ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 2971 999

 మా మల్లారం ల
నా సిన్నప్పుడు
ఊరంతటకి ఒకటే గణేశున్ని
అన్మండ్ల గుల్లే నిల వెట్టేటోల్లు
గీ గణపతి పండుక్కు
ఆరం, పద్దినాల దాకా
సిన్న పోర గాండ్లకు 
సంబురమే సంబురముల్లా!
ఎప్పుడు పొద్దూకుద్దా?
ఎప్పుడు ఎములాడ సాంబయ్య పంతులు
పూజ ఎప్పుడు జేత్తడా?
ఎప్పుడు పలారం పెడతారా?
అని ఎదురు సూసేటోల్లం.
పలారం దినుకుంట
ఉరికురికి పోయి
జెప్ప జెప్ప బువ్వ దిని
జోర తట్లు,సిన్న సాపలను వట్టుకొని ఆటలు ఎక్కడ ఆడుతరో అక్కడికి పోయేటోల్లం.
ఒగ సారి  
నర్సయ్య పటేల్ ఆకిట్ల గాని,
మసీద్ కాడ గాని 
ఆటలు ఆడేటోల్లు
తొమ్మిది గొట్టంగ ఆట సురువయ్యేది.
ముందుగాల బుడ్డర్ కాన్
అచ్చి మత్తు నవ్విచ్చుకుంట పాటల్ పాడే టోడు
బుడ్డర్ కాన్ టోపికి దారం తోని నిమ్మ కాయ కట్టుకునేటోడు
తలకాయ అటూ ఇటూ ఊపుతుంటే  నిమ్మ కాయ
గిర్ర గిర్రా తిరుగుతుంటే బగ్గ నవ్వచ్చేది.
కొద్ది సేపటికి ఆట మొదలయ్యేది.
గట్ల గణపతి నీళ్ళల్ల పడేదాక
ఏదో ఒక ఆట ఆడేటోల్లు.
ఆటంటే ఏ ఆట అనుకుంటుర్రు?
కబడ్డో,సిర్ర గోనెనో  కాదుల్లా! 
ఆటంటే నాటకమో,బాగోతమో అన్నట్టు.
పెద్దోళ్ళు నాటకాలు ఆడితే
సిన్న పోరగాండ్లం గుడ
బాగోతం ఆడేటోల్లం.
గిప్పుడు గా దినాలను
యాది జేసుకుంటుంటే
బగ్గ సంబురమయితది
గప్పుడున్న సంబురం గిప్పుడు లేదెందుకో మరి?
ఏది ఏమైనా 
పాత రోజులు,
పాత సోపతులు
పాత ముచ్చట్లు 
పాత బంగారం లెక్క
మంచిగుంటయ్
ఔ మల్ల!

కామెంట్‌లు