గోకులాష్టమి శుభాకాంక్షలు : - రామ్మోహన్ రావు తుమ్మూరి

చెరలో పుట్టిన వాడు
చేరెను గోకులము
దేవకి తనయుడు 
యశోద తనయుడాయెను

పుట్టుకనే లేని వాని 
పుట్టుకెంత చిత్రము
తుదిమొదలే లేని వాని
జీవితము పవిత్రము

కారణజన్ముడు కాడా
కాళీయమర్దనుడు
పూత శరీరుడు కాడా
పూతన సంహారుడు

మునుపటి జన్మల మునులు
 పదారువేల గోపికలుగ 
తమ తమకము దీర్చుకొనిరి
బృందావనమాలి గూడి

వెన్నదొంగ మన్నుదినెను
అన్నమాట అమ్మవినెను
కన్నయ్యను నిలదీయగ
నోట జూపె భువనములను

రాధాలోలుడు యమునా
తటమున మురళీప్రియుడై
రమణుల మనసులు దోచెను
రాసలీలగావించెను

కక్షబూని దేవేంద్రుడు
గాలివాన సృష్టించగ
కడపటి వేలున గుట్టను
ఎత్తి గోవుల కాపాడెను

గోవిందుడు గోకులమున
ఎన్ని చేసెనో 
గోపాలుడు నందసుతుని
కొనియాడరో

గోకులాష్టమి నాడు
కొలిచి తనయరో
గోకులకృష్ణుని మనమున
తలచి మురువరో

కామెంట్‌లు