*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౯౧ - 91)

 శార్దూలము:
*ఊరూరం జనులెల్ల బిక్షమిడరో, | యుండంగుహల్గల్గవో*
*చీరానీకము వీధులం దొరకదో, | శీతామృతస్వచ్ఛవాః*
*పూరం బేరులం బారదో తపసులం | బ్రోవంగ నీ వోపవో*
*చేరంబోవుదురేల రాజుల జనుల్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....

నీవు పుట్టించిన మనుషులకు ఊరి వీధుల్లో బిక్షం దొరుకుతుంది కదా.  వుండడానికి తగిన చోటూ దొరుకుతుంది.  తాగడానికి, మంచి పంటలు పండించు కోవడానికి తియ్యని మంచినీరు కుంటలు, చెరువులు, కాల్వలలో దొరుకుతుంది.  తపస్సు చేసుకునే వారిని కాపాడడానికి నువ్వు ఎలాగూ వున్నావు. అయినా కూడా, ఈ మనుషులు  ఏమీ ఇవ్వలేని రాజుల వెంట బడతారు, ఎందుకనో......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*"నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ సఖుడౌ" అని మేము అడుగకముందే మాకు వలసిన వన్నీ నీవు అమర్చి పెట్టావు. కానీ, నీ మాయలో వున్న మాకు అవి తప్ప ఐహికమైనవి అన్నీ అవుపడుతున్నాయి, హరా! ఈ కర్మ చక్షువులతో నీచే సృష్టించబడిన పరమానంద కారకమైన పరమపదాన్ని గుర్తించలేక వున్నాము, పరంధామా! పరాత్పరా!  నీ మాయను నీవే తొలగించి, మమ్మల్ని నీ దగ్గరగా తీసుకో మా కన్న తండ్రి!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు