ఈ మధ్య పిచుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.దీనికి కారణం వాతావరణ కాలుష్యం,సెల్ టవర్లు!
ఈ విధంగా ప్రతి జీవి మీద మనకు తెలియకుండా చేసే తప్పిదాల వలన అనేక జీవులమీద, మనమీద కూడా ప్రభావం ఉంటుంది!
అమెరికాలో కొన్ని ఎడారుల్లో,వర్షారణ్యాలలో కొన్ని రకాల కప్పలు నశించి పోతున్నట్లు కనుగొన్నారు.
1995లో అమెరికాలో కొందరు విద్యార్థులు సరిగ్గా కాళ్ళు ఏర్పడని,అనేక లోపాలుగల కప్పలను గమనించారు!తరువాత శాస్త్రజ్ఞులు ఈ లోపాలు ఏర్పడడానికి గల కారణాలు అన్వేషించారు. అసలు అమెరికాలోనే కాకుండా జపాను,కెనడా వంటి దేశాల్లో కూడా వింతగా ఎక్కువ కాళ్ళు గల కప్పలను గమనించి ఆయా లోపాలపై పరిశోధనలు చేపట్టారు. నెథర్లాండ్లో రంగులు మారిన కప్పలు కనబడుతున్నాయి!
కప్పలు పురుగుల్ని,చిన్న ఆకుల్ని తింటాయి.నీటిలోనూ భూమి మీద (ఆంఫీబియన్స్) కూడా మనుగడ సాగించ గలవు.
కప్పలచర్మం కూడా సున్నితమైనదే.కొన్ని రకాల కప్పల చర్మం పారదర్శకంగా ఉంటుంది.వీటిలో కప్పలోపలి అవయవాలు బయటికి కనబడుతాయి!
వాతావరణంలో కాలుష్యం ఏర్పడితే ఇటువంటి కప్పలలో అనూహ్య మార్పులు జరగవచ్చు.కొన్ని రకాల ఫంగస్ జబ్బులు కప్పలలో మార్పులు తెస్తున్నట్టు కూడా కనిపెట్టారు.
కప్పలు అనేక రకాల పురుగుల్ని తినివేసి పంటలను రక్షిస్తున్నాయి.చైనా మొదలైన దేశాల్లో కప్పలను తింటారు!మనదేశంలో కప్పలు తినరు.మనదేశం కప్పలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం నిషేదించారు.
యుకాడోరియన్(ecuadorian)కప్ప జాతిచర్మం నుండి తయారు చేసిన రసాయనం నొప్పిని తగ్గించే శక్తివంతమైన మందుగా ఉపయోగ పడుతున్నట్టు కనుగొన్నారు.
1973లో ఆస్ట్రేలియాలో వర్షారణ్యాలలో ఒక చిత్రమైన కప్పను కనుగొన్నారు.ఆ కప్ప తన గుడ్లను తనేమింగి కడుపులో పిల్లల్ని పొదుగుతుంది! గుడ్లు పొదిగే సమయంలో కడుపులో స్రవించే ఆమ్లాలు,జీర్ణరసాలు ఆగిపోతాయి!కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఈ కప్ప జాతి పూర్తిగా నశించిపోయింది! జీర్ణ వ్యవస్థ మీద పరిశోధనలకు అనేక విధాల ఉపయోగ పడవలసిన ఈ కప్ప నశించి పోవడం శాస్త్రజ్ఞులను ఎంతో కలవర పరచింది.
కప్పలు నశించడానికి లేక వాటిలో అంగవైకల్యం కలగడానికి కారణాలను శాస్రజ్ఞులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.ఓజోను పొర నశిస్తుండడం,సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు(ultra violet rays) .కర్మాగారాలనుండి వెలువడే రసాయనాలు,పంటలకు వేసే ఎరువులు,పురుగు మందుల వలన కూడా కప్పలలో మార్పులు సంభవిస్తున్నాయి.
ఒక విధమైన ఫంగస్ జాతి కూడా కప్పల మరణానికి కారణం అవుతున్నది!
ఏది ఏమైనా కప్పలలో జరిగే అంగవైకల్యాలు,వాటి సంఖ్య తగ్గుదల, మానవ జాతికి ఒక హెచ్చరిక అని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఆచార్యుడు డేవిడ్ వేక్ అంటున్నారు.వాతావరణ కాలుష్యం,నీటి కాలుష్యం ఈ కప్ప జాతి సూచిస్తోంది.
మనం అనేక జాగ్రత్తలు తీసుకోకపోతే మనలో కూడా అనేక అనూహ్య మార్పులు చూడవలసి వస్తుందేమో!
కప్పల హెచ్చరిక: -కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి