రేపు కాగజ్ నగర్ లో డా.సామల సదాశివ విగ్రహావిష్కరణ: రామ్మోహన్ రావు తుమ్మూరి

 ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ
     అగస్టు నెల అనగానే అందరికీ స్వాతంత్ర్యదినోత్సవం పంద్రాగస్టు గుర్తుకు రావడంసహజం.తెలంగాణా ఉద్యమం మంచి ఊపులో ఉన్నపుడు తెలంగాణా ఆవిర్భావప్రత్యూష రేఖలుపొడసూపే వేళ తెలంగాణ ఉషోదయం తిలకించకుండానే అగస్టు 7 ,2012  న అస్తమించిన ఆదిలాబాద్ కవి,రచయిత అన్నిటికంటే ముఖ్యంగా మాస్టారు అనిపిలువబడ్డ సామల సదాశివ సారును గుర్తుకు తెస్తుంది అగస్టు నెల ఇటీవలఐదారేండ్లనుంచీ.
      ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకుని,తానుపుట్టి పెరిగిన నేలను వదలకుండా ఎక్కడెక్కడి వారినో ఆకట్టుకునే రచనలు చేసి పండితపామరులను అలరింప జేసి అనేక మంది పాఠకుల్ని తయారుచేసుకున్న ప్రముఖరచయిత సామల సదాశివ.తాను ఖట్టర్ తెలంగాణావాదినని చెప్పుకునే మాస్టారుకుతెలంగాణేతర ప్రాంత అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండేదంటే ఆయనఎంత విశిష్టమైన వ్యక్తిత్వం గలవారో గమనించవచ్చు.
         అవిభక్త  ఆదిలాబాదు జిల్లా లోని కాగజ్ నగర్
దగ్గర తెనుగుపల్లె మాతామహుల ఇంట్లో 11 - 5 -1928 న జన్మించిన సదాశివ బాల్యంనవెగాంలో గడిచింది.తండ్రి నాగయ్య పంతులు బడిపంతులు.
తల్లి చిన్నమ్మ.ఏకైక సంతానమైన సదాశివ తండ్రి వద్ద చదువు నేర్చుకుని అప్పట్లో పెద్దతరగతులన్నీ ఉర్దూ మాధ్యమంలో ఉండటమేగాక పెద్ద ఊళ్లలో మాత్రం ఉండటం చేతవరంగల్ లో పాఠశాలవిద్య
నభ్యసించారు.ఇంట్లో భారత భాగవతాలు రామాయణం వంటివి ఉండటం వలనసహజంగా జ్ఞానాంశ కలవాడు కనుక,వాటిని ఒంటబట్టించుకున్నారాయన.అంతే గాకతండ్రి ఒక గురువు వద్ద అరబ్బీ ఫారసీ నేర్చుకునే అవకాశం కలిగించారు.అలా యౌవనదశలోపే ఆయనకు ఇటు సంస్కృతాంధ్రాలు,అటు అరబ్బీ, ఫారసీ,ఉరదూ భాషలపై పట్టుదొరికింది.దానికి తోడు కొద్దీ గొప్పో ఆంగ్లం తోడైంది.అప్పట్లో తెలుగు భాషలో పద్యాలురాసేవారికి బాగా ప్రాధాన్యత ఉండటం గమనించి పద్యాలు రాసి భారతి వంటి పత్రికలకుపంపటంతో వేలూరి శివరామశాస్త్రి,కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వంటి ఉద్ధండ పండితులదృష్టిలో పడ్డారు సదాశివ.నిర్దుష్టంగా భావరమ్యమైన పద్యాలు వారి నాకర్షించటంతోఉత్తరప్రత్యుత్తరాల ద్వారా వారితో పరిచయాలు పెరిగి పలు రచనలు చేసే స్ఫూర్తిలభించింది.కారణాంతరవల్ల తండ్రి ఉద్యోగం మానేయవలసి వచ్చినందువల్ల సదాశివపాఠశాల చదువు కాగానే ఆదిలబాదు జిల్లాలోనే బడిపంతులు ఉద్యోగంలో చేరారు.
