గుడ్మార్నింగ్ (333 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 జీవితంలో ప్రతీ మనిషి , ఎన్నో సార్లు- ఎన్నో సందర్భాల్లో, ఎందుకో ఒకందుకు, నిరాశా నిస్పృహలకు లోనవుతారు.
బాధపడతారు.దుఃఖిస్తారు.
'ఈ చదువులు నేను చదవలేను- ఈ ఉద్యోగం నేను చెయ్యలేను- ఈ వ్యాపారం నా వల్ల కాదు, ఈ పెంట రాజకీయాల్లో ఇమడలేను- ఈ పని నేను చెయ్యలేను- ఇదంతా నా వల్ల కాదు- ఈ భారం నేను మొయ్యలేను- ఈ కాపురం నేను చెయ్యలేను- అసలు ఈ బ్రతుకు నేను బ్రతుక లేను ' వంటి నిరాశా నిస్పృహల సమ్మిళిత బాధాకరమైన భావనలు మనసులోకి రాకుండా, మనిషి జీవితం తెల్లవారదు- తెల్లవారదూ అంటే'ముగియదు' అని అర్థం!
మనిషి జీవితంలో, సాటి మనుషుల వల్లనే ఎన్నో కష్టాలు ఇబ్బందులు కలుగుతాయి.ఇంటి నుండి బయట దాకా,మనం కలిసి మెలిసి జీవించవలసి వచ్చే , పని చెయ్యవలసి వచ్చే మనుషుల వల్లనే ,ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ మనుషులను వదిలేసి , ఎక్కడికీ పోవడానికి లేదాయే! మనిషి సంఘజీవి,ఒంటరిగా మనలేరు. 
సాటి మనుషుల వల్లనే కాకుండా, స్వీయ తప్పిదాల వల్ల కూడా ,కష్టాలు ఇబ్బందులు కలుగుతాయి.అంచనాలు సరిగా వేసుకోకపోవడం- నిర్లక్ష్యం చెయ్యడం- బాధ్యతలను గుర్తెరుగక పోవడం వగైరా కారణాల వల్ల, మనుషులు ఇబ్బందులు పడతారు.నిరాశలో మునుగుతారు.
అటువంటి కష్టకాలంలో- ఇబ్బందులు చుట్టుముట్టిన సమయంలో- మనిషికి నిరాశ నిస్పృహలు కలుగుతాయి. 
'ఇక నా వల్ల కాదు' అనుకుంటారు! 
మనిషి నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయినప్పుడు,అదే చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరో ఒకరు ,కుటుంబీకులో హితులో  స్నేహితులో ఆత్మీయులో దగ్గరకు వచ్చి ,కన్నీరు తుడుస్తారు,ఓదారుస్తారు, " ఇలా అయితే ఎలా? జీవితం ఇలాగే ఉంటుంది, ఎక్కడైనా మనుషులు ఇలాగే ఉంటారు,లోకంలో కోట్లాది మంది ఎలా బ్రతుకుతున్నారో చూడు-  మనం సర్దుకుని పోవాలి.అవసరం అయితే, ఎదిరించాలి,పోరాడాలి,సాధించాలి, అంతే కానీ, ఇలా నిరాశ పడితే ఎలా ? నేను ఉన్నాను" అంటూ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించే హితవచనాలు పలుకుతారు! 
మహాభారత యుద్ధంలో , అర్జునుడు 'ఈ యుద్ధం నేను చెయ్యలేను' అని , అస్త్రసన్యాసం చేసి , చేతులు ఎత్తేసినప్పుడు,అతని రథసారథీ - బావా అయిన శ్రీకృష్ణుడు కూడా, అర్జునునికి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించే మాటలు చెప్పాడు.తిరిగి యుద్దోన్ముఖున్ని చేసాడు.అదంతా ' భగవద్గీత' గా ప్రచారంలో ఉంది. 
సంగ్రామాల్లోనే కాదు,జీవనసంగ్రామాల్లో కూడా ,మనిషి నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు , ఎక్కడికక్కడ శ్రీకృష్ణయ్యలు శ్రీకృష్ణమ్మలు ఉంటారు.
విచిత్రమైన విషయం ఏమిటంటే? ఒకరికి ధైర్యాన్ని నూరిపోసిన వారు కూడా, మరొకప్పుడు నిరాశలో మునుగుతారు.ఒకప్పుడు నిరాశలో మునిగి తేలినవారు కూడా , తరువాత మరొకరికి ధైర్యాన్ని నూరి పోస్తారు.
జీవనసంగ్రామంలో , మనిషి ఒకసారి అర్జున పాత్రను ధరించవలసి వస్తుంది, అలాగే మరొకప్పుడు శ్రీకృష్ణ పాత్రనూ ధరించవలసి వస్తుంది.
అందరూ ఇలాగే ఉంటారా అంటే? కొందరు అసహాయ శూరయ్యలు శూరమ్మలు ఉంటారు.అయితే, వారు నిరాశ నిస్పృహలకు లోనవరా అంటే? లోనవుతారు.కానీ, వారికి ఎవరి సపోర్ట్ అవసరం పడదు.మరెలా? వారికి వారే ధైర్యాన్ని ఇచ్చుకుంటారు.
ప్రతీ మనిషిలో కూడా , ఓ శ్రీకృష్ణ అంశ ఉంటుంది. దాన్ని గుర్తించాలి.ఇక ఆ మనిషికి 'చావు' లేదు!

కామెంట్‌లు