మా ఊరి షాజహాన్ తన ముంతాజ్ కి తాజ్ మహల్ కట్టించలేదుగాని అంతకంటే గొప్పపనే చేశాడు!
తాజ్ మహల్ భౌతికంగా కన్పిస్తుందిగాని
మాషాజహాన్ చేసిన పనేంటో మనసు కళ్ళతో చూస్తేనేగాని కన్పించదు
మా షాజహాన్ పుట్టుకతో
మా ఊరివాడుకాదు ఎక్కడో ఉత్తరాదివాడు
ఎట్లావచ్చారోగాని ప్రేమికులిద్దరు ఓరోజు పొద్దున్నే మాఊరి దర్గా దగ్గర కొచ్చారు
షాజహాన్ తెల్లటి తెలుపుతో అందగాడేఅయినా
ఆవిడ పచ్చిపసుపుకొమ్ములా మరింత అందంగా వుంది ఆవిడ ఒంటినిండా తంగేడు పూవులా కన్ను చెదిరిపోయేంత బంగారం
నుదుట పొద్దపొడుపు సూర్యునిలా
ధగధగా మెరిసిపోతున్న పెద్దబొట్టు
వాళ్ళ కథా కమామీష్ కనుక్కున్న ముజావర్
కచ్చీర్ కు దగ్గర్లో ఓ పెంకుటిల్లు కిరాయికి ఇప్పించాడు
ఎవరో సాయిబ్ గొప్పింటి పిల్లను లేపుకొచ్చాట్ట!
అన్న వార్త క్షణాల్లో ఊరంతా కలరాలా పాకిపోయింది
రోజులు గడుస్తుంటే మెల్లగా అన్నీ మరిచిపోయిన ఊరు వాళ్ళను అక్కున చేర్చుకుంది
మునెమ్మ ఒంటిమీది బంగారం
అద్దిల్లు సొంతిల్లుగాను చెరువు కింద ఎకరం మాగాణిగానూ మారిపోయింది
కలిసి పారుతున్నా శబరి శబరి గాను గోదావరి గోదావరిగానూ వున్నట్టే ఎంతకాలమైనా
షాజహాన్ షాజహాన్ గానే
మునెమ్మ మునెమ్మగానే వుండిపోయారు తప్ప ఒకరు ఇంకొకరిలోకి మారలేదు
పొలం నాటేయించినంక
అతను బట్టలు కుడుతుంటే ఆవిడ చేతిపని,ఖాజాలు, గుండీలు కుట్టేది
అసలు వాళ్ళిద్దరినీ దగ్గరికి చేసిందే ఆ మిషనట!
ముందే వాళ్ళిద్దరూ బతికినంతకాలం ఒకరికొకరు తప్ప పిల్లలొద్దనుకున్నారట!
అట్లా వాళ్ళకు సంబంధించిన ఒక్కో కొత్తముచ్చట బయటకొచ్చి నప్పుడల్లా ఊరు రిచ్చబడి కొంతకాలం గుస గుస లాడినా
అంతలోనే అన్నీ మర్చిపోయేది
కాలం ప్రవాహమైసాగిపోతూ సంవత్సరాల మైలురాళ్ళను తనలో కలుపుకుపోతుంది మునెమ్మను కాలం కంటే ఎక్కువ పెద్దరోగం పీడించడం మొదలు పెట్టింది
బాసకు కట్టుబడివున్న మా షాజహాన్
ఆవిడ ఒక్కోఅవయవం రాలిపోతున్నా కొద్ది మరింత ప్రేమతో గుండెలకు హత్తకుంటూ సేవలు చేశాడు
మగవాడికి సేవలు చేసిన ప్రతివ్రతల కథలు మాత్రమే విన్న ఊరిజనం ఆవిడకతను చేస్తున్న సేవలు చూసి ఊరు ఊరే అతనికి సలామ్ చేసేది వాళ్ళదీ ప్రేమంటే..
వాళ్ళు మనుషులంటే అంటూ
ఆరాధనగా చెప్పుకునేవాళ్ళు
ఒకరి వెనుక ఒకరుగా షాజహాన్, మునెమ్మల
ఆకులు రాలిపోయాయి
విషాదమేమిటంటే
ఇప్పుడా ప్రేమమూర్తులను ఊరు మర్చిపోయింది
వాళ్ళ సమాధులు ఊరిచివర
శిథిలమై చిరునామా కోల్పోయాయి...!!
ఊరు మర్చిపోయింది ..!!--శీరంశెట్టి కాంతారావు >రచయిత -పాల్వంచ*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి