*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౧౦ - 110)

 మత్తేభము:
*దురమున్దుర్గము రాయబారము మరిన్ | దొంగర్కమున్ వైద్యమున్*
*నరనాథాశ్రయమోడబేరమును పె | న్మంత్రంబు సిద్ధించినన్*
*అరయన్ దొడ్డఫలంబు గల్లగునదికా | గా కార్యమే తప్పినన్*
*సిరియుంబోవును బ్రాణహానియు నగున్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
అరయన్- బాగా ఆలోచించి చూస్తే, యుద్ధం లో కోట జయించడము, మధ్యవర్తిత్వం చేయడము, దొంగతనాలు చేయడం,  డాక్టర్‌ ఆపరేషన్ చేయడం,  మనవంటి వారే అయినా తోటి మనుషులను పొగడటం,  ఓడల మీద వెళ్ళి వ్యాపారం చేయడం,  పెద్ద పెద్ద మంత్రాలు చదవడం ఇటువంటి పనులు చక్కగా పూర్తి అయితే చాలా మంచి ఫలితం వస్తుంది.  అలాకాక, బెడిసి కొడితే డబ్బలూ పోతాయి, ప్రాణాలు కూడా పోయే అవకాశం వుంది....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*దొంగతనాలు, శస్త్రచికిత్స లు, యుద్దాలు, మంత్రాలు, మొదలగు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి పెంచుకుంటే, సఫలము అయ్యే విషయం ప్రక్కన పెడితే, ప్రాణ హాని పొంచి వుంటుంది. అయినా సరే మా మనుషులు వాటి వెనుకే పరుగిడుతూ వుంటారు.  అదే సమయాన్ని, భగవంతుని కి దగ్గరగా వెళ్ళడానికి వెచ్చిస్తే, ప్రకృతి కూడా సహకరిస్తుంది.  పూల చెట్లు ఎక్కవ పూలు పూస్తాయి, వాయు దేవుడు మంద మలయ మారుతాలు విసురుతాడు, వరుణుడు చిరు జల్లులతో అభిషేకానికి సిద్ధమౌతాడు, అగ్నిహోత్రానికి సహకరిస్తాడు, అగ్ని హోత్రడు.  ఈ మార్గం అంతా సుగమమే కానీ కంటకాలు ఎదురవవు.  ఇంత చక్కని మార్గం విడిచిపెట్టి, మా మనుషులు ఐహిక బంధాల కోసం వెంపర్లాడుతూ వుంటారు.  నీ చల్లని కర స్పర్శ తో మా దారి మళ్ళించి, నీతోనే వుండేటట్లు అనుగ్రహించు, వ్యుప్తకేశా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు