ఎప్పలు....!:- నందు కుషినేర్ల...

 సిరీస్ చూసుడు అయిపోంగనే  సాకేత్ తన మొబైల్ కి చార్జర్ కనెక్ట్ చేసి బయట అరుగు మీద కూర్చున్న అమ్మమ్మ వద్దకు పోయి ఆమె ఒళ్ళో తల వాల్చి పడుకున్నాడు.
                             అంతకు ముందు నుంచే అమ్మమ్మ ఆవిడ సన్నిహితురాలైన నిర్మలవ్వ ఇద్దరూ బాగా ముచ్చట్లలో మునిగిన్రు.
                        సాకేత్ ని చూసిన నిర్మలవ్వ "ఎపుడొచ్చిండమ్మ మనువడు ?" అనిడిగింది..   
                        "నిన్న మాపటీలనే వచ్చిండే..." అని చెప్పింది అమ్మమ్మ.
                                  "మీ అమ్మ నాయినలు బానే ఉండరా పిల్లగా" అని అతడినే అడిగింది నిర్మలవ్వ.
                              "ఆఁ....! బాగనే ఉండరు అవ్వ." అన్నాడు.
                             "సోరోనివైనవ్....  పిల్లని చూసుకున్నవా ? లేక మేమే దేవులాడుదుమా ?" అన్నదావిడ.
                                 సాకేత్ shock అయి ఏమనలేదు.  "ఊకోవే  వాడు చిన్నపిల్లగాడు. అపుడే ఆ జోలి తీయకు వానితోటి."  అని నవ్వుతూ అన్నది అమ్మమ్మ.
                             పల్లెటూర్లలో ముసలివాళ్ళు టీనేజ్ వాళ్ళని ఇట్లే ఆటపట్టిస్తారని అతనికి తెలుసు.
                            "ఆఁ ఏం చిన్న పిల్లలమ్మా ...! సూస్తున్నంగనే  చెట్టంత సాగుతరు. మనమే తలకాయ లెత్తి మీదికి సూడాలె వీళ్ళ మొఖాలను" అన్నదామె...
                           "ఇంగ అదొకటి కరెక్టే....!" అన్నది అమ్మమ్మ...
                          "అయినా నీమనువడు  జెర నయమేనమ్మో.....  తలకాయను ఫోన్ ల ఇరికిచ్చుకోకుండ వచ్చి  నీ పక్కన కూసున్నడు మంచిగ.  అదే మా పిల్లలు సూడు , తలకాయ ఇట్ల మలిపితే పాపం  . అన్నట్టు ఎగపడుతరు." అన్నది నిర్మలవ్వ.
                            "ఈయన ఏం సొక్కమైన పిల్లగాడేం కాదమ్మా....  అందుల చార్జిన్ అయిపోయినట్టుందీ....  ఇంగ దానికి పుల్ల పెట్టి వచ్చిండు. జెర్రున్నంక సూడు ఎట్ల ఉర్కుతడో..." అన్నది అమ్మమ్మ.
                                 "ఇది అంతే ఉండాది కథ...!" అన్నదామె.
                          "హలో  ! నేను మరీ అంతేం  అతుక్కోను. limits లనే వాడుతా...! " అన్నాడు అమ్మమ్మ నీ చూస్తూ....
                              "ఏడ ఉండయ్ నాయనా నీ లిమిట్స్ ? " అంటూ  నిర్మలవ్వ దిక్కు మల్లి   "రాత్రి తిన్నంక కూర్చుని.... చెవులల్ల తీగలు తగిలిచ్చుకున్నడే....   వచ్చెరా వచ్చెరా  , కాల్చు కాల్చు , back  back back , ఆఁ.  కాల్చు  కాల్చు   దాదా దా  , పొపొపొ  ఎంక సూడు  ఎందో నాకు అర్థం కాలే...   పదకొండైంది. ఒకటిటికి లేచిసూశిన , రెండీటికి సూశిన....  ఎంతకు అయిపోదు....   వచ్చేరా వచ్చేరా  పాయేరా పాయెరా....  ఏందిదీ....!"  అన్నది అమ్మమ్మ.
                          అతడేం మాట్లాడలేదు.
                                నిర్మలవ్వ  అదోరకంగా చూసుకుంట  "పజ్జో  గజ్జో  నంటనే తల్లీ  ఆ ఆట పేరు.  తుపాకులు పట్టుకున్న బొమ్మలను ఉర్కిస్తరంట.  మా  కొంపల కూడా ఒకడుండడు. ఇదే సోయి లేని ఆట.!" అన్నది.
                    అతనికెట్లనో అనిపించింది. విన్నాక 
                             "నీ మనువడు కూడనా ? ఏం రోగమో ఏమో నే ఇది ఖర్మ గాకున్నది." అన్నది అమ్మమ్మ .
                           "అవును ఇపుడూ  వాడంటే పిల్లగాడు .  తెల్వదు.   తల్లి చెప్పాలె కదా ! తప్పు బిడ్డా ! ఎప్పుడు అదే పెట్టుకోగుడుదు. మంచిది కాదు. అని.    అహా అట్ల చెప్పుడు పక్కకెట్టు.  తల్లే ముందుగాల  చెవులల్ల బొడిపెలు చెక్కుకొని  అదేందో ఈ టీబో , గీ టీబో నంట. ఇంగ అందుల పనికిమాలినవన్నీ సూసి ఇగిలిచ్చుకుంట కూసుంటది." అన్నది నిర్మలవ్వ.
                          "అది ఈ టీబు కాదు అవ్వా...  you tube అనాలె."  అన్నాడు సాకేత్
                             "యాదో ఓటి తలకాయలేని తనానికి" అన్నది అమ్మమ్మ.
                        "సరే దీనికిమొగడైనా చెప్పాలె కదా ! మావోడు  ఏందో  అందుల టివిటెర్రనో  గివ్విటెర్రనో నంట. అందులకు అంటుకపోతడు. మంత్రులు , ఆఫీసర్లు , హీరోలు  మన కష్టాలకు అందుల సమాధానం చెప్తరంట.  నాకు అర్థం గాలే....   గాల్ళంతా అందుల  కొచ్చి ఫోన్ మీద వేళ్ళాడిచ్చుకుంట పొద్దు గడిపేదానికి ఇన్ని ఆఫీస్ బిల్డంగ్ లెందుకు , ఆ దరఖాస్తులెందుకు ? ఆ కార్ల ఖర్చులెందుకు ? బందోబస్తుల ఖర్చులెందుకు " అన్నది నిర్మలవ్వ.
                              "అవునే  మనుషులకు మెదడు మోకాళ్ళల్ల ఉందా అరికాళ్ళకు ఊడిపడ్డదో అర్థమైతలేదు." అన్నది అమ్మమ్మ.
                           "అది టివ్విటెర్ర కాదు అవ్వా ! twitter... " అన్నాడు సాకేత్
                           "యాదో ఒకటి మెదడులేని పనులకు" అన్నది అమ్మమ్మ.
                             "ఇంక మా చిన్న కోడలు ఉంది కదా ! అదేందో  ఆట్సాప్పనంట.  నెంబర్ ఉంటే సాలంట . ఏందైనా అందుల పటాపటా పంపిచ్చుకోవచ్చంట.   నేనుండి మీ వదినెకు ఈ నెయ్యి పంపు తల్లీ అందుల నుంచి అన్నా....  ఇవి పోవు అత్తమ్మా. అని దీర్ఘం దీస్తది."  అన్నది నిర్మలవ్వ 
                        "మరేం పోతయంట ?" అడిగింది అమ్మమ్మ...
                         "ఫోట్వోలు , ఇంగ తిన్నవా , లేచినవా ? పండినవా ? పండ్లు తోమినవా !  ఇడ్లీలు తెల్లగొచ్చినయ్ ,  దోశలు గుండ్రంగ వచ్చినయ్ ,  ముక్కలు ఉడికినయ్ , వెంటుకలు ఇగురపోసుకున్నయ్ , మూతి ముడుసుకున్నయ్, మెడలు వంకగ పెట్టినయ్ ఫోటలు దిగి పంపుకుంటరంట." అన్నది నిర్మలవ్వ.
                                  "ఏంటికి  అవన్నీ అవుతలోళ్లు నెత్తిన కొట్టుకోనింకెనా  " అన్నది అమ్మమ్మ.
                      "అరే ముందలున్న మమ్మల్ని అడుగదంటే  చీరల నేనెట్లున్న అని.  టిక్కున సల్పో గల్పో  ఏందో అంటరు దాన్ని  ముందలి కెమెరా తోని ఫోటో దిగి  వాళ్ళ గురూపులు ఉంటయంట అందులకు పంపి అడుగుతది..."  అన్నది నిర్మలవ్వ
                                      "అయ్యో అది సల్పో గల్పో కాదు అవ్వా  సెల్ఫీ అంటరు." అన్నాడు సాకేత్
                                "ఆఁ .... గట్లనే   " అన్నది నిర్మలవ్వ.
                            "ఆట్సప్పకు అతుక్కొని కూసుంటదంటవ్ ఆ పిల్ల !" అన్నది అమ్మమ్మ.
                        "అబ్బా అది ఆట్సప్ప కాదు అమ్మమ్మ....  వాట్సఅప్. " అన్నాడు సాకేత్
                        "ఇపుడామెను సక్రమంగా పలకకపోతే  భూమి కొట్టుక పోతదా ?" అన్నది నిర్మలవ్వ....
                         "అదే కదా !" అన్నది అమ్మ మ్మ....
                           "ఇంగ  మా చిన్నోడుంటడు కదా ! వాడు  అదేందో పాస్ బొక్ అంట.  వాని పెండ్లం ఆట్సప్పల పెట్టినట్టు  వీడు  ఆ పాస్ బుక్కుల పెడుతడు అదే సోది."  అన్నది
                           "అది పాస్ బుక్ కాదు అవ్వా ! facebook. అనాలె." అన్నాడు.
                         "ఎవరన్న జరిమాన ఏస్తే మేం కట్టుకుంటంలే పేరు తప్పు పలికినందుకు. నువ్వేం చింత చేయ్యకు" అన్నది అమ్మమ్మ.
                              "ఇంగ అందుల  ఫోటోలు పెడితే  అవెంటివో  అందరు లిక్కలు , కావిట్లు కొడతరంట." అన్నది. నిర్మలవ్వ
                        "అయ్యో అవి లిక్కలు కావిట్లు కావు అవ్వా  likes , comments అంటారు." అని చెప్పిండు.
                          "యావో ఓటి నమిలి మింగేటివి కావు. సప్పరిచ్చి మింగేవి కావు. ఏంటికొచ్చిన పెంట ?" అన్నది నిర్మలవ్వ.
                               "అదే కదా ఖర్మ" అన్నది అమ్మమ్మ
              "ఇంగ ప్రతీ పొద్దుపోని పనికీ  ఎప్పలుంటయంటనే తల్లీ....!" అన్నది నిర్మలవ్వ
                         "అవి ఎప్పలు కావమ్మా  apps అనాలె " అన్నాడు.
                                    "సోయి లేని దాంట్లను ఎట్ల పలికితే ఏముంది !" అన్నది అమ్మమ్మ...
                    
                               "మీకు దండం తల్లీ" అని అతను ఇంట్లోకి పోనింకె లేస్తుంటే  ....  "పోయి ఇంగ చెవులల్ల బొడిపెలు పెట్టుకని మాలోకంలకు పోతవేమో " అన్నది నిర్మలవ్వ నవ్వుకుంట.
                             "ఇంతకీ బొడిపెలంటే ఏంటివి ? అన్నాడు 
                                 "బెండకాయ మొదల్లు ఉంటాయ్ కదా  కోసి పక్కకు పడేస్తం దాన్నే బొడిపె అంటాం." అన్నారు ఇద్దరూ పగలబడి నవ్వుకుంట.చెప్పిన్రు.
                               "ear phones కి వీళ్ళు పెట్టిన పేరు ని చూసి నవ్వలో ఏడవాలో అర్థం కాలేదు అతనికి
                                       
కామెంట్‌లు