ముర్రేడు ముచ్చట ..!!:- శీరంశెట్టి కాంతారావు -పాల్వంచ *

 చాలా రోజులుగా మా ఎడ్వకేట్ మిత్రుని వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాలని  అనుకుంటున్నాము
ఆయనే ఓరోజు వెళ్దాం రమ్మంటూ హఠాత్తుగా ఫోన్జేశాడు 
ముప్పావు గంటలో కారు  వ్యవసాయ క్షేత్రాని కెళ్ళే కాలిబాట ముందాగింది
కారు దిగానే ఎదురుగా ప్రాథమిక పాఠశాల స్థాయి చిన్నారులంత  లేత జీలుగు మొక్కల చేను గుబురుగా విశాలంగా కళకళ్ళాడుతూ సాదర స్వాగతం పలికింది
ఆ అనూహ్య స్వాగతానికి ముగ్దులమైపోతూ కొంతసేపు వాటితో ఆడుకున్న తర్వాత మెలమెల్లగా మిత్రుల వెంట
ఎదురుగా వున్న ముర్రేడులో
పాదం మోపాము
బూరుగుదూదిలాంటి ఇసుక మా అరికాళ్ళను మెత్తగా హత్తకుంటుంటే ఆమెత్తదనానికి గమ్మత్తుగా చిత్తైపోతూ 
ఏరు దరుల పొడవునా ఆకుపచ్చ చైనా కుడ్యంలా అద్భుతంగా పెరిగివున్న అడవిచెట్లు ముచ్చటగా తలలూపుతూ
రా!రమ్మంటూ మమ్ముల్ని స్వాగతించడం చూస్తుంటే ఆనందంతో మా గుండెలు పులకలెత్తి పోయాయి
సైకత వేదిక స్పర్శాసుఖాన్ని అనుభవిస్తూ ముర్రేడు కిన్నెరసానుల సంగమ జలాలలో పసిపిల్లలమై పరుగులు తీశాము
కొంతసేపట్లా ఏటినీటిలో సేద దీరి కొత్తశక్తిని పుంజుకున్నాము
అక్కన్నుండి నది, అడవి అందాలను కలిపి చూస్తూ మెల మెల్లగా ఏటి ఇసుకలో నడుస్తూ నడుస్తూ వ్యవసాయ క్షేత్రం దగ్గర ఒడ్డెక్కాము
ఎదురుగా క్షేత్రంలోని పామ్ ఆయిల్ పడుచు చెట్లు స్వాతంత్ర్య దినోత్సవ కవాతు మైదానంలో ఏమూలనుండి చూసినా ఒకే వరుసలో కన్పించే ఆకుపచ్చ సిపాయిల్లా నిలబడి మమ్ముల్ని స్వాగతించాయి
అపూర్వమైన ఆ స్వాగతానికి పులకించిపోతూ గిలకలెత్తు పెరిగిన పాలగడ్డి తివాచీ మీద మెత్తగా మెల్లగా నడుస్తూ వాటి గౌరవవందనాన్ని స్వీకరిస్తూ క్షేత్రమంతా చుట్టి వచ్చాము
మరికొంతసేపు పచ్చదనపు పసరువాసనా సువాసనలను ఆస్వాదించి వెనుదిరుగు తుండగా గ్రామంలో రైతులు కొందరు భూతగాదాలో  బుర్రలు బద్ధలు కొట్టుకున్నా రన్న వార్త రావడంతో ఖంగుతిన్న ఎడ్వకేట్ మిత్రుడు మా వంకతిరిగి దేశంలో గ్రామరాజకీయాలిప్పుడు మరీ అరాచకంగా తయారయ్యాయి అంటూ నిట్టూర్చాడు
                     ***
కామెంట్‌లు