నా సిన్నప్పుడు
అరొక్క పని
నేర్సుకునే టోల్లం
మా నాన
"పనులు నేర్సుకొని ఉండాలే.
ఎప్పుడన్నా అవి పనికత్తయి" అని సెప్పెటోడు
నాకైతే ఇంట్ల పని,
ఎవుసం పని గుడ అచ్చు.
మా అవ్వ "తవ్వంత పిల్లుంటే
తల్లికాసర "అని అంటుండేది.
గా మాట నా మనసుల నాటుక పోయింది
గందుకనే మా అవ్వకు
పనిల ఆసర అయ్యేటోన్ని
బడికి పోయచ్చి నంక
మాపటి జాములకు
పనికోయి మా అవ్వ అచ్చెటాల్లకు
ఇల్లు,ఆకిలి ఊడ్సి
సిన్న బాసండ్ల
సోల నన్నా,
సోలకు కొద్దిగ ఎక్కువ నన్నా
బియ్యం బోసి
నీళ్ళ తోని
రెండు మలుకల కడిగి
కుడి సేతి నడిమి ఏలు నడిమి గీట్ల కాడికి నీళ్ళు వోసి
అట్టెసరు వెట్టే టోన్ని.
కట్టెలను పొయి నిండ వెట్టి
గాంచు నూనె వోసి
అగ్గంటు వెట్టి పొగ వోయినంక
బియ్యం బాసనను
పొయి మీద వెట్టెటోన్ని.
ఒగో సారి
అట్టెసరు కాకుంట
కలి తోని బువ్వ అండేటోన్ని
బువ్వ పలుకు మీద ఉండంగనే
మండే కట్టెలను బైటికి గుంజి
సిబ్బి తోని గంజి అంపి
నిప్పుల మీదనే కొద్ది సేపు ఉంచితే బువ్వ ఉడికేది.
ఎప్పుడన్నా
పొయిలమంట మంచిగ
పెట్టక పోయినా,
తెడ్డుతో సరిగ్గ
కలుపక పోయినా
బువ్వ నానువాలు పడేది.
గా బువ్వను జూసి
మా అవ్వ తిట్టకుంట "మంట సరిగ పెట్టాలే బిడ్డా" అని అనేది అంతే!
పోంగ పోంగా
బతికిన కొడుకును
కావట్టికే నన్ను గావురంగ
జూసుకునేటోల్లు.
నేను ఏం జేసినా
తిట్టేటోల్లు కాదు,
కొట్టేటోల్లు గాదు.
నేను ఏది కావాల్నన్నా
తెచ్చిచ్చేటోల్లు.
నేను కండ్లు తెరిచినప్పటి నుంచి
నిజంగా నన్నొక రాజోలనే
పెంచుకున్నరు,
గట్లనే సూసుకున్నరు.
ఆళ్ళకు
కొడుకుగా పుట్టినందుకు
నేను గుడ
ఆల్లు కండ్లు మూసేంత వరకు
అయ్యవ్వ సేవ జేసుకున్న,
నా పానం లెక్కనే సూసుకున్న.
నాకు దేవుండ్లు అంటే
మా అవ్వ నానలే నుల్లా!
ఈ భూమ్మీద అవ్వ నానలను
మించిన దేవుండ్లు లేనే లేరు!
ఔ మల్ల!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి