ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం-871 297 1999

 మీరు ఎన్నన్న జెప్పుండ్రి
సిన్నతనంల సేసిన సోపతులు 
పెద్దగ అయినంక  గుడ 
గట్లనే  సెక్కు సెదర కుంట ఉండుడు 
ఉత్తుత్త ముచ్చట గాదుల్లా!
గట్ల నాకున్న సోపతి గాళ్ళల్ల
ఎస్.దేవయ్య ఒకడు.
గీ పోటువల
నా పక్కన లుంగి గట్టుకొని కూసున్నది గాఎస్.దేవయ్యనే.
మా సోపతి ఇప్పటిది గాదు;
ముప్పై యేండ్ల నాటిది.
సిన్నప్పుడు యెట్లున్నమో
గిప్పుడు గుడ గట్లనే
కలిసి మెలిసి ఉంటున్నముల్లా!
ఇన్ని యేండ్లల్ల
ఒక్క సారి గుడ
సిన్న మాట అనుకున్నది లేదు
అతను నా కన్న కొంచెం
పెద్దనే గని నన్ను "అన్నా "అని
మనసు నిండేటట్టు పిలుత్తడు.
నేను కుడుక "అన్నా" అనే అంట.  గిప్పటికి గుడ
గిసొంటి సోపతులు
గీ కాలంల సుత ఉండుడు
ఉత్త మాటలు కాదు
గీ అన్న పెండ్లి సిన్నప్పుడే అయింది.గా పెండ్లి నాడు
సిన్న పోర గాండ్లం కలిసి
చిరుతల రామాయణము బాగోతం ఆడినం
దాంట్ల  రాముని ఏశం 
కొంపల్లి నర్సయ్య,
నేను లక్ష్మణుని ఏశం ఏసినం. 
ఎస్.దేవయ్య గుడ మందర ఏశం కట్టిండు. అందరం సిన్న పోర గాండ్లమే. 
మాకు నాటకం నేర్పింది 
గౌండ్ల శంకరయ్య పంతులు.
పెద్దోళ్ళ లచ్చయ్య ఇంట్ల
నాటకం నేర్సుకునే టోల్లం.
గిప్పుడు గా ముచ్చట్లు 
యాది కత్తే నవ్వత్తది,
బాద గుడ అనిపిత్తది.
ఆడుకుంట, పాడుకుంట
సదువులు గుడ 
సదువుకునేటోల్లం.
కులాన్ని జూసో
పైసలను జూసో,
బూమి, జాగలను జూసో,
గప్పటి సోపతులు  ఉండేటివి కాదుల్లా!
నేను మొన్న మా ఊరు పోయినప్పుడు
నేను పట్నం నుండి అచ్చిన్నని
తెల్వంగనే నా కోసం నా దగ్గరికి అచ్చిండు.
ఆగో గప్పుడు  మాట్లాడుకుంట,
చాయ తాగుకుంట 
సిన్నప్పటి ముచ్చట్లు వెట్టుకుంట
పోటువ దిగినం. గదే గిదుల్లా!
మనం ఎంత ఎదిగినా,
మనం ఎక్కడ ఉన్నా
మనం ముసలోల్లమైనా
మల్ల సిన్న పోర గాండ్లము కావాల్నంటే
అప్పుడప్పుడు సొంతూరుకు పోయి రావాలే,
సిన్నప్పటి సోపతులను కలుసుకోవాలే!
ఔ మల్ల!

కామెంట్‌లు