ఇటు ఉద్యోగం చేస్తూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ సాంబశివశతకము,నిరీక్షణ,మంచిమాటలు,విశ్వామిత్రము,అంబపాలి,ధర్మవ్యాధుడు వంటి పలుపద్యలఘుకృతులు వెలువరించారు. అమ్జద్ రుబాయీలను తేటగీతులలోతెనిగించారు.తెలుగులో కథలు నవలలు కూడా ప్రయత్నించి తనకంటూ ఒక స్థానాన్నిసంపాదించుకున్నారు.అలాగే ఉర్దూలో అనేక వ్యాసాలు రాసి ఉర్దూ పాఠకులకుదగ్గరయ్యారు.మన తెలుగు కవులను వారి రచనలను ఉర్దూ పాఠకులకు పరిచయంచేసిన ఘనత సదాశివ గారిదే.ఈసమయంలోనే సురవరం ప్రతాపరెడ్డి సూచన మేరకుపద్యరచన మానుకుని తనకున్న ఉర్దూ అరబ్బీ భాషా పటిమతో ఉర్దూసాహిత్యవిశేషాలను ఉర్దూ కవులను తెలుగువారికి పరిచయం చేసే పనికిపూనుకున్నారు.అలా ఉర్దూసాహిత్య చరిత్ర,ఫారసీకవుల ప్రసక్తి,మహాకవి గాలిబు వంటిపుస్తకాలు రచించి ఉర్దూ తెలుగు వారధిగా మంచి పేరు తెచుచుకోవడమే గాక అకాడమీసభ్యులుగా చిరకాలం పనిచేశారు.గీటురాయి,మిసిమి పత్రికలలో గజల్పుట్టుపూర్వోత్తరాలు,రూమీ మస్నవీలు 
ఇంకా అనేక ఉర్దూ భాషాసంస్కృతులకు ముఖ్యంగా హిందూస్తానీ సంగీతగాయనీగాయకుల విశేషాలు వ్యాసరూపంలోవచ్చాయి. అలాగే వారి ఉరుదూ రచనలుసియాసత్ వంటి ప్రసిద్ధ ఉరుదూ పత్రికలలో ప్రచురించబడేవి. వారి వచన రచనముచ్చట్ల రూపంలో ఉండటంతో అనేకమంది పాఠకులను అలరించేది.
స్వతహాగా చిన్నప్పటినుంచే సంగీతాభిమాని మరియు సంగీతజ్ఞడవటంతోఆయనవ్యాసాలు చాలా విశిష్టతను కలిగి అడిగి రాయించుకునే స్థాయికిచేరుకున్నాయి.అవే తరువాత మలయమారుతాలు,సంగీతశిఖరాలు,స్వరలయలుపుస్తకాలుగా వెలువడినాయి.ఇందులో స్వరలయలు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు సంపాదించి పెట్టింది.ఇవన్నీ ఒక ఎత్తయితే వార్త పత్రికకు యాది పేరిట ఆయనరాసిన వ్యాసాలు ఆయన ఇంటిపేరు మార్చి ఆయనను యాది సదాశివనుచేశాయి.ఆయన వ్యాసాలకోసం పత్రికను కొన్న వారెందరో అప్పట్లో.ప్రతిభాశాలి గనుకఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని పురస్కరించుకొని కాకతీయ విశ్వవిద్యాలయం మరియుపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం డాక్టరేటు పట్టాలను ప్రసాదించాయి. 
తనకు పరిచయమైన వ్యక్తులు చిన్నా పెద్దా అని తేడాలేకుండా మానవీయతా దర్శనాన్ని
అనితర సాధ్యంగా యాదిలో పొందు పరచడంతో దానికి ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది.
