ఎక్కువ కోరకు!:-కంచనపల్లి వేంకట కృష్ణారావు.9348611445

    వీరానందానికి చిన్న వ్యాపారం ఉంది.అది బాగానే జరిగి నష్టాలు లేకుండా జీవితం సుఖంగా జరిగిపోతోంది. వీరానందానికి పక్క ఊరిలోని సదానందుడనే వ్యాపారం చేసే మిత్రుడు ఉన్నాడు.అతనికి మంచి భవంతి విపరీతమైన డబ్బు ఉంది.అతన్ని చూసినప్పటినుండివీరానందానికి విపరీతంగా డబ్బు సంపాదించాలనే ఆశ పెరిగి పోయింది.
      "సదానందా నేను కూడా బాగా డబ్బు సంపాదించాలను కొంటున్నాను దీనికి నీ సలహా కావాలి" అన్నాడు వీరానందం.
          "వీరా నీ వ్యాపారం బాగానే ఉందికదా, నీ పని నీవు చేస్తూ ఉండు లేని పోని ఆశలతో మనశ్శాంతి కోల్పోకు"చెప్పాడు సదానందం.
      ఇక సదానందాన్ని సలహాలు అడగటం దండగ అని సదానందం దగ్గర శెలవు తీసుకుని తన ఊరికి బయలు దేరాడు వీరానందం.
        అలా వీరానందం బండి మాట్లాడుకుని ప్రయాణమయ్యాడు.
      అలా అడవి మధ్యలోకి వెళ్ళేసరికి బండి తోలే వాడికి  సుస్తీగా ఉండి ఇక బండి తోలలేక పోయాడు. వీరానందమే బండి తోల సాగాడు. బండి కొంత దూరం వెళ్ళాక ఎందుకో ఆగి పోయింది.
      బండివాడేమో స్పృహలో లేడు.వీరానందానికి భయంపట్టుకుని దిక్కులు చూడసాగాడు.ఇంతలో అక్కడికి ఎక్కడినుండో ఒక ముని వచ్చాడు.బండి ఆగిపోవడం వీరానందం పరిస్థితి అంతా ఆయన గమనించి ఒక మంత్రం చదివి బండివాడికి స్పృహ రప్పించాడు.బండి వాడు నిముషంలో ఆరోగ్య వంతుడయ్యాడు.
       ముని శక్తిని గమనించిన వీరానందంలో ఒక కోరిక కలిగింది.
        "స్వామీ, మీ మహిమను గమనించాను దయచేసి నాకు  బాగా ధనం లభించేటట్టు మీ శక్తితో ఆశీర్వదించండి"అని అడిగాడు.
       "నాయనా ఉన్నదానితో తృప్తిపడు,కష్టపడి ఇప్పడున్న వ్యాపారం వృద్ధి చేసుకో,అనవసరపు కోరికలు పెంచుకోకు"మంచిగా చెప్పాడు.
      అయినా వీరానందం డబ్బు బాగా సంపాదించే మంత్రం చెప్పమని పీడించాడు.
       వీరానందానికి ఆ కోరిక ఎంత ప్రమాదమైనదో తెలియచేయాలని ముని నిశ్చయించి,తన సంచిలోంచి ఒక వెండి పాత్ర తీసి ఇచ్చాడు దానిలో సగానికి బంగార నాణేలు ఉన్నాయి.
       "రోజూ అవసరమైతేనే ఒక నాణెం ఖర్చు పెట్టు  మరలా ఆ నాణెం అందులో పడుతుంది.నీవు కష్ట పడేకొద్దీ నాణేలు చేరి సంపద చేకూరుతుంది,కానీ జాగ్రత్త" అని చెప్పి ఇచ్చాడు.
      వీరానందం ఆయనకు దండం పెట్టి పాత్ర తీసుకుని వెళ్ళాడు.
       ఇక ఆ రోజునుండి ఆ పాత్రలో నాణేలు అయి పోకుండా చూడటమే వీరానందం పని అయి పోయింది,ఉన్న వ్యాపారాన్ని పూర్తిగా విస్మరించాడు అంతే మనశ్శాంతి కోల్పోయాడు.మెల్లగా ఉన్న వ్యాపారం నష్టాల్లో మునిగి పోయింది.
      ఆ దిగులుతో వీరానందం మంచం పట్టాడు! 
అప్పుడే ముని వీరానందం వద్దకు వచ్చి ఈ విధంగా చెప్పాడు.
     " చూడు వీరానందం,నీ వ్యాపారం నీవు చేసుకుంటూ హాయిగా ఉండేవాడివి,ఎక్కువ డబ్బుకావాలని అడిగావు సగం నిండిన వెండిపాత్ర ఇచ్చి కష్ట పడమన్నాను, అయినా నీవు అత్యాశతో ఆ పాత్ర నిండిపోవాలని అత్యాశతో ఆలోచించి మంచం పట్టావు అన్ని దుఃఖాలకు మూలకారణం అత్యాశే" అని ముని వివరించాడు.
     "నా కళ్ళు తెరిపించారు స్వామీ,ఇక నేను అతిగా సంపాదించాలనే ఆశ వదులుకుని నా వ్యాపారం న్యాయ బద్ధంగా వృద్ధి చేసుకుంటాను" అని చెప్పాడు.
   అతని మాటలకు ముని సంతోషించి ఒక మంత్రం జపించి వీరానందం నుదురు తాకాడు.అంతే అతనిలో నూతనోత్సాహం వచ్చింది, ఆ వెండి పాత్ర మాయం అయి పోయింది.
    మరలా మామూలు మనిషయ్యాడు వీరానందం.
వీరానందంలో మార్పుకి ఇంట్లో అందరూ సంతోషించారు.
                **********

కామెంట్‌లు