తీరని రుణం :---మచ్చరాజమౌళి-దుబ్బాక-9059637442
మరుగున పడుతున్న  మంచీ మానవత్వాన్ని 
సభ్యతా సంస్కారాల్ని వెలికితీసేవాడు
అంధకారంలో అలమటించేవారికి
జ్ఞానజ్యోతి వెలిగించేవాడు
సామర్థ్యం, సత్ప్రవర్తన సంపాదించుటకు సాయపడే సత్శీలుడు
శిలనైనా శిల్పంగా మార్చగల సమర్థుడతడు

అక్షరాలను తప్పురాస్తే దండించాడని ఆరోజు అనుకున్నా
అత్యున్నత శిఖరాలకు 
అదే సోపానమవుతుందని అనుకోలేదు

జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే
ప్రయోజకుడిగా తీర్చిదిద్దేది మాత్రం గురువే
వారిచ్చిన జ్ఞానానికి  
మాటలెన్నైనా సరిపోవు పొగడడానికి 

చినుకు నేలను ముద్దాడుతున్నప్పుడు
భూమి పొరలు పులకించినట్లు
గాలి ఈలవేస్తూ నేల తాకుతున్నప్పుడు
పంట పొలాలన్ని పచ్చదనంతో పరవశమొందినట్లు
గురువు గుర్తొచ్చినపుడల్లా
గుండె నిండా మమకార భావం వెలిగిపోతుంది

పాఠాలే కాదు, మాస్టారు
జీవిత పాఠాలూ నేర్పారు
ఏమిచ్చి తీర్చుకోను ఋణం 
శిరసువంచి నమస్కరించడం తప్ప... 


కామెంట్‌లు