'కళ' నిలబడింది:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  ఆ రోజు పుస్తక ఆవిష్కరణ సభకు నేను శరత్ వెళ్ళాము.ఆ పుస్తకం ఒక నవల.ఆ నవలను గురించి వక్తలు ఎంతో చక్కగా మాట్లాడారు.కొన్ని హృదయంలో చొచ్చుకపోయే వాక్యాలను చదివి వినిపించారు.
       మరి ఇన్ని విషయాలు ఆ నవలను గురించి విన్నప్పుడు,అది చదవాలనిపించకుండా ఉంటుందా?
నేను ఏ పుస్తక ఆవిష్కరణ సభకు వెళ్ళినా అక్కడ ఆ పుస్తకం కొనడం నాకున్న మంచి అలవాటు.ఎందుకో అక్కడ పుస్తకం కొనకపోతే ఇక ఎప్పటికీ ఆపుస్తకం కొనలేమోనన్న భయం!
          సభ అయ్యాక పుస్తకాలను పేర్చి ఇరవై శాతం తక్కువ ధర తో ఆ నవల అమ్ముతున్నారు.
         ఆ నవల కొన్నాను,అలాగే నవల కవర్ పేజీ చూస్తుండి పోయాను,ఎందుకంటే నవల పేరు 'గుండెలోతుల్లో' ఆ పేరుకు తగ్గట్టే ముఖచిత్రం అత్యధ్బుతంగా ఉంది! ఆ చిత్రం లోని భావం,రంగుల కలయిక,లైనింగ్ ఒకటేమిటి చిత్రం అధ్బుతమే!
          "ఈ కవర్ పేజీ ఆర్ట్ చాలా బాగుంది,ఎవరీ ఆర్టిస్ట్ 'కళ'?" అని శరత్ కి కవర్ పేజీ చూపిస్తూ అడిగాను.
           "ఇతను ఈ ఊరిలోనే ఉన్నట్టు విన్నాను,కాని అంత ఫేమస్ కాదు, ఇతన్ని గురించి తెలుసుకోవాలంటే ఈ నవలా రచయితనే అడగాలి"
చెప్పాడు శరత్.
        "ఇతనిని కలవాలి,ఇంత మంచి ముఖ చిత్రం వేసిన ఆయనకు అభినందనలు చెప్పి,ఆయన వేసిన మిగతా చిత్రాలు కూడా చూస్తేగానీ నాకు తృప్తి లేదు.నాలోని చిత్రకారుడు మేల్కొన్నాడు,నాకు కూడా ఆర్ట్ మీద కొంత పట్టుంది ముఫ్ఫై వాటర్ కలర్ పెయింటింగులు,నలభై లైన్ డ్రాయింగ్లు వేసి ఉన్నాను!నాకు ఆర్ట్ మీద కొంత పట్టున్నా ఎందుకో 'కళ' గారిని గురించి నాకు తెలియ లేదు!
ఆయనను గురించి తెలుసుకోవాలని వేదిక నుండి దిగుతున్న ఆ నవలా రచయిత దగ్గరకు వెళ్ళి ,ఆయన నవల,మఖచిత్రాలను పొగిడి,ఈ 'కళ' గారు రాలేదా?"అని అడి గాను.
        "ఆయన మంచి ఆర్టిస్టండీ,ఆయన ఆరోగ్యం బాగలేదు,అందుకే సభకు రాలేదు ఆయన్ని ఆయన ప్రొమోట్ చేసుకో లేదు,అందుకే రావలసినంత గుర్తింపు రాలేదు.ఇంత మంచి ముఖ చిత్రం వేసినందుకు కొంత డబ్బు ఇచ్చాను"
        " మరి,ఆయన ఎక్కడ ఉంటారు?ఆయనను కలవచ్చా?నాకు ఆర్టంటే ఇంటరెస్టు"చెప్పాను.
        "తప్పకుండా కలవండి,మీకు చేతనైతే ఎంతో కొంత సహాయం చేయండి"అంటూ 'కళ' గారి అడ్రస్ ఇచ్చారు.
         ఆయనకు కృతజ్ఞతలు చెప్పి,శరత్ తో"'కళ'గారిని ఈ రోజే కలుద్దాము,అంత మంచి కళాకారుడు నాకు తెలియక పోవడం,నా దురదృష్టం" చెప్పాను.
          శరత్ కూడా 'కళ' గారిని కలవాలనే ఉత్సుకతను చూపించాడు.అంతే ఇద్దరం నా బైక్ మీదే 'కళ' గారింటికి వెళ్ళాము.
         ఆయన ఇల్లు సులభంగానే గుర్తు పట్టాం,ఇల్లు అనే దాని కంటే 'రేకుల షెడ్' అనడం సబబు.