సంగీత సాహిత్యాలే గాక చిత్రలేఖనంలో కూడా అత్యంత ప్రావీణ్యంగల సదాశివ తైలవర్ణచిత్రాలెన్నో గీశారు.
ఆయనకు పరిచయమైన ప్రతివ్యక్తితోనూ పండిత పామరులనే తేడాలేకుండా, వాదాలకతీతంగా నిరంతరం ఉత్తరాల ద్వారానో ఫోన్ ద్వారానో, సంబంధాలనుకొనసాగించేవారు.ఉద్యోగ రీత్యా ఆదిలాబాదులో స్థిరపడి ఆదిలాబాదుకు ఏ అధికారివచ్చినా ఆయనను కలుసుకునే విధంగా పేరు తెచ్చుకున్న మానవప్రేమికుడు.వచ్చినవారితో వారి స్థాయికి తగ్గ ముచ్చట్లు పెట్టి వారి హృదయాలలో చిరస్థాయగ నిల్చినఅసాధారణ వ్యక్తి సామల సదాశివ.ఉద్యోగం చివరి దశలో పదోన్నతిపై భద్రాచలంలోనిజూనియర్ కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేసి 
అక్కడే ఉద్యోగవిరమణ గావించారు.అలా ఆయన్ని ఆయనకు ఇష్టమైన రాముడు తనదగ్గరికి రప్పించుకున్నాడు కావచ్చు.ఎందుకంటే ఆయనంతట ఆయన ఏనాడు ఏపుణ్యక్షేత్రాన్ని దర్శించలేదని చెప్పేవారు.భద్రాచలంలో ఆలయానికి వెళ్లినపుడు ఆయనగుర్తించిన నిలయ విద్వాంసులు ఆయన కిష్టమైన కీర్తనలు వాయించేవారంటే వారెంతగామనుష్యులను ఆకర్షించేవారో తెలుస్తుంది. ఆయన రచనలలో ఇంతవరకు వెలుగుచూడనిది ఆయన నారాముడొక్కటే.ఆయన తొలిదశలో రాసిన కథలు కొన్ని అప్పట్లోసుజాతపత్రికలో ప్రచురించబడ్డాయి.వాటిని ఇటీవలే ఫేస్బుక్ మాధ్యమం ద్వారాసంపాదించగలిగాము.కరీంనగర్ ఫిలిం సొసైటీ వ్యవస్థాపకులలో ప్రముఖుడు వారాలఆనంద్ గారు సామలసదాశివ ముఖాముఖితో ఒక లఘు చిత్రాన్ని నిర్మించారు.మిత్రుడుతాళ్లపల్లి మురళీధరగౌడు తన జీవనరేఖలు అనే ప్రముఖుల ఇంటర్వ్యూల పుస్తకంలోసదాశివగారి ఇంటర్వ్యూ ప్రచురించారు.
ప్రతిభాశాలియైన సదాశివ పొందిన సన్మాన,సత్కార,పురస్కారాలు అన్నీ ఇన్నీ కావు. 
అడవులజిల్లా ఆదివాసుల జిల్లాలో పుట్టిన సదాశివ అక్కడి గోండు వీరుడు కొమురంభీమును తొలిసారిగా పాఠ్యపుస్తకాలకెక్కించి ఈరోజు కొమురం భీము ఒక గొప్పవిప్లవవీరుడిగ గుర్తించబడటానికి కారణభూతులయ్యారు.ఆయన రేడియో ప్రసంగాలకుచెప్పలేనంత ఆదరణ లభించేది.ఆదిలాబాద్,వరంగల్,హైదరాబాద్,విశాఖపట్టణంమొదలైన ఆకాశవాణి కేంద్రాల నుంచి ఆయన అనేక ప్రసంగాలు ప్రసారం చేయబడ్డాయి.
సియాసత్ ఉర్దూ దినపత్రికకు ఆయన రాసిన వ్యాసాలు వెలుగులోనికి రావలసి ఉన్నాయి.
