తాపీ ధర్మారావు ప్రమోద్ ఆవంచ 7013272452

 బాగా నెరిసిన గడ్డం, జుట్టు బాగా పెరిగి జుల పాలూగా పెంచుకొని ఒక వ్యక్తి, మద్రాస్ నగరంలో లవకుశ చిత్రం
ప్రదర్శించే ప్రివ్యూ థియేటర్ దగ్గరకు వెళ్ళాడు.ఆ చిత్రం నిర్మాతలు, ఆహ్వాన పత్రిక చూపించిన వాళ్ళనే లోపలికి అనుమతించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.హాలు లోపలికి వెళ్ళబోయిన ఆయనను సిబ్బంది అడ్డుకున్నారు‌.ఇన్విటేషన్ లేనిదే లోపలికి పంపడం కుదరదనీ నిక్కచ్చిగా చెప్పారు‌.నాకు కార్డు
ఎందుకు బాబూ,నేనెవరో తెలుసా? అన్నాడాయన.
మీరెవరైనా సరే సార్ కార్డు లేనిదే లోపలికి పంపం అని తేల్చేసారు సిబ్బంది.ఆ వ్యక్తి అసహనంతో,ఈ లవకుశ రాసిన మహాకవి వాల్మీకి కే ప్రవేశం లేదంటావా అంటూ గడ్డం నిమురుకుంటూ, స్వరం పెంచారు.దాంతో కంగారు పడ్డ సిబ్బంది,క్షమించమని వేడుకుంటూ, తీసుకెళ్లి బాల్కనీ లో కూర్చోబెట్టారు.ఆ వ్యక్తి ఎవరో కాదు ఆధునికాంధ్ర సాహితీ రంగంలో జాతిని జాగృతం చేసిన వైతాళికుడు శ్రీ తాపీ ధర్మారావు గారు.
                       తాపీ ధర్మారావు గారు 1887 సంవత్సరంలో, సెప్టెంబర్ 19 న ఒరిస్సా లోని బరంపురంలో జన్మించారు.నాన్న అప్పన్న నాయుడు,అమ్మ నరసమ్మ.నాన్న అప్పట్లోనే ప్రభుత్వ డాక్టర్.తాపీ ధర్మారావు గారి బాల్యం అంతా శ్రీకాకుళం లోనే గడిచింది.శ్రీకాకుళంలో ప్రాధమిక విద్య పూర్తి కాగానే ఆయన విజయనగరంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసారు.మద్రాస్ పచ్చయ్యప్ప కళాశాలలో బి.ఏ.పట్టబద్రులైయ్యారు.
                       ఆయన చిన్నతనంలో చదరంగం బాగా ఆడే వారు,గుర్రపు స్వారీ బాగా చేసేవారు.ఆయనకు చిన్నప్పటి నుంచి తెలుగు సాహిత్యం పై మక్కువ ఎక్కువ.అప్పన్న నాయుడు గారికి కొడుకుకి ఇంగ్లీష్ భాష నేర్పించి, ప్రభుత్వోద్యోగంలో చేర్పించాలని కోరిక.
కానీ ప్రభుత్వోద్యోగంలో స్వేచ్ఛ వుండదని భావించిన ధర్మారావు గారు బరంపురంలోని కళ్ళికోట రాజా కళాశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా చేరారు.
                       తాపీ ధర్మారావు గారు 1911 సంవత్సరంలో 'ఆంధ్రులకోకమనవి' అనే వ్యాసం రాసారు
అదే ఆయన తొలి వచన రచన.అదే సంవత్సరంలో తన స్నేహితులతో కలిసి వేగుచుక్క అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థలో విజ్ఞానదాయకమైన గ్రంధాలను ప్రచురించడమే లక్ష్యం.ఆయన తెలుంగనెడుకాంత
పేరుతో ఆంధ్ర వాజ్మయ చరిత్రను,ఉషః కాలం, క్రొవ్వు రాళ్ళు మొదలైన నవలలు రాసారు.ఆ తరువాత విశాఖపట్నం వచ్చాక 'కొండెగాడు' అనే పత్రికను స్థాపించారు.ఈ పత్రిక ద్వారా తాపీ ధర్మారావు గారు చాలా మంది రచనలను విమర్శించారు.దానితో ఆయన అప్పటి కలెక్టర్ వెర్నాన్ దృష్టిలో పడ్డారు.న్యూయింగ్ టన్ కళాశాలలో ట్యూటర్ పోస్టుకు  తాపీ ధర్మారావు గారి పేరు సిఫార్సు చేయబడింది.1918 వ సంవత్సరం నుంచి 16 సంవత్సరాల పాటు అనేక మంది సంస్థానాధీశులకు ట్యూటర్ గా ఉన్నారు.
విజయనగరంలో సంవత్సరం పాటు ట్యుటోరియల్ కాలేజీ నడిపారు‌.బొబ్బిలికి దివాన్ గా పనిచేసారు.అప్పుడే జస్టిస్ పార్టీ పత్రిక సమదర్శిని కి ఎడిటర్ అయ్యారు.ఆ పత్రిక జస్టిస్ పార్టీదైనా దాని ద్వారా తాపీ ధర్మారావు జాతీయ భావాలను ప్రచారం చేసారు.ఆయన శుద్ధ గ్రాంధిక వాది.అప్పట్లో ఆయన గిడుగు రామమూర్తి గారి వ్యావహారిక భాషా వాదాన్ని ఎదుర్కొన్నారు.తదుపరి తాపీ ధర్మారావు గారు వ్యావహారిక భాషా వాదిగా మారి, కొత్తపాళీ పేరుతో భాషావిషయిక వ్యాసాలు రాశారు.
                     1936 వ సంవత్సరంలో పిఠాపురం రాజా వారు స్థాపించిన తెలుగు పత్రిక జనవాణి కి తాపీ ధర్మారావు గారు సంపాదకత్వం వహించారు.1940 సంవత్సరంలో తన స్వంతంగా కాగడా అనే పత్రికను స్థాపించి కొన్నేళ్ల పాటు నడిపారు.
                     తాపీ ధర్మారావు గారి సాహిత్య సేవ మాటల్లో చెప్పలేనిది.ఆయన పాతపాళీ, ఆంధ్ర తేజం, మబ్బు తెరలు,రాగిడబ్బ,ద్యోయానం,కావ్యాలతో పాటు,విలాసార్జునీయం,అవన్నీ నీ కళ్ళేనా,తప్తాశ్రుకణం, నాటకాలు, కొత్త పాళీ, ఆలిండియా అడుక్కు తినే వాళ్ళ మహాసభ, సాహిత్య మొర్మరాలు, మొదలైన వ్యాసాలు,దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, పెళ్లి-దాని పుట్టుపూర్వోత్తరాలు, పరిశోధనా గ్రంథాలు, పారిజాతపహరణం-భావ ప్రకాశిక,విజయవిలాసం,హృదయోల్లాసం, వ్యాఖ్యలు రచించారు.ఆయన రచించిన రాళ్ళు రప్పలు అముద్రితంగానే మిగిలిపోయింది.
                     తెలుగు సినిమా స్క్రిప్ట్ కు రూప కల్పన చేసిన వారిలో అగ్రగణ్యుడు తాపీ ధర్మారావు గారు.ఆయన చాలా సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలకు సంభాషణలు రాసారు.అందులో మాలపిల్ల, ఇల్లాలు,ద్రోహి, రైతుబిడ్డ, దీక్ష, పల్లెటూరి పిల్ల,మాయలమారి, కీలు గుర్రం లతో పాటు ఆయన దాదాపు 40 చిత్రాలకు స్క్రిప్టు రాసారు.
                     1971 వ సంవత్సరంలో ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.తాను రచించిన విజయ విలాసం అనే వ్యాఖ్య కు ఈ బహుమతి పొందారు.
                     హేతువాది, నాస్తికుడు, మంచి విమర్శకుడు, గొప్ప పండితుడు అయిన తాపీ ధర్మారావు గారు 1973 మే 5 వ తేదీన  తుది శ్వాస వదిలారు 
                    
( సెప్టెంబర్ 19 వ తేదీ తాపీ ధర్మారావు గారి జయంతి)
                                          

కామెంట్‌లు