         తలుపు సుతారంగా కొట్టాక మెల్లగా తలుపు తెరిచారు 'కళ' గారు.పెరిగిన గడ్డం,కళ్ళద్దాలు,కొంత మాసిన లాల్చీ తో ఆయన కళాత్మకంగానే ఉన్నారు!
       "సార్,మీరేనా కళ గారు?" అడిగాను.
       "అవును,మీరెవరు?"
       "సార్, ఈ రోజు నవల ఆవిష్కరణ సభకు వెళితే,నవల మీద మీరు అత్యధ్బుతంగా వేసిన చిత్రం చూసి మిమ్మల్ని కలవాలని వచ్చాం,మీరు ఏమీ అనుకోక పోతే, ఓ పది నిముషాలు మాట్లాడవచ్చా?"అడిగాను.
         ఆయన చిరునవ్వుతో లోపలికి రమ్మన్నారు.
        "మీరనుకొన్నంత గొప్ప ఆర్టిస్టును కాదు,ఏదో తృప్తి కోసం బొమ్మలు వేసుకుంటుంటాను,భుక్తి కోసం కొన్నాళ్ళు  ఆర్ట్ స్కూలు నడిపాను,ఆరోగ్యం సహకరించక అది కూడా నిలిపేశాను.ప్రస్తుతం నేను సంపాదించిన కొద్ది మొత్తం కూడా అయిపోయింది,ఏ రచయితో కవర్ పేజీ వేయించుకుని ఇచ్చే డబ్బుతో,కొందరు స్నేహితులు ఇచ్చే డబ్బుతో బతుకుతున్నాను"కళ్ళలో నీటి జీరతో చెప్పారు.
       గోడకు వెళ్ళాడుతున్న మూడు అధ్బుతమయిన పెయింటింగులు,గుండ్రంగా చుట్టి ఉన్న కాన్వాసులు,అక్కడక్కడా ఉన్న రఫ్ స్కెచ్ లుచూసే సరికి,ఆయన ఎన్నో చిత్రాలు వేసి దాచుకున్నట్లు అర్థం అయింది!
        "సార్, ఆ చిత్రాలు చూడవచ్చా?" గుండ్రంగా చుట్టిన కాన్వాసులను చూస్తూ అడిగాను.
         "చూడండి"అని తనే మెల్లగా విప్పి ఆ చిత్రాలు చూపించారు.నిజానికి ఒక్కొక్క కాన్వాసు ఒక్కొక్క కళాఖండం.ఆయన ఏ అమెరికాలోనో ఉంటే ఏ మ్యూజియం వాళ్ళో, ఏ ధనవంతుడో వాటిని ఎంతో డబ్బు పెట్టి కొని ఉండేవారు!
           "సార్,ఇంతమంచి పెయింటింగ్స్  వేశారు,వీటిని అమ్మితేమంచి డబ్బు వస్తుంది కదా,ఈ పెయింటింగులు మిమ్మల్ని ఆదుకునేవి"అన్నాను.
           "ఇవి నా బిడ్డలులాటివి,అమ్మదలచుకోలేదు!అది నా బలహీనత అనుకోండి"
          "సార్,అలా అనుకుంటే ఎలా?మీకింత కళ ఉండి,మీ గురించి ఎవ్వరికీ తెలియడం లేదు,కనీసం మీరు ఒక వన్ మాన్ షో పెట్టినట్లు లేదు!"నా సందేహం వెలి బుచ్చాను.
       "నేనంత గొప్ప వాడిని కాదేమో!"అని నేల కేసి చూస్తూ అన్నారు.ఆయన విలువ ఆయన తెలుసుకో లేక పోతున్నారని నాకు అర్థం అయింది.
         "సార్, నామాట వినండి,ఈ ఈ మారుమూల ఇంట్లో మీ కళ అంతరించి పోవడం నాకు ఎందుకో రుచించడం లేదు...మీరు అనుమతి ఇస్తే కనీసం పది పెయింటింగులు మేమే ఫ్రేమ్స్ కట్టించి,మన ఊరి టౌన్ హాలులో ఎగ్జిబిషన్ పెడతాము,మీ బిడ్డలలాటి పెయింటింగ్స్ ని మా బిడ్డల్లాగచూసు కుంటాము,నేను కెనరా బ్యాంకులో మేనేజర్ని,నా ఫ్రెండ్ శరత్ మునిసిపల్ ఆఫీసులో  ఆఫీసర్ గా పని చేస్తున్నాడు".
