జకమొక ..!! ' > శీరంశెట్టి కాంతరావు > రచయిత > పాల్వంచ*

 మానవ మహేతిహాసంలో
మనిషి నిప్పును గుర్తించడం
యాదృచ్ఛికంగా జరిగినా
దాన్ని గుప్పిట బిగించిపట్టి తనకు అవసరమైనప్పుడల్లా చిటికెలో నిప్పును పుట్టించడం మనిషి మేధకు నిదర్శనం
అందుకు కొనసాగింపు మా తాత 'జకమొక' (చెకుముకి)
సంచి
మాతాతకు అవసరమైనప్పుడు
దేవుని చెరువుకింద ఒంపులోని 
జమ్ము దగ్గరికెళ్ళి సరిగ్గా సందెడు కంకుల్నికోసి జాగ్రత్తగా పాతపంచ తుంపులో మూటకట్టి తీసుకొచ్చి చెలక బాయికాడ పరుపు బండ
మీద ఎండబెట్టేవాడు
పదిరోజుల్లో అది పూర్తిగా ఎండిపోయి దూదంతా
బట్టమీద నిశ్శబ్దంగా  రాలిపడేది దాన్నంతా మూటకట్టి పక్కనే ఎడ్ల కొట్టంలో పెట్టేవాడు
తరువాత చెలకలమీదపడి 
ఓ సందెడంత ఉత్తరేణి పొరక కోసుకొచ్చి దాన్నీ బండమీద ఎండబెట్టేవాడు
ఎండిన దాన్ని కాలిస్తేవచ్చిన బూడిదలో మూటకట్టివుంచిన
దూదినితీసి బాగాకలిపి తిరుపతి లడ్డూలంత  ఉండలు చేసి పాతకుండలో దాచిపెట్టుకునేవాడు
చెలకలమీదికెళ్ళి తనకు నచ్చిన చిన్న చిన్న పలుకురాళ్ళు ఏరుకొచ్చుకు నేవాడు
మాదిగింటికెళ్ళి మూడరల తోలుసంచి కుట్టించుకునేవాడు
కమ్మరింటికెళ్ళి మూడంగుళాల పొడవు అరంగళం మందం ఇనుప బద్దేతెచ్చుకునేవాడు
సంచిలోని ఓఅరలో దూది, ఓ అరలో రాయి, ఓ అరలో ఇనుప బద్దె పెట్టి దారంతో కట్టి అంగీజేబులో పెట్టుకునేవాడు
చెకుముకి సంచి తయారు!
ఎక్కడంటె అక్కడ ఎప్పుడంటే అప్పుడు పలుకురాయిమీద ఇంతదూదిపెట్టి ఇనుప బద్దెతో చిటుక్కున తాటించి చటుక్కున నిప్పు పుట్టించి ఆకుచుట్ట ముట్టించి తాగుతూ అరమోడ్పు కళ్ళతో తనదైన లోకంలో మునిగిపోయేవాడు
ఇప్పుడు అక్షరాల్లో తప్ప అసలైన చెకుముకిని ఎందరు చూశారో!?
కామెంట్‌లు