గుర్తుకొస్తున్నాయి--సందర్భం:- ఉపాద్యాయ దినోత్సవం:- --సత్యవాణి కుంటముక్కుల కాకినాడ-5 86 39 66 05 66

     ఉపాద్యాయుడు అనగానే  మొదటగా గుర్తుకొచ్చేది మా సూర్రావు మాష్టారే. 
         నేను చదువుకొన్నది మా రౌతులపూడిలో ,ఆనాడుగల మూడు బడులలో, అడ్డాలనారయ్యగారి ఇఃటికి ఎదురుగా,కిలాడి చిన్న ఇంటికీ,కాకులమర్రి నరసింహారావుగారి ఇంటికీ మధ్యలోగల పెద్దబడిలో.
       మాబడిలో సూర్రావు మష్టారూ,వీరాచార్యుల మాష్టారు,తాతయ్య మష్టారూ వుడేవారు.తరువాత కొన్నాళ్ళకు సాయిబు మష్టారు వచ్చేరు కానీ ఎక్కువరోజులు లేరు.
       మా సూర్రావు మాష్టారు పిల్లలెవరైనా బడికి రావడానికి పేచీలు పెడితే,'కాకాకూకాయ్' ఆనే కోవట్ల అబ్బాయికి, మరొక అబ్బాయిని  జతగా పంపిస్తే,వాళ్ళిద్దరూ కలిసి,"గంజీ కావిడి-గుడగుడ ముంతా-అవ్వా అప్పచ్ఛి "అంటూ,ఇద్దరూ చేతులూ నిచ్చెనలా కలిపి ,ఆచేతులమీదకి ఆ ఏడ్చే పిల్లను ఎక్కిఃచుకొని తీసికెళ్ళి బడిలో పడేసేవారు.బడిలోకెళ్ళడానికి పేచీపెట్టే పిల్లల్ని "అడుగో కాకా కూకాయ్ వస్తున్నాడు"అఃటేచాలు, పేచీలు మానేసి టక్కున బడికి పరుగులు తీసేవారుపిల్లలు.
మీకందరికీ' కాకాకూకాయ్ 'అనేపేరేమిటని అనుమానం వస్తోందికదా!
ఎందుకంటే అతనికి 'క'అక్షరం మాత్రమే పలుకుతుంది.మొత్తం సంభాషణంతా 'కా'తోనే చేసేవాడతడు.భలే తమాషాగావుండేది ఆభాష..
      మా సూర్రావు మష్టారు అక్షరాలను గచ్చునేలపైన ఇసుకను పోయించి,ఆ ఇసుకలో వేలుపెట్టి దిద్దించేవారు.వేలు మండినా,అక్షరాలు తొందరగా వచ్చేవి.
      అప్పటికి అంటే 1950-55లమధ్యన స్వతంత్ర్యం వచ్చి ఎక్కువకాలం కాకపోవడంవలన అనుకొంటాను ,మా మాష్టర్లలో దేశభక్తి అధికంగా వుండేది.అందుకనే మాకు మా సూర్రావు మాష్టారు
పాఠాలు చెప్పడంకన్నా,దేశభక్తి గేయాలూ,స్వాతంత్ర్యవీరులకథలూ ఎక్కువగా చెపుతుండేవారు. ఆయన గొంతెత్తి పద్యాలు పాడడం ఒక ప్రత్యేక ఆకర్షణ మా పిల్లలకి.బహుశా నాకు పద్యమంటే ఇష్టం అప్పుడే ఏర్పడివుంటుంది.
      తాతయిలు మాష్టరు పాఠాలు ఏమిచెప్పేవారో గుర్తు లేదుగానీ,బాలగేయాలు భలే ఏక్షన్ చేస్తూ చప్పేవారు. "కుక్కకి మాంసము దొరికినదీ ,కాకికి దాహం వేసినదీ ఇలాంటివే ఎన్నెన్నో చెప్పేవారు.ఆయనకుగల  నారింజకాయంత జుట్టుముడీ,అది అస్తమానూ ఊడిపోవడం,ఆ జుట్టును ఆయన దులిపి ముడివేసుకోవడం, నామసుద్దతో పెట్టుకొన్న 'నూట పదకొండు'అదే పంగనామాలూ, నాకింకా గుర్తే.మాతాతయిలు మాష్టారు నోటిలెక్కలు కూడా చాలా అడిగేవారు.అవెలాటివంటే,"ఒక చెట్టుపైన పది కాకులున్నాయి.ఒక వేటగాడొచ్చి ఒక కాకిని తుపాకీతో పేల్చేడు.ఇంకా ఎన్ని కాకులుంటాయి?"అని అడిగితే ,"ఓస్!ఈమాత్రం లెక్కకు ఆన్సర్ చెప్పలేమా అని ధీమాగా అనుకొని,"తొమ్మిదీ,తొమ్మిదీ ,తొమ్మిదీ,అంటూ కాకుల మూకల్లా అరచి చెప్పేవాళ్ళం.ఆమందలో మరీ తెలివైన వాడు ఎవరైనా ,ఎనిమిది అనో,ఐదనో చెప్పినా ఎవరికిమాత్రం వినిపిస్తుందికనుక.
      అయితే మాష్టారు "తప్పు తప్పు"అని గట్టిగా గర్జిస్తే ,"అదేమిటి?పదిలోంచి ఒక కాకి చస్తే తొమ్మిదేకదా మరి!తప్పంటారేమిటీ?"అని బుర్రలు బరబరా గోక్కుటుంటే,"ఓరి బడుద్దాయిల్లారా!తుపాకీ చప్పుడుకి మిగిలిన కాకులన్నీ ఎగిరిపోతాయర్రా!అంటూ నవ్వుతూ చెప్పేవారు. ఇలాంటివే తమాషా లెక్కలెన్నెన్నో అడిగేవారు.అన్నీ నోటిలెక్కలే.అవును మరి ,మారోజుల్లో ఐదవతరగతికి వచ్చేవరకూ,పలకలపైనే చదవులూ-రాతలూ. 
    మా తాతైలు మష్టారికి, బడిపైనా,విద్యార్థలపైనా ఎంత అభిమానమంటే,రిటైర్ అయిపోయినా చాలా ఏళ్ళవరకూ సమయానికి వచ్చి ,గేయాలూ ,లెక్కలూ చెప్పి వేళ్ళిపోయేవారు.
      వీరాచారి మాష్టారు ఎందుకనో పెద్దగా మాపిల్లలను ఆకట్టుకోలేదుగానీ,ఆయన ఆప్పుడప్పుడు పెట్టే శొంటిక్కలుమాత్రం ఇప్పటికీ గుర్తున్నాయి.
     నాలుగైదు తరగతులకు వచ్చే సాయిబుమాష్టారు పాఠాలైపోయాకా, సినీమా పత్రికలు చూపించి,సినీమా కథలు చెప్పడం ,ఆకథలు ఇప్పటికీ నాకు గుర్తుండడం ఒక విషేషం.ఆ సినీమా పుస్తకాలలో ఫోటోలుతోసహా మొత్తంగా సినీమాకథంతా వుండేది.
      ఇక  ఆగష్టు పదహేను, స్వాతంత్ర్యదినాన,జనవరి ఇరవై ఆరు, గణతంత్ర దినానా,జండాలు పట్టుకొని,ఊరమ్మట, ఉపాద్యాయులూ,విద్యార్థులం ఊరేగే టప్పుడు,మా సూర్రావు మాష్టారు "బోలో !స్వతంత్ర్యభారతికీ అంటుంటే,మేమంతా ,"పోలో స్వతంత్ర్య భారతికీ"అంటూడడం నాకింకా గుర్తుంది.
     ఈ ఉపాద్యాయ దనోత్సవం సందర్భంగా, విద్యార్థులను కన్న పిల్లలుకన్నామిన్నగా భావించి,వారి ఉన్నతిని కోరే ఉపాద్యాయులకు,  నా ఈనాటి 'గుర్తుకొస్తున్నాయి'అంకితమిస్తూ,వారందరినీ గుర్తు తెచ్చుకొంటూ ,వారికి తలవంచి నమస్కరిస్తూ🙏🏻
                 
కామెంట్‌లు