        కళ గారు కొంచెం సేపు కళ్ళు మూసుకుని ఆలోచించారు.తరువాత మెల్లగా"రేపు ఆలోచించి చెబుతా...మీరు చెబుతుంటే నాకు కూడా ఆశ కలుగుతోంది"అంటూ చెప్పారు.
       "మరి మీ ఫ్యామిలీ?"అడిగాను.
       "నా భార్య రెండేళ్ళ క్రితం పైకి వెళ్ళి పోయింది.ఉన్న ఒక్క కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియదు"అంటూ చెబుతుంటే ఆయన కళ్ళలో నీళ్ళు నిలిచాయి.
     ఇక ఆయన కుటుంబ విషయాలు అడగదలచుకోలేదు.
      పొద్దున్నే నేను,శరత్ 'కళ' గారింటికి పండ్లు తీసుక వెళ్ళాము.
     ఆయన కొంత నీరసంగా ఉన్నారు,మొదట ఈ అరటి పండు తినండి"అని పండు ఇచ్చాము.
     పండు తిన్న తరువాత ఆయన మేము చెప్పిన దానికి ఒప్ఫు కున్నారు.మేమే పది పెయింటింగ్స్ ఎంపిక చేసి చూపాము.
      మా చిరునామాలు,ఫోన్ నెంబర్లు అన్నీ ఆయన తన పుస్తకంలో వ్రాసు కున్నారు.పెయింటింగ్స్ తీసుకవెళ్ళి మా డబ్బుతోనే మంచి ఫ్రేమ్ కట్టించాము.
       ఓ ఆది వారం టౌన్ హాలులో 'కళ' గారి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాం.అంతకు ముందే మీడియా,ప్రెస్ కి ప్రదర్శన సమాచారం ఇచ్చాము.ఎలాగో ఆప్రదర్శనకు 'కళ' గారిని తీసుక వచ్చాం,మీడియా,ప్రెస్ వారు ఆయనను ఇంటర్యూ చేశారు.ఆయనకు అదొక అనుభూతి!
      నా ఆనందం నేను చెప్పలేను,ఎందుకంటే ఒక మరుగున పడిపోయిన కళాకారుణ్ణి వెలుగులోకి తెచ్చిన ఘనత నాది.
         మా ఊర్లో పెద్ద బంగారు షాపు ఓనర్ అరవింద్ జైన్ గారురెండు పెయింటింగులు లక్ష రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు.ఆ రెండు పెయింటింగులవైపు తనను విడిచి వెళ్ళి పోతున్న ఇద్దరు కూతుళ్ళను చూస్తున్నట్టు చూస్తూ కళ్ళలో నీళ్ళు నింపుకున్నారు.
        "సార్, వీటిని ప్రత్యేక టెక్నాలజీ ద్వారా కాపీ చేయించిమీకు ఇస్తాను,అవి మీరు వేసిన పెయింటింగ్స్ లాగే ఉంటాయి!మీరు అమ్మిన పెయింటింగ్స్ జైన్ గారి షాపులో ఎందరికో కనువిందు చేస్తుంటాయి,ఆయనిచ్చే డబ్బు మీవైద్యానికి,ఇతర అవసరాలకి ప్రస్తుతం సరిపోతుంది,రెగ్యులర్ గా మీ వద్దకు వచ్చి మాకు చేతనైన సహాయం చేస్తుంటాము"అని చెప్పాము.
       ఆయన కొంచెంసేపు ఆలోచించాడు,ఈ సారి ఆయన కళ్ళలో కాంతి కనబడింది.ఆయన పెయింటింగ్స్ చాలా మటుకు ప్రింట్లు తీయించాము.
     ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించ సాగింది.మరికొన్ని పెయింటింగ్స్ అమ్మిన డబ్బుతో ఆయనకు వైద్యం చేయించాము.
      ఒకరోజు ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది!నేను,శరత్ ఆయనను హాస్పిటల్లో చేర్చాము.ఆయనకు తెలిసిన కొంత మంది వచ్చి చూశారు.
         ఆయన ఊపిరి ఆగింది.మిగిలిన కాన్వాసులు తెల్లగా ఉండి పోయాయి!ఇక బ్రష్ లు కదల లేదు!
     మిగతా పెయింటింగ్స్ అమ్మి వేసి వాటి నకళ్ళను టౌన్ హాలులో అలంకరించాము.
       ఆయన పేరుతోఆర్ట్ కాంపిటీషన్స్ ప్రతి సంవత్సరం నిర్వహించి మంచి చిత్రకారునికి మెమెంటో,బహుమతి ఇవ్వసాగాం.
        ఆ విధంగా ఆ కళాకారుడి పేరు నిలబెట్టగలిగాం! అంతకన్నా ఏమి చెయ్యగలం?
=

కామెంట్‌లు