*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౧౧ - 111)

 మత్తేభము:
*తనయంగాంచి ధనంబునుంచి దివిజా | స్థానంబుంగట్టించి వి*
*ప్రున కుద్వాహముచేసి, సత్కృతికి | పాత్రుండై, తటాకంబు నే*
*ర్పున ద్రవ్వించి, వనంబు పెట్టిమననీ | పోలేడు, నీ సేవ జే*
*సిన పుణ్యాత్ముడుపోవు లోకమునకున్ |  శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
కొడుకుల కోసం డబ్బు సపాయించినవారు, దేవాలయమును కట్టించినవారు, బ్రాహ్మణునికి పెళ్ళి చేసినారు,  చెరువులు తవ్వించినవారు, చెట్లు నాటించినవారు, వీళ్ళు అందరూ చేసినవి మంచి పనులే. ప్రజలకు మంచి చేసేవే. కానీ, ప్రతీ రోజూ నీ పూజలు చేసిన నీ భక్తులు పొందే నీ పొందును మాత్రం వారు పొందలేరు.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఈ ఐహిక ప్రపంచంలో, అనేకమైన మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా, ఆ కార్యక్రమాలు చేసినవారు నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు.  కానీ, ఈ పనులు ఏవీ కూడా మనల్ని పరమేశ్వరుని దగ్గరకు చేర్చ లేవు.  పరమేశ్వర సన్నిధికి చేరడానికి ఒకే ఒక్క తిన్ననైన మార్గం శాశ్వతంగా  నీ చరణారవింద సేవ. నిన్ను నమ్మిన వారు ఎంత చిన్న వారైనా, పెద్దవారైనా,  నీ పొందులో పొందే సుఖం ఒక్కటే.  వారికి వచ్చే ఆనందంతో చూసుకుంటే  ఈ భూమి మీద ఎన్ని పుణ్య కార్యాలు చేసినా సరితూగదు. నిన్ను మించినది ఏదీ లేదు కదా, నీలగ్రీవా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు