మె త్తని మోసం....!! > రావుల కిరణ్మయి--రచయిత్రి > హన్మకొండ*

పోద్దటీలి కొలిమి మీద కూసోని గడ్డపార మొన సరుస్తున్న నర్సయ్య అది తెచ్చిన కురుమయ్య తోనే గన్ను దెబ్బలు వేయించుకుంట పని కానిస్తున్నడు.ఇంతలో అటేటని పెట్టుకున్న ఫోన్ మోగడం తో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి 
చెప్పుతమ్మి ..!అంత మంచేగదా.అన్నడు.
అంతమంచేగని నువ్వు కొలిమి మీదున్నట్టున్నవ్?నేను మల్ల చేస్తతియ్ అని ఫోన్ పెట్టేశాడు.
కురుమయ్య విని,నరసన్న..!మీతమ్ముడు పొలం అమ్ముతడట గదా.ఏమక్కరవడ్డదేంది?అన్నాడు. 
ఈసారి వేసిన దెబ్బ గడ్డపార మొన మీద గాక,కురుమయ్య అన్న మాట తో గుండెలోవడ్డట్టైంది.చప్పున జారవిడువ బోతుండగా కురుమయ్య ఆపి,
ఏందే?గట్ల పరేశాను గావడితివి?నీ కెరుక లేదా ఏంది?జర్రంతల తప్పెగని నేను అట్నే దెబ్బేస్తే ఎట్లుండు?అన్నాడు.
అమ్మతోడు,అని నెత్తిల చేయి పెట్టుకుంట నాకు తెల్వదే?నీకెట్ల ఎరుకాయె?
ఆరి భగమంతా!ఇదెక్కడి అన్నాలం?ఊరు మొత్తం ఎరికైన సంగతి నికెరుక గాక పోవుడేంది?ఇచ్చంత్రం గాకుంటె?అన్నాడు.
కురుమయ్య మాటలకు నర్సయ్య నోరేల్లవెట్టంగనే,ఆయనే 
నేను ఇన్నోద్దుల సంది నీ కాడికి రాంది ఎందుకనుకున్నవ్?కొనేటోన్ని జూడే అన్నా!నీకింత ముట్టజెప్త గని ,అంటే ఆ పనిలనే తిరుగుతాన.        
నాకెరుక లేకుంట అమ్మటానికి వాడెవడు?కొనటానికి,బేరం జూడడానికి ?నువ్వెవలు? అనుకుంట ఆవేశ పడుతుంటే,
అన్నా..!సత్యప్రమానకంగా కుల్లం  కుల్లం జెప్త ఇను.
గా పొద్దు మీ వదినకు బాగలేదని సిటీల దవాఖానకు పోయినమా?గప్పుడు మందులకు పైసలు తక్కువ వడితె తమ్మికి గిట్ల గిట్ల సంగతని నేనే ఫోనేజేస్తే ఎగిరమేగిరం దగ్గరిపట్టున్నే ఉన్నఅని వచ్చి పైసలిచ్చి తన కార్లనే ఇంటిదాంక తిస్కపోయిండు.వద్దు వద్దనంగ సుత తిని పోండ్రని బువ్వ సుత వెట్టిండు.గప్పుడు ఈ ముచ్చట చెవిలేశిండు.అక్కడికి నేనన్న నరసన్న కెరికేనా?తమ్మి అని.
అదెనే,అన్నేమంటడు?గట్ల అనుమానపడవడితివి?అన్నాడు .
గదికాదు తమ్మీ!నా ఎరుకనుండి మీ వోల్లు పైసా పైసా ఎనుకేసుకొని బాగువడ్డరే తప్ప గిట్ల ఆస్తులమ్ముకున్నదైతే నేనెరుగ?పొలం కాలం గాక పడా వడ్డ,తాతల నిషాను అని అట్నే ఉంచుకున్నారు తప్పితే ఎన్నడు పూచిక పుల్ల గూడ అమ్ముకోలె.మరి నువ్వు ....అని నేను అనుమానంగా అడిగేసరికి తను 
నేను సుత పుక్యానికి అమ్మి పైసలు దుబారా చేస్కోనికి అమ్ముకుంటలేను.ఈ సిటీ లనే ఇల్లు కొనుకుందామని అనుకుంటాన.అన్నడు.
నేనుండి తిండి గిన్జలెల్లె పొలం అమ్ముకొని ఇల్లు కొనుక్కునుడేంది?ఇప్పుడు నువ్వు ఇల్లు లేకుంట సుత లేవు గదా !అన్న.
కరెక్టే గని,నేనేమన్నా పొలం చేస్తాన్నా?పెడ్తాన్న.రాను రాను కాలం గూడ సక్కగైత లేదు.అటు పొలం రేటు పడి పోవట్టే ,ఈడ ఇల్లులకు,జాగలకు రేట్లు పెరుగవట్టె గందుకని అమ్ముదామనుకుంటాన అన్నాడు 
అయితే ,అయిందానికి నరసన్ననే అడుగపోయ్నావ్ అన్న.
ఎందుకడుగ?అడుగుత .కానీ అన్న కొనే మోపున ఉండద్దా?అగ్గువకు సగ్గువకు ఇచ్చి నేను మునిగి నెత్తిన బట్టఏసుకోలేనుగదా!అనుకచ్చిండని సావు కబురు సల్లగ జెప్పి తన పని కానిచ్చుకొని పోయిండు కురుమయ్య.
పొద్దు పొద్దు గాల్నే ఈ ముచ్చట ఎరుకయ్యేవరకు,సప్పున కొలిమి సల్లారినట్టే బాధ తోని సల్లవడి తన మనసు లో గతం కొలిమి  అంటువెట్టుకున్నాడు.
                        _________________________________
నాయన ఉన్నన్ని రోజులు లక్ష్మణుని ఓలే అన్నా...!అన్నా...!అని నోట్లెకెల్లి అన్నా అన్న పిలుపు ఇడువనోడు,ఎన్నటికి పొలం అమ్మ,అయ్యవ్వలేకున్నా నాకు అంతటోనివి నువ్వున్నవని అన్న మాటలన్ని ఒల్లెక్కల మాటలేనా?ఏనాడూ నా పొలం నిన్ను గాదని అమ్మను ఏడికోకాడికి నువ్వే కొనాల్నే నడుమిట్ల మూడోగలున్డధ్దని సెప్పిన ముచ్చట్లన్ని యాదికి రాంగ తమ్మునికి ఫోన్ చేసిండు.
అప్పుడు చేసినవేంది ? తమ్ముడూ! అని అడిగిండు.
గదేనే పొలం అమ్మకం పెడ్తాన?నీ శెవులోమాటేద్దామని .....అని ఆగిండు.
వాని అవసరాలు వానికి ఉంటయ్.అండ్ల తెలిసి గూడ ఎందుకని అడుగుడెందుకని ,సూటిగ రేటెంత నుకుంటానవ్?అన్నడు.ఊళ్లె రేటేనే.నీ కెరుకలేన్దా?అంటే 
సరే నువ్వోపారి ఇంటికి రా!అని ఫోన్ పెట్టేసిండు.
మరునాడు తమ్ముడు రావటం రేట్ నేను తెలుసుకున్న అని ఓ రేటు చెప్పి ఏ విషయం వారం రోజుల్లల్ల చెప్పుమన్నాడు .
నర్సయ్య తెలుకున్న రేట్ కు తమ్ముడు చెప్పిన రేట్ కు బాగ ఫరకనిపించి అదే ముచ్చట తమ్ముని తోని అన్నాడు.
లేదన్న ,నువ్వు గాదంటే ,ఇప్పటికిప్పుడు నేనన్న రేట్ కు కొనేటోల్లున్నరు.అని సందియ్యకుండ మాట్లాడేవరకు నర్సయ్య 
సరే రా !అట్నే అమ్ముకో అన్నాడు.
మరో నెల రోజుల్లల్ల పొలం అమ్ముడుపోగా,నర్సయ్య గుడ పుర్సతయిండు.
కురుమయ్య లాంటివారి ద్వారా తెలుసుకున్న ముచ్చటేన్దంటే నర్సయ్య ఇస్తానన్న రేటు కే వేరే వారికి అమ్ముకొని నిషాను గ ఇల్లు కొనుక్కున్నాడని,తమ్ముడు కావాలనే ఇలా చేసాడని తెలుకున్నాడు.
తరువాత తమ్మునికి తెలియకుండా వాళ్లతోని కొనిపించి,తన వారి నిషాను తానూ దక్కించుకున్నానని తుప్తి పడ్డాడు.ఇలా అన్నదమ్ములు ఇద్దరు ఒకరికొకరు మెత్తని మోసం చేసుకొని కూడా ఎప్పట్లానే కూడి ఉన్నారు.
                            
కామెంట్‌లు