తనకు తాను ఖట్టర్ తెలంగాణ వాదినని చెప్పుకునే సదాశివ తెలంగాణా అస్తిత్వానికై  ఎంతో పాటు పడ్డారు.కాళోజీ సోదరులతో ఆయనకున్న అనుబంధం మాటలకందనిది.అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సదాశివ ఆత్మీయ స్నేహితులు.తెలంగాణాఉద్యమసమయంలో చంద్రశేఖర్ రావుతో సహా ఆయనను సంప్రదించని నాయకులులేరు.దురదృష్టవశాత్తు తెలంగాణ ఏర్పడకముందే అగస్టు 7,2012న ఆయన కన్నుమూశారు.ఆయనకు భార్య ముగ్గురు కుమారులు.ఇటీవలే ఆయన సతీమణిపరమపదించింది.మనుమలు మనుమరాళ్లంటే ఎనలేని ప్రేమ.తెలుగు సాహిత్య చరిత్రలోసదాశివకు సముచితస్థానమున్నదనటంలో సందేహం లేదు.మొన్న జరిగిన ప్రపంచతెలుగు మహాసభల్లో ఆయన పేరున ప్రత్యేక వ్దికనేర్పాటు చేయటం ఒక చిన్నఉదాహరణ.అలాగే విశ్వనాథ పీఠం వారు ఆయనకు కేంద్ర సాహిత్యపురస్కారం లభించినసందర్భంగా ఆయన విశిష్ట రచనలతో పాటు పలువురి వ్యాసాలతో ఆరువందలకు పైగాపేజీల ప్రత్యేక సంచికను తయారు చేసి ఆయన సమక్షంలోనే ఆదిలాబాదు ఆకాశవాణికేంద్రంలో ఆవిష్కరించటం ఆయన సాహితయసేవకు ఒక మంచి గుర్తింపు.అలాగేఆయనమరణానంతరం  కావలి నుండి వెలువడిన ఒక వ్యాస సంకలనానికి ఆయనముఖ చిత్రంతో సదాశివ స్మారక సంచికగా వేయటం ఎల్లలు లేని ఆయన సాహితీసౌరభానికి నిదర్శనం.
ఆదిలాబాదు జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక నగరం సిర్పూర్ కాగజ్ నగర్లో ఆయనశిలావిగ్రహ ప్రతిష్ఠాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  
నేను ఆదిలాబాదు జిల్లాలో  నలభై సంవత్సరాలు ఉద్యోగరీత్యా ఉండటంతో ఆయనతోమూడు దశాబ్దాల సాన్నిహిత్యం చూరగొన్నాను.నా తొలి పుస్తకం గొంతెత్తిన కోయిల ఆయనచేతుల మీదుగా ఆవిష్కరించబడటమే గాక మలి పుస్తకం మువ్వలు వెలువడటానికిఆయన ప్రేరణ కారణం. నా సాహిత్యప్రగతికి మూలకారణమైన కే.నారాయణ గౌడుసదాశివగారి ప్రియశిష్యుడు.సదాశివ పద్యకృతులన్నీ సంకలించి సదాశివ కావ్య సుధగాకాగజ్ నగర్ తెలుగు సాహితీ సదస్సు ప్రచురించింది. దానికి కే.నారాయణ గౌడు గారుసంపాదకులు.ఆయనే నన్ను తొలి సారి సదాశివ గారికి పరిచయం చేశారు.సదాశివమరణానంతరం సదాశివ సాహితీబంధువుల వ్యాసాలు,కవితల సంకలనం‘సదాశివస్మృతిసుధ’కు నేను సంపాదకుణ్ణి కావటం నాకు ఒక పదిలమైనజ్ఞాపకం.తెలంగాణాలో ఎందరో మహానుభావుల్లో ఆయన ఒకరు.ఈ అగస్టు నెలలోఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి.
కామెంట్‌లు