మరయంత్రమవుతున్న మనిషి ||:-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442

కాలం రెండువైపులా కత్తులను మొలిపించుకుంది
బ్రతకలేని రోజులు కల్పించింది
బ్రతుకు దారి చూపించింది

పరుగులు పెడుతున్న కాలంలో
బంధాలు, అనుబంధాలను దూరంగా నెట్టేసి
అరచేతిలోకి మారిన చరవాణి
మారుతున్న టెక్నాలజీని వాడుకుని 
మానవ సంబంధాలను మలినం చేస్తోంది

కుచించుకుపోతున్న మనసులతో  
నిన్నటి ప్రేమలన్నీ నిర్వీర్యమవుతున్నాయి
ఆలింగనాలకు ఆత్మీయత కరువయ్యింది  
మనసు, మనసుతో మాట్లాడడం మానేసింది
ఇప్పుడు దేహాలు మాత్రమే మాట్లాడుకొంటున్నాయి

సమయం దొరుకని యాంత్రిక జీవనంలో
సంధిగ్ధంలోంచి పుడుతున్న సమస్యలెన్నో
మనిషిని ఒంటరిని చేస్తున్నాయి

కరిగిపోతున్న మనసును
ఇప్పుడైనా కాపాడుకోకపోతే
యంత్రంలా బ్రతుకుతున్న మనిషి 
గతకాలపు వైభవమై మిగులుతాడు.. 


కామెంట్‌లు