మరగుజ్జు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  ఒకానొక ఊర్లో ఒక మరుగుజ్జు ఉండేవాడు.వాడి రూపాన్ని చూసి చాలా మంది హేళన చేస్తూ మాట్లాడేవారు.నిజానికి వాడు మంచి వంటగాడు. అయినా వాడికి తగిన మర్యాద లభించేది కాదు! వాడు తన దుస్థితికి బాధ పడేవాడు.
      ఆ ఊరి జమీందారుకి ఓడలు ఉండేవి.ఆయన సముద్రం మీద ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారం చేసీవాడు.మరుగుజ్జుకి ప్రపంచం అంతా చూడాలనే కోరిక ఉండేది.అందుకని వాడు జమీందారు వద్దకు వెళ్ళి,"అయ్యా,నన్నుకూడా మీతో పాటు విదేశాలకి తీసుక వెళ్ళండి,మీకు మంచి వంటలు చేసి పెడతాను"అని వేడుకున్నాడు.
    వాడి వంట పని తనం తెలిసిన జమీందారు వాడిని ఓడ మీద తీసుక వెళ్ళేందుకు అంగీకరించాడు.
     ఓడలో మరుగుజ్జుతో పాటు జమీందారు సహాయకులు కూడా ఉన్నారు.వారు అలా ప్రయాణించి ఒక దీవి మీద లంగరు వేసి అందరూ విశ్రాంతి కోసం దిగారు!అక్కడ చితుకులు పోగుచేసి మరుగుజ్జు వంట మొదలు పెట్టాడు.ఆ ద్వీపంలో ఒక రాక్షసుడు ఉంటున్నాడు.వాడు నిద్ర పోతున్నాడు.కానీ మరుగుజ్జు వంటనుండి వచ్చే ఘుమఘుమలు వాడిని నిద్ర లేపాయి! వాడు ఆ వాసనలకు ఆశ్చర్య పోయి లేచి ఆ వంట వండే ప్రదేశానికి వచ్చాడు.వాడి భీకర ఆకారాన్ని చూసి అందరూ భయపడి తలో దిక్కు పరుగెత్తడం మొదలు పెట్టారు.అయినా ఏ మాత్రం భయంలేకుండా మరుగుజ్జు వండుతూనే ఉన్నాడు! అంత పొట్ఠిగా ఉన్నవాడు తనని చూసి భయపడకుండా అక్కడే ఉండటం చూసి రాక్షసుడు ఆశ్చర్య ఫోయాడు.
       "రాక్షస మహానుభావా, మీకు మంచి రుచికరమైన వంట చేసి పెడతాను.దయచేసి తినండి,అదీ చాలకపోతే నన్నుతినండి,అంతేకానీ వారిని మటుకు తినకండి"అని ఓడ లో వచ్చిన వాళ్ళను చూపించి చెప్పాడు.
     వాడు అంత పొట్టిగా ఉన్నా వాడి వంట నిపుణత, పరోపకార గుణం రాక్షసుణ్ణి సైతం కదిలించింది. వాడు రాక్షసుడితో అన్నమాటలు జమీందారు విని ఆశ్చర్య పోయాడు.అందరూ వాడిని ఇన్నాళ్ళూ అవహేళన చేస్తున్నా,అందరి కోసం వాడు ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమైనపుడు వాడు అందరికన్నా ఎత్తైన వాడిగా జమీందారుకి కనబడ్డాడు. ఇదంతా అదృశ్యంగా ఒక గంధర్వుడు గమనించసాగాడు. మరుగుజ్జు తన మంచితనంతో రాక్షసుడి మనసు సైతం దోచుకన్నందుకు గంధర్వుడు మరుగుజ్జుని అందమైన యువకుడుగా మార్చాడు.
మంచిగా మారిన రాక్షసుడికి కూడా మానవరూపం ఇచ్చాడు.అప్పుడు గంధర్వుడు అందరికీ కనబడ్డాడు.
       "మీ మంచి తనానికి ముగ్ధిణ్ణి అయ్యాను,ఇక మీరు మారిన రూపాలతో అందరికీ మంచి చేస్తూ ఉండండి"అని చెప్పి అదృశ్యమయిపోయాడు.
      జమీందారు మామూలు మనుషులుగా మారిన రాక్షసుణ్ణి,మరుగుజ్జు ను ఓడలో ఎక్కించుకుని ఊరికి తీసుక వెళ్ళి యువకుడిగా మారిన మరుగుజ్జుకి తన కూతురునిచ్చి వివాహంచేశాడు.మనిషిగా మారిన రాక్షసుడికి తన దివాణంలో మంచి ఉద్యోగం ఇచ్చాడు.కథ ఊరికి మనం మరో కథ వ్రాయడానికి వెళదాం.
            ***************
మీకు తెలుసా? 
    'బొంబార్డియన్ బీటిల్' అనే పురుగు ప్రమాదం ఎదురైనప్పుడుతన పొట్టలోని కెమికల్స్ శత్రువుమీదకు చిమ్ముతుంది!
            ***************

కామెంట్‌లు