీరావుగారు, కొమ్మూరి వేణుగోపాలరావుగారు కలిసి గొలుసుకట్టుగా రాసిన "ఇడియట్" అనే నవల రాసారు. మధ్యతరగతి మందహాసానికి అద్దంపట్టే నవల ఇది. మొత్తం 288 పేజీల నవలలో మొదటి వంద పేజీలు పురాణంగారు రాయగా తర్వాతి 126 పేజీలూ గొల్లపూడి మారుతీరావుగారు రాశారు. ఇక చివరి 62 పేజీలూ కొమ్మూరీ వేణుగోపాలరావుగారు రాశారు. తెలుగు నవలా సాహిత్యంలో ఇలా ముగ్గురు ప్రముఖ రచయితలతో తొలిసారిగా ఓ గొలుసుకట్టు రచన వెలువడటం ఇదే తొలిసారి. గొల్లపూడివారు దీని గురించి రాస్తూ "ఓసారి నన్నూ, కొమ్మూరినీ పురికొల్పి నవల రాద్దామన్నారు. ఆయనే (పురాణం) మొదలెట్టారు. ఏనాడూ కలిసి చర్చించలేదు. ఆయన వ్రాసి నాకు అందించాక నేను వ్రాశాను. అలాంటి ప్రయోగం ఆ తర్వాత ముందూ ఎవరయినా చేశారేమో తెలీదు. నాకు మొదటి ప్రశంస దాశరథిగారి దగ్గర్నుంచి వచ్చింది...." అన్నారు. 
పురాణం గారి "ఇల్లాలి ముచ్చట్లు" మారుతీరావు గారు చెప్పినట్లు ఓ  అపూర్వమైన  ప్రక్రియ. మధ్యతరగతి జీవితంలోని మాధుర్యమంతా ఈ ముచ్చట్లలో కనిపిస్తుంది చదువుతుంటే. 
రచయితగా వ్యాసకర్తగా సంపాదకుడిగా గణనీయమైన ఘనత సాధించిన పురాణం వారిని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తగు రీతిన సత్కరించకపోవడం విచారకరమే. అయితేనేం, పురాణం సీతగా ఆయన రాసిన వ్యాసపరంపర తెలుగు పాఠకుల మదిలో ధృవతారగా నిలుస్తుందన్న ఏడిద గోపాలరావుగారి అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవిస్తారన డంలో సందేహం లేదు. 
"నాకెవరిమీదా ద్వేషమూ కసీ లేవు. అలా రాసినట్లు కనిపిస్తే అది నాకు సరిగా రాయటం చాతకాక పోవటం వలన ఏర్పడిన దౌర్భాగ్యం కావచ్చు...." అని చెప్పుకున్న పురాణంగారు "ఎంత జాగ్రత్తగా రాసినా ఎప్పుడో ఒకప్పుడు మన రచనలు ఒకే రకంగా ఒకే బాణిలో వుండి విసుగు పుట్టిస్తాయి. విసుగు పుట్టించే దాకా రాయకూడదు. అప్పుడు మానెయ్యటం అందరి ఆరోగ్యానికి మంచిది. చాలా మంది మాన్లేరు.... ఎప్పుడైనా నాకు విముక్తి లభిస్తే నేనీ వ్యాసాలు మానేసే రోజు వస్తే అప్పుడు చివరి వ్యాసం ఎలా రాయాలా అని ఆలోచిస్తూ వుంటాను. రాస్తే నా చివరి వ్యాసానికి శ్వాన్ సాంగ్ (హంసగీతం) అని పేరు పెట్టుకుంటాను, నేను హంసను కాకపోయినా" అని చెప్పుకున్నారు పురాణంవారు. ఓ రచయిత పాఠకులకు విసుగు పుట్టించే దాకా రాయకూడదు అన్నది ఎంతో నిజం. 
మాటల మధ్యలో శ్రీశాగారు "కోకిలమ్" అనే తమ యూట్యూబ్ ఛానెల్ గురించి చెప్పుకొచ్చారు. గత ఏడాది విజయదశమి రోజున ప్రారంభమైన" కోకిలమ్ " తరఫున ప్రసారమవుతున్న వీడియో కథనాల సిరీస్ కి  స్క్రిప్టంతా శ్రీశాగారిదైతే, వాటికి తగిన విజువల్స్ చూపిస్తూ వాయిస్ వోవర్  శ్రీశాగారి కుమారుడు శివరామ్ సమకూరుస్తున్నారు. ప్రముఖ చిత్రకారుడు బాలి గారు గీసిన చిత్రాలతో రూపొందించిన వీడియోను చూపించారు. బాలి గీసిన చిత్రాలతో రూపొందించిన ఈ వీడియో చాలా బాగుంది. 
శ్రీశాగారింట గడిపిన గంటన్నరా హాయిగా సాగింది. తనికెళ్ళ భరణి, తల్లావజ్ఝల శివాజీ తదితర మిత్రులతో తనకున్న సాన్నిహిత్యాన్ని చెప్పిన శ్రీశాగారు మూడు దశాబ్దాలపాటు డెక్కన్ క్రానికల్ గ్రూప్ లో పని చేసారు. మా నాన్నగారు (యామిజాల పద్మనాభస్వామిగారు) రాసిన ఆషాఢపట్టి కథ ఎందులోనో ఎక్కడో చదివానన్నారు. ఈ కథ మా నాన్నగారు రాసారన్నది నేనిప్పుడే వింటున్నాను. 
మధ్యలో రెండుసార్లు మంచి కాఫీ ఇచ్చిన శ్రీశాగారి శ్రీమతికి థాంక్స్ చెప్పకుంటే ఏం బాగుంటుంది?! 
కామెంట్‌లు