*గణపయ్యతొండముతో దీవించు*( వ్యంగ్యస్య వచన కవిత ):-*"రసస్రవంతి" 7075505464**" కావ్యసుధ " 9247313488* హైదరాబాద్
 వినాయక నీ రాక తప్పదు
కానీ జాగ్రత్త సుమా !
మా నగరాలకు వస్తున్నవు
వానలు దంచి కొడుతున్నవి 
ప్రాజెక్టులు నిండి జలకళతో                               
 కళకళలాడుతున్నవి 
చెరువులు తెగిపోయి పారుతున్నవి 
డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నవి 
నీవు అసలే స్థూలకాయుడవు 
మ్యాన్ హోళ్ల మూతలు
తెరిచి ఉన్నాయి....
కాలు జారి పడ్డావంటే
సమయానికి నిన్ను
పైకి  తీసే వారుండరు....
కాస్త చూసి నడువు.....
మ్యాన్ హోళ్ల మూతలు
తెరిచి ఉంటాయి.....
కాలువలలోని మురికి నీరు
మా నగరమంతా పారుతుంది
అయినా నీ రాక తప్పదంటే !
నీ ఇష్టం పడతావు నీవే కష్టం
మా నగరానికి వచ్చేటప్పుడు                     
 కాస్త జాగ్రత్త సుమా....
వర్షంలో తడిస్తే జలుబు చేస్తే
నీవు తట్టుకోవడం కష్టం
మాకైతే సన్నని ముక్కులు                      
ఎన్నిసార్లు ఛీదిన ఛీదుతాము
మరి నీ తొండముతో నీకు ఇబ్బందే.!
        ***     ***     ***
బతుకు తెరువు కోసం
జానెడు పొట్ట కోసం
నీ బొమ్మల తయారీ వల్ల
ఎంతోమంది బ్రతుకుతున్నారు
అబ్బో ఇది నీ గొప్పే గణపయ్య
         ***        ***     ***
ఉండ్రాళ్ళకు తృప్తిపడి తిని
వెళ్ళిపోతావు నువ్వు మరి                                                          
నీ పేర లడ్డు ప్రసాదం తయారు చేసి
వేలం వేసి, లక్షలు                         
 సంపాదిస్తున్నారు
నీ ఉత్సవాలకు
ఖర్చు పెట్టిన డబ్బు కంటే
పది రెట్లు ఎక్కువ గానే
సంపాదిస్తున్నరు                   
నీకు తెలువదు గణపయ్య
నువ్వు వొట్టి అమాయకుడు                                                   
మానవుల తెలివి అంటే ఇదే !
నీ లడ్డు అమ్మి డబ్బు
కూడ పెడుతున్నరు..
అయినా ఇదంతా
నీకెందుకులే గణపయ్య....
వచ్చిన వాడివేదో వచ్చావు.
మా నాయకులు
బూతులు మాట్లాడుతున్నరు
చాటల్లాంటి నీ చెవులకు
సోకకుండా చూసుకో......                                                                        
మా నాయకులకు సద్బుద్ధి
ప్రసాదించి                                  
మంచి మార్గంలో నడిపించు....
మదమెక్కిన నాయకులను                                 
 మాత్రం దండముతో దండించు
కరోనా మహమ్మారిని కట్టిపడేసి
విష జ్వరాలను దూరంచేసి  
ప్రజలకు సుఖసంపదల నిచ్చి
దండి మనసుతో.......నీ                                                                                 
తొండముతో దీవించు....
 (వినాయక చవితి శుభాకాంక్షలతో )


కామెంట్‌లు