నాకే తెలియని నేను....: - ప్రమోద్ ఆవంచ 7013272452

 నాలో నన్ను చూసుకుంటే నాకే తెలియని 
నన్ను నేను కలుసుకుంటాను.
లోతుల్లోకి వెళ్ళే దారులన్నీ అర్థం లేని 
ఆటంకాలు అవుతున్నాయి.
చినుకు రాలి వేడి పుడుతుంది,ఆ ఒంటరి ప్రయాణం
చలిలో ఉడికిపోతుంది.
శ్వాసలన్నీ ఆవిరిలై కళ్ళను కప్పేస్తాయి
ఏదో ఉప్పెన వస్తుందన్న భావన గుండెను దాటేందుకు
సిద్దంగా వుంటుంది.
అప్పుడప్పుడు గుండె చప్పుళ్ళు భయంతో నన్ను
విడిచి దూరంగా పరుగులు పెడుతాయి.
మస్తిష్కం కుదురుగా ఒకచోట వుండదు,వేల కోట్ల
ఆలోచనలను కళ్ళకు సినిమాలా చూపిస్తుంది.
ఎందుకూ పనికిరాని వ్యర్థమంతా ముందు
వరుసలో వుంటుంది
అదేంటో ముందుగా నాకొచ్చేవి వ్యతిరేక ఆలోచనలే.
ఏదో ధైర్యం, వాటినన్నిటినీ చెత్త బుట్టలో తోసే నిరంతర
ప్రక్రియలో నిమగ్నమై వుంటుంది.
లేకపోతే జీవితం ముందుకు సాగదనే లౌక్యం కొంచెం
వుంది.
అందరితో కలిసి నడవాలనేది లోకం తీరు.నీకిష్టం 
లేకపోయినా తప్పదంటుంది సమాజం.
తప్పని తెలిసి చెప్పినా తప్పే!
ఒప్పని తెలిసి కూడా చెప్పలేని ఆ నలుగురు
నీ చుట్టే.
దొరకని సమాధానాల కోసం ఆకాశం వైపు నీ చూపు
ఓ ప్రశ్నార్థకం!
                         
కామెంట్‌లు