పావురాలు చేసిన మేలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 రామయ్య ఒక రైతు.అతనికి పక్షులను పెంచటం ఒక సరదా.అతని తోటలో రకరకాల పిట్టలు కువకువలాడుతూ సందడిచేసేవి. దేవుడు సృష్టించిన ప్రతి ప్రాణీ అమూల్య మైనదే!ఏదో ఒకరోజు  వాటి అవసరం సహాయం  తనకు కలగవచ్చు అని నమ్మేవాడు.ఇంటి లో రెండు పావురాలను పెంచుతున్నాడు.
తను ఎక్కడకి వెళ్లినా పెద్ద పంజరంలో పెట్టి తీసుకుని వెళ్ళేవాడు.మిత్రులంతా "ఏంటీ రామయ్యా!పెంపుడు కుక్క లాగా వీటిని నీతో మోసుకుంటూ తిరుగుతావు?కుక్క ఐతే తెలివిగా మసలుతుంది.మనకు కాపలాకాస్తుంది."అని హేళన చేసినా పట్టించుకునేవాడుకాదు. ఒకసారి  తీర్థయాత్రకని రామయ్య  తన మిత్రులు  పంజరంలోని పావురాలతో బైలుదేరాడు."పెళ్ళికెళ్తూ పిల్లిని చంకన పెట్టు కెళ్ళినట్లుగా  ఈ పావురాలు ఏంటీ?"తెలుసున్నవారు హేళన చేసినా  నవ్వేసి ఊరుకున్నాడు. కాలినడకన కొంత దూరం వెళ్ళాక అడవి తగిలింది. దగ్గరదారి అని సాగిపోతున్నారు.ఇంతలో ముగ్గురు దొంగలు వారిపై దాడి చేసి డబ్బు దస్కంతో సహా అంతా ఊడలాక్కున్నారు.అంతతో ఊరుకోకుండా తమ స్థావరానికి   లాక్కెళ్ళి వీరిని నౌకర్లుగా వాడు కోసాగారు. దొంగలకి వంటవార్పుతోసహా అన్నీ చేస్తూ మిగిలిన తిండితో పొట్ట నింపుకోసాగారు.మిత్రులందరికీ  దిగులు పట్టుకుంది."పిసినారి తనంకి పోకుండా  ఏ గుర్రపు బగ్గీ లోనో  బైలుదేరితే బాగుండేది "అని కుళ్ళిపోసాగారు.కానీ  చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభంఏంటి?రామయ్య మాత్రం  తనుతిన్నా తినకున్నా పావురాలకి అన్నం పెట్టి తన పొట్ట మాడినా సహించేవాడు.'"రామయ్యా! కుక్కని వెంటతెచ్చినా బాగుండేది. అది ముందే దొంగలని పసికట్టి వారిని చీల్చి చెండాడేది.ఈ నోరులేని పావురాలపంజరం మోస్తే ఏంలాభం?పంజరంలోంచి వాటిని విడిచిపెట్టు.దొంగలు వాటిని వండి వార్చమంటారు"అనటంతో రామయ్య  ఆలోచనలో పడ్డాడు. "హు..నోరులేనివని అలుసుగా చూడకండి.ఇవే మనల్ని కాపాడితీరుతాయి"ఆత్మ విశ్వాసంతో అన్నాడు.మూడు రోజులు మూడు యుగాలుగా అనిపిస్తున్నాయి.దొంగలు కాస్త బేఫికర్ గా ఉన్నారు. ఆరోజు  రామయ్య తనవేలికి గాయంచేసుకుని ఆరక్తంతో అక్కడ ఉన్న పేపరు పైఏదో రాసి పావురాలకాళ్లకి కట్టి  పంజరంనించి వదిలాడు. ఆరాత్రి బాగా ఊటుగా తాగివచ్చి ఆదమరిచి నిద్రపోయారు. పూర్తిగా తెల్లారకుండానే ఆఊరివారు కర్రలు బరిసెలతోవచ్చారు.ఈలోపల పోలీసులతో రామయ్య కొడుకు కూడా వచ్చాడు. మిత్రులు ఆశ్చర్య పోతుంటే రామయ్య అన్నాడు"పావురాలు  మనకు  దారిచూపాయి.ఈస్థావర సమాచారం  పేపర్ పై రాసి పావురాల కాళ్ళకి కట్టాను.అవి మా ఇల్లు చేరాయి." రామయ్య కొడుకు ఇలా చెప్పాడు "మా నాన్న లేఖ చదివి  ఇరుగుపొరుగుకి చెప్పి  పొరుగూరి పోలీస్ స్టేషన్ కి వెళ్లి  సమాచారం  చెప్పాను.ఊరివారు గ్రామపెద్దకారులో బైలుదేరారు."అందరూ పావురాల వల్ల  ఎంత లాభం ఉందో గ్రహించారు.ప్రతి ప్రాణిని మనం తక్కువ అంచనా వేయరాదు.దేవుని సృష్టి లో ఏదీ అల్పం అనవసరం అని అనుకోరాదు.
కామెంట్‌లు