ఉపాధ్యాయ దినోత్సవం (905, 906, ):-ఎం. వి. ఉమాదేవి
భుజం తట్టె చేతులు భువిని మహిమ చేతులు 
గురువు గారివి చాల గొప్పవైన చేతులు 

అక్షరం తొ వెలుగులు అద్భుతమ్ము  మాటలు 
చింత దీర్చు పదములు చిన్న నాటి యూసులు 

చదువు చెప్పు స్వరము చాటు  సిరుల మూటలు 
సాధనలోని వింతలు సారవంత  మేధలు 

జీవ గంధము పంచు భావ  పరిమళమ్ములు 
అభయ మిచ్చు అంకెలు అవి గురు మది లంకెలు

ప్రశ్న నేర్పు యూహలు ప్రగతి దిద్దు బాటలు 
తప్పు లెన్నొ కాయుచు ఒప్పు తెలుపు దారులు 

తేట తెలుగు పదములు నేటి కిన్ని గురుతులు 
చెదిరి పోని నవ్వులు చిన్న చిన్న శిక్షలు 

కన్నబిడ్డల వలే కాచు గురువు ప్రేమలు 
పాఠములను పరిచయం పరిసరాల వేదిక 

విపులమైన వివరణ విషయములను సవరణ 
వినోదం పంచుతూ విజయమందు సూచన!!

తిమిర మందు వెలుగులు తీక్షణమ్ము వాక్కులు 
సరళ భాషను సాగు సాధనామృత వీణలు 

పునశ్చరణ తరగతి పుణ్యమగు పురోగతి 
ముఖము వెలుగు వాణిగ ముఖ్యమైన ప్రశ్నలు 

పెరిగి పెద్దయి నారు పేరు మరువని వారు 
గురువు తలపె హాయిగ గువ్వలయ్యి మురవగ

పేరు పేరున తలచి పెట్టు దండమ్ము లను 
గురువులకు వందనమ్ మరువలేని బంధము !!

కామెంట్